నెహ్రూకు కీలక బాధ్యతలు

కొద్ది నెలల క్రితమే తెదేపాలో చేరిన విజయవాడ ప్రముఖ నేత, మాజీమంత్రి దేవినేని నెహ్రూను క్రియాశీలంగా వ్యవహరించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెరపైకి తీసుకువచ్చారు. దీనిలో భాగంగా గత ఎన్నికల్లో తెలుగుదశం పార్టీ కోల్పోయిన తిరువూరు, నూజివీడు, గుడివాడ, నియోజకవర్గ బాధ్యతలను దేవినేని నెహ్రూకు ముఖ్యమంత్రి అప్పగించారు. ఈ మూడు నియోజకవర్గాల్లో పార్టీని పటిష్టవంతం చేయడంతోపాటు వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్దులను గెలిపించే బాధ్యతలను నెహ్రూకు అప్పగించారు. రాష్ట్ర పార్టీలో కూడా నెహ్రూకు కీలక పదవిని కట్టపెడతారని, ఆయనకు ఉన్న అనుభవాన్ని, సీనియార్టీనీ పార్టీకి ఉపయోగపడే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

ఎ.కొండూరు మండల ప్రజాప్రతినిధుల వివరాలు

విస్సన్నపేట మండల ప్రజాప్రతినిధుల వివరాలు

గంపలగూడెం మండల ప్రజాప్రతినిధుల సమాచారం


తిరువూరు ప్రజలారా కోటి రూపాయిల పన్నులు ఎప్పుడు కడతారు?

తిరువూరు పురపాలక సంఘంలో ఇంటి, కుళాయిల పన్నుల వసూళ్లు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఆర్థిక సంవత్సరం ముగింపు గడువు సమీపిస్తున్నా ఇప్పటి వరకు 60 శాతం మాత్రమే పన్నులు వసూలు చేశారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఇంటి పన్ను రూ.1.47 కోట్లతో పాటు 2015-16 బకాయి రూ.55 లక్షలు కలుపుకొని మొత్తం రూ.2.02 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు అధికారులు రూ.95 లక్షలు మాత్రమే వసూలు చేశారు. మరో రూ.1.09 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. కుళాయి పన్ను బకాయితో కలుపుకొని రూ.31 లక్షలు వసూలు చేయాల్సి ఉండగా రూ.5 లక్షలు మాత్రమే వసూలు చేశారు. ఆర్నెల్లకు ఒకసారి చొప్పున మీసేవ, ఈసేవ, మున్సిపల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాల ద్వారా ఇంటి పన్నులను చెల్లించుకునే వెసులుబాటు కల్పించారు. నోటీసులు జారీ చేయటానికే పరిమితం కావడంతో ప్రజల నుంచి స్పందన కొరవడింది. దీంతో మార్చి 31 లోపు 95 శాతం పన్ను వసూళ్లు పూర్తి చేయడమే లక్ష్యంగా ఇటీవల ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వసూళ్లు ప్రక్రియ మాత్రం నత్తనడకన సాగుతోంది. ఇంటి, ఆస్తి పన్ను విషయంలో ఏవైనా అభ్యంతరాలున్నా, అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు వీలుగా కార్యాలయంలో పరిష్కార వేదిక ఏర్పాటుచేశారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజల నుంచి వచ్చే అర్జీలను స్వీకరించటంతో పాటు ఇంటి పన్నులను చెల్లించుకుంటారు. మార్చి 31 వరకు పరిష్కార వేదిక పనిచేస్తోంది. పట్టణంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రధానంగా ఇంటి, కుళాయి వంటి పన్నుల ద్వారా ఆదాయం దోహదం చేయనుంది. పాలకవర్గం, అధికారుల నడుమ కొరవడిన సమన్వయలోపంతో ఏటా లక్ష్యాన్ని అధిగమించటానికి ఆపసోపాలు పడుతున్నారు. తిరువూరులో ఏటా మార్చి నెలాఖరులోపు మాత్రమే పన్నులు చెల్లించటానికి ప్రజలు ముందుకు వస్తున్నారని, ఈ ఏడాది కూడా గడువులోపు చెల్లిస్తారని అధికారులు భావిస్తున్నారు.

తిరువూరు మండల ప్రజాప్రతినిధుల వివరాలు

కృష్ణాజిల్లాలో ఏడాది పాటు సాగిన గానుగపాడు రిపబ్లిక్ ఉజ్వల గాధ

పోరాట సమయంలో తీసిన చిత్రం. మధ్య వరుసలో ఎడమ నుండి కుడికి మొదటి వ్యక్తి జలగం వెంగళరావు.

“బయట నుండి వచ్చే కష్ట నష్టాలను మతాల భేదభావం లేకుండా కలిసికట్టుగా ఎదుర్కొందాం” – ఇదే భారతదేశం రిపబ్లిక్‌గా అవతరించకముందు గానుగపాడులో ఏర్పడిన తిరుగుబాటు ప్రభుత్వం తమ పాలనలోని సభ్యులనుండి స్వీకరించిన ప్రమాణ పత్రంలోని ఓ కట్టుబాటు. భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిన అనంతరం ప్రస్తుతం కృష్ణాజిల్లా తిరువూరు మండలంలోని గానుగపాడు దాని శివారు ఆరు గ్రామాలు నిజాం ప్రభుత్వ పాలనలో ఉండేవి. నిజాం నవాబు తన ప్రభుత్వాన్ని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేయడానికి నిరాకరించడంలో ఈ ఆరు గ్రామాల ప్రజల్లో చైతన్యం పెల్లుబికి నిజాం నిరంకుశ పాలనకు స్వస్తి చెప్పాలని స్వంత విధానాలు, ఆదాయ వనరులతో స్వతంత్ర రిపబ్లిక్‌గా ప్రకటించుకున్నారు. తమ ప్రాంతాన్ని తామే పరిపాలించుకోవటం కోసం ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గానుగపాడు కేంద్రంగా ఆరు గ్రామాలు రిపబ్లిక్‌గా ఏర్పడటానికి దారి తీసిన పరిస్ధితులు, ఆ తర్వాత అది భారత దేశంలో విలీనం అయ్యే వరకు జరిగిన సంఘటనలు ఈ విధంగా ఉన్నాయి. గానుగపాడు, పల్లెర్లమూడి, చౌటపల్లి, టేకులపల్లి, కొత్తూరు, చిక్కుళ్లగూడెం గ్రామాలు నిజాం ప్రభుత్వ పాలనలో ఉండేవి. గానుగపాడు గ్రామంలో ఒక జమేదారు, ఐదుగురు పోలీసులతో ఒక నాకా (పోలీస్ స్టేషన్)ను నిజాం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనితో ప్రజలు జాతీయ జెండా ఎగురవేసి “నిజాం గో బ్యాక్”, “ఇండియన్ యూనియన్ జిందాబాద్” అనే నినాదాలతో ఊరేగింపు జరిపారు. ఇదంతా చూసిన నిజాం ప్రభుత్వ ఉద్యోగులకు మింగుడుపడక ఈ ఆరు గ్రామాల ప్రజలను నిర్దాక్షిణ్యంగా అణిచివేయటానికి ప్రయత్నించారు. వీరి దౌర్జన్యాలను సహించలేని ప్రజలు దెబ్బకు దెబ్బ తీయాలనే నిర్ణయానికి వచ్చారు. ఆయుధ శిక్షణా శిబిరాలు రహస్యంగా పని చేయటం ఆరంభించాయి. ఆయుధాలు తయారు చేయడంలో నిష్ణాతులైన తిరువూరుకి చెందిన గుండిమెడ లక్ష్మీనారాయణ (బుల్లోడు), పసుపులేటి వీరయ్యల ఆధ్వర్యంలో పల్లెర్లమూడి గ్రామంలో పోరాటానికి కావల్సిన ఆయుధ సామాగ్రి తయారు చేయడం ప్రారంభించారు. వీరికి సహకరించటానికి సికింద్రాబాద్ నుండి నరసింహసింగ్ అనే అనుభవం కలిగిన ఆయుధాల తయారీదారుడిని పిలిపించారు. పల్లెర్లమూడి గ్రామంలో బ్రహ్మం అనే వ్యక్తి ఇంట్లో ఆయుధ సామాగ్రి తయారీ కర్మాగారాన్ని నెలకొల్పారు. అనంతరం గానుగపాడు గ్రామంలో ఉన్న నాకాపై తిరుగుబాటు జరపడంతో దానిలోని జమేదారు, ఇతర పోలీసులు పలాయనం చిత్తగించారు. నాకాలో ఉన్న ఆయుధ సామాగ్రి, రైతుల భూములకు సంబంధించిన పత్రాలు, ఇతర రికార్డులు, కొంత నగదు పోరాట కమిటీ సభ్యులు స్వాధీనపరుచుకున్నారు. ఈ ప్రభుత్వం రూపొందటానికి సహకరించిన ప్రముఖుల్లో గానుగపాడుకు చెందిన కర్నాట వెంకటరెడ్డి, పాట్రేడు సుబ్బారెడ్డి, గ్రామాధికారుల్ కుటుంబానికి చెందిన కవుటూరు సత్యనారాయణ, సెట్టిపల్లి వెంకటప్పారెడ్డి, శీలం వెంకటరెడ్డి, చిక్కుళ్లగూడెం గ్రామానికి చెందిన టంటు బాలయ్య, పల్నాటి వీరయ్య, కొత్తూరుకు చెందిన గురాల అనిమిరెడ్డి, తోకచిచ్చు పుల్లంరాజు, పల్లెర్లమూడికి చెందిన చీరెడ్డి పెదబసవరెడ్డి, పొట్లిరెడ్డి, చారుగుళ్ల అప్పయ్య, చౌటపల్లి గ్రామానికి చెందిన ఎరుము నాగిరెడ్డి, గుర్రాల చిన కోటిరెడ్డి, కామిరెడ్డి వెంకటరెడ్డి, గొల్లమందల అప్పయ్య, టేకులపల్లి గ్రామానికి చెందిన కామిరెడ్డి రామిరెడ్డి, శీలం అచ్చిరెడ్డి, మంగినపూడి బిచ్చం, పోలిశెట్టిపాడు గ్రామానికి చెందిన కోటేరు రామచంద్రరెడ్డి తదితరులు ఉన్నారు. ప్రముఖ కాంగ్రెస్ నాయకులు టి.హయగ్రీవాచారి, జలగం వెంగళరావు, బొమ్మకంటి సత్యనారాయణరావులు గానుగపాడు రిపబ్లిక్ ప్రభుత్వానికి ప్రధాన సలహాదారులుగా ఉండేవారు. ఈ ప్రభుత్వం 1947 నవంబరు నెల నుండి ప్రజాస్వామిక రాజ్యంగా పాలించడం మొదలుపెట్టింది. రేడియోలోనూ విశేషంగా ప్రచారం లభించింది. గానుగపాడు తిరుగుబాటును విన్న అప్పటి కేంద్ర హోం శాఖా మంత్రి సర్దార్ వల్లభాయి పటేల్ ఆ ప్రాంత ప్రజల జాతీయ భావాలను ప్రశంసించి నిజాం నవాబు నుండి ఏ ఆపద రాకుండా గానుగపాడు ప్రాంతాన్ని కాపాడతామని హామీ ఇచ్చి భారత దేశంలో విలీనం చేయటానికి చర్యలు తీసుకుంటామని స్ధానిక కాంగ్రెస్ నాయకులకు వాగ్ధానం చేశారు. గానుగపాడు రిపబ్లిక్‌లో ముఖ్యమంత్రి, మంత్రులు దాదాపు సంవత్సరం పాటు చక్కని పరిపాలన అనుభవించినట్లు ప్రజలు చెప్తూ ఉంటారు. వెట్టి చాకిరి నిర్మూలించారు. అప్పట్లో కిరోసిన్ దొరక్క ప్రజలు ఇబ్బంది పడుతుండగా, కిరోసిన్, ఇతర నిత్యావసర వస్తువులను సక్రమంగా పంపిణీ చేయించారు. శాంతి భద్రతలు చక్కగా కాపాడారు. మధ్యనిషేధాన్ని కఠినంగా అమలుపరిచారు. పాఠశాలలు నడిపి జాతీయ భావాలు పెంపొందించారు. రైతుల సంక్షేమానికి చెరువులు, కాలువలు తవ్వకం పనులను ప్రజల సాయంతో స్వచ్ఛందంగా చేపట్టారు. జాతీయ నాయకులు జయప్రకాష్ నారాయణ్, టంగుటూరి ప్రకాశం, ఆచార్య రంగా తదితరులు ఈ ఉద్యమ కాలంలో వచ్చి వీరిని ప్రోత్సహించారు. కులమత బేధాలు లేకుండా పరిపాలన చక్కగా సాగింది. హైదరాబాద్ సంస్ధానంలో పరిస్ధితులు తారుమారు కావడం, ఆ సంస్ధానంపై 1948 సెప్టెంబరు 13వ తేదీన సైనిక చర్య జరిగి 17వ తేదీన అది ఇండియన్ యూనియన్‌లో విలీనం కావడం అందరికీ తెలిసిందే. అనంతరం గానుగపాడు రిపబ్లిక్ ప్రత్యేక ప్రభుత్వం రద్దయింది. అందరితో పాటు 1950 జనవరి 26వ తేదీన ఆ ప్రాంత ప్రజలు రిపబ్లిక్ దినోత్సవం జరుపుకున్నారు. ఆనాడు గానుగపాడు రిపబ్లిక్ కమిటీలో పాలుపంచుకున్న యోధులు నేటికీ ఈ ప్రాంతంలో ఉన్నారు.