తిరువూరు లో కోవిడ్ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని ) చెప్పారు. తిరువూరు లో కోవిడ్ ఆసుపత్రి ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఏ .ఎండి .ఇంతియాజ్, స్థానిక శాసనసభ్యులు కొక్కిలగడ్డ రక్షణనిధి తో కలిసి అధికారులతో శుక్రవారం మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ కోవిడ్ సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో కోవిడ్ వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు ప్రతీ నియోజకవర్గంలోనూ కోవిడ్ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. తిరువూరు లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను కోవిడ్ ఆసుపత్రి ఏర్పాటుకు సంబంధించి వారం క్రితమే వైద్యాధికారులతో సమీక్చించామన్నారు . ఆసుపత్రి ఏర్పాటులో అవసరమైన వైద్య పరికరాలు, ఔషదాలు, సిబ్బంది నియామకం , ఇతర మౌలిక సదుపాయాల కల్పన, తదితర అంశాలపై అధికారులతో చర్చించామన్నారు. వైద్యులు, సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిపై నియామకానికి సంబందించి వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా నియమిస్తామన్నారు. అర్హత గల వారు జిల్లా కలెక్టర్ లేదా జిల్లా వైద్య శాఖాధికారిని వారిని కలిసి తమ దరఖాస్తును సమర్పించాలన్నారు. త్వరలో ఏర్పాటు చేయనున్న కోవిడ్ ఆసుపత్రిలో అత్యవసర సేవలకు అవసరమైన ఆక్సిజన్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ను ఏర్పాటు చేస్తున్నామని, వీటిలో 5 కాన్సన్ట్రేటర్స్ జిల్లా కలెక్టర్ అందిస్తారని , మిగిలిన 5 కాన్సన్ట్రేటర్స్ ను తాను అందిస్తానని మంత్రి చెప్పారు. వీటితో పాటు ఆక్సిజన్ సిలెండర్లుకు ఎటువంటి కొరత రాకుండా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లా కలెక్టర్ ఏ .ఎండి .ఇంతియాజ్ మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన ప్రదేశాలలో కోవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ వైరస్ ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంది , ప్రత్యేక చికిత్స అవసరమవుతున్నదన్నారు. చికిత్స విధానం, కోవిడ్ ఆసుపత్రిలో సౌకర్యాలు, వైద్యులు, సిబ్బంది నియామకంపై తదితర అంశాలపై అధికారులతో వైద్యాధికారులతో విస్తృతంగా చర్చిండం జరిగిందన్నారు. రెండు, మూడు రోజులలో తిరువూరులో కోవిడ్ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని కలెక్టర్ చెప్పారు.
శాసనసభ్యులు కొక్కిలగడ్డ రక్షణనిధి మాట్లాడుతూ తిరువూరు జిల్లాకు చివరన ఉండడంతో కోవిడ్ వ్యాధిగ్రస్తులు చికిత్స కోసం విజయవాడ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లడం, అక్కడ బెడ్స్ లేకపోవడం తదితర సమస్యల కారణంగా తిరువూరు పరిసర ప్రాంతాలలోని ప్రజల సౌకర్యార్థం తిరువూరు లో కోవిడ్ ఆసుపత్రి ఏర్పాటు చేయవలసిందిగా ముఖ్యమంత్రి ని కోరడం జరిగిందని, వెంటనే ఈ ప్రాంతానికి కోవిడ్ ఆసుపత్రిని మంజూరు చేసారని కృతఙ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. సుహాసిని, జిల్లా ఆస్పత్రి సేవల సమన్వయాధికారి డా. జ్యోతిర్మయి, డిప్యూటీ డి.ఎం.హెచ్. ఓ. డా. డి ఆశ , మునిసిపల్ చైర్ పర్సన్ కస్తూరిబాయి , మునిసిపల్ కమీషనర్ కె.వి.ఎస్.ఎన్ . శర్మ, తహసీల్దార్ స్వర్గం నరసింహారావు, ఎంపిడిఓ బి. వెంకటేశ్వరరావు, ప్రభృతులు పాల్గొన్నారు. అంతకు ముందు ఆసుపత్రి ని మంత్రిని అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం వ్యక్తిగత పరిశుభ్రత కిట్లను మంత్రి పేర్ని నాని , కలెక్టర్ ఇంతియాజ్ ప్రజలకు పంపిణి చేసారు.
———————————————————————————————————–
( డివిజినల్ పౌర సంబందిధికారి, నూజివీడు వారిచే జారీ చేయబడినది )