ఇంటర్‌లో ఇరగదీసిన తిరువూరు అమ్మాయిలు


Photo: Ayesha
ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షా ఫలితాలు నేడు విడుదల అయ్యాయి. ఈ పరీక్షల్లో కృష్ణాజిల్లాకు చెందిన విద్యార్ధులు రాష్ట్రంలోనే ప్రథమ స్థానాన్ని సంపాదించారు. మరోసారి మన జిల్లా విద్యార్ధులు ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. ఇంటర్ ఫలితాల్లో తిరువూరు బాలికలు కూడా అగ్రస్థానంలో నిలిచి రాష్ట్రస్థాయిలో తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. తిరువూరు నాగార్జున కళాశాలా విద్యార్థిని బైపీసీలో 990 మార్కులు సంపాదించి రాష్ట్ర స్థాయిలో నాలుగో స్థానాన్ని పొందింది. స్థానిక శ్రీనిధి కళాశాల విద్యార్ధిని కొత్తగుండ్ల సాయిశ్రీ జోష్న 984మార్కులు సంపాదించి మన డివిజన్‌లో ప్రథమ స్థానంలో నిలిచింది. 983 మార్కులతో దారా మనోజ్ఞ, 982 సి.హెచ్.మౌనిక, 980మార్కులతో వీ.రిషిత 979మార్కులతో జీ. విజయశ్రీ తమ సత్తా చాటారు. జిల్లా కలెక్టర్ బీ.లక్ష్మీకాంతం ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ చూపిన తిరువూరు అమ్మాయిలను ప్రత్యేకంగా అభినందించారు.

TVRNEWS చెప్పిందే జరిగింది–”కంచి కంప దూకేశారు.”

మొత్తం మీద మార్క్ ఫెడ్ అద్యక్షుడు కంచి రామారావు తన రాజకీయ చివరిదశలో కంప దూకేశారు.గతంలో మేము చెప్పినట్లుగానే ఆయన తెలుగుదేశంలోకి దూకేశారు. కంచి రామారావుతో పాటు స్థానికంగా ఉన్న ఆయన అనుచరులందరూ ఇప్పటి వరకు తెలుగుదేశంలోకి ప్రవేశించలేదు. కంచి రామారావు రాకతో తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఏవిధంగా బలపడుతుంది? అనే విషయం గురించి వేచి చూడవలసి ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం పట్ల కాపుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈదశలో అదే సామాజిక వర్గానికి చెందిన కంచి రామారావు తెలుగుదేశంలో చేరారు. పార్టీ ఆదిస్థానం కూడా కంచి రామరావును సాధనంగా ఆహ్వానించింది. కంచి ప్రవేశం మూలంగా ఇటు స్థానికంగానూ, అటు రాష్ట్రంలోనూ తెలుగుదేశం పార్టీకి ఎంత వరకు మేలు జరుగుతుందనే విషయం గురించి వేచి చూడవలసిందే.
**మరొక పక్క కంచి రామారావు తెలుగుదేశంలోకి వెళ్ళడం పట్ల తిరువూరు నియోజకవర్గంలో ఉన్న ఆయన అనుచరుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇన్నాళ్ళు కాంగ్రెస్ వారిగా ఉండి ఆ పార్టీ మద్దతుతో ఆర్ధికంగానూ, రాజకీయంగానూ బలపడిన కంచి రామారావు తన వృద్దాప్యంలో పార్టీ ఫిరాయించి ఏమి సాధిస్తారని? ఆయన అనుచరులు బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. మరొకపక్క తెలుగుదేశంలో కంచి రామరావు ప్రవేశం పై ఒక్క స్వామిదాస్ దంపతులు తప్ప మిగిలిన నాయకులు, కార్యకర్తలు అంత సంతోషంగా లేరు. వచ్చే ఎన్నికల్లో కంచి రామారావుతో పాటు ఆయన అనుచరులు కూడా పార్టీలోకి వస్తేనే కొంతవరకు మేలు జరుగుతుందని స్థానిక తెలుగుదేశం వర్గాలు భావిస్తున్నాయి. కంచి తెలుగుదేశంలో ప్రవేశానికి సంబంధించి గతంలో మేము ఇచ్చిన కధనాన్ని ఈ దిగువ తిరిగి ఇస్తున్నాము.
+++++++++++++++++++++++
“కంచి”…కంప దూకేస్తారా?
కాకలు తీరిన రాజకీయ యోధుడు, కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుడు, కృష్ణాజిల్లా తిరువూరుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు కంచి రామారావు(76) ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారంటూ గత కొద్ది రోజుల నుండి వార్తలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో పలు ఉన్నత పదవులను కంచి రామారావు అలకరించారు. ఉడా చైర్మన్‌గా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, డి.సి.ఎం.ఎస్ అధ్యక్షుడిగా ఆయన పదవులు నిర్వహించారు. నాలుగేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో అత్యున్నతమైన రాష్ట్ర మార్క్‌ఫెడ్ అధ్యక్ష పదవిని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కంచి రామారావుకు అప్పగించింది. తిరువూరులో తొలినాళ్ల నుండి కాంగ్రెస్ పార్టీకి కంచి రామారావు పెద్ద దిక్కుగానే ఉన్నారు. తిరువూరు ఎమ్మెల్యేలుగా పేట బాపయ్య, కోనేరు రంగారావులు ఉన్నప్పటికి తెర వెనుక ఉండి కంచి రామారావే చక్రం తిప్పేవారు. కాంగ్రెస్ పార్టీకి కంచి ఎంత సేవలు అందించారో అంతకు ఎక్కువగానే ఆ పార్టీ ఆయనను గౌరవించింది. ఉన్నత పదవులతో పాటు ప్రముఖ వ్యాపారవేత్తగానూ కంచి రామారావు రాణించారు-రాణిస్తున్నారు!
*** నిత్య అసమ్మతివాది
కంచి రామారావు ఎన్ని పదవులు అలంకరించినా ఆయన నిరంతరం ఇంకా అసంతృప్తితోనే ఉండేవారు. తన రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిన అప్పటి మంత్రి కోనేరు రంగారావుపైనా ఆయన తిరుగుబాటు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే కంచి రామారావు అందరు నేతలతోను సన్నిహిత సంబంధాలనే కొనసాగించారు. అసంతృప్తి, అసమ్మతిని కొంత కాలం వరకే కొనసాగించేవారు. తాను అనుకున్నది సాధించగానే అందరితో కలిసిపోయే వ్యక్తి కంచి రామారావు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తిరువూరు నియోజకవర్గం నుండి తమ అభీష్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అధిష్ఠానం రాజీవ్‌రతన్‌కు టికెట్ ఇవ్వడంతో కంచి రామారావు కాంగ్రెస్ నాయకత్వంపై తిరుగుబాటు చేశారు. ఒకరకంగా యుద్ధాన్నే ప్రకటించారు. గత రెండున్నరేళ్ల నుండి కాంగ్రెస్ సమావేశాలకు, ఆ పార్టీ నేతలకు దూరంగానే ఉంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతోనూ, ఇతర తెలుగుదేశం నేతలతోనూ సయోధ్యను సాగిస్తున్నారు.
*** కంప దూకడం అవసరమా?
ప్రస్తుతం కంచి రామారావు పదవీకాలం మరి కొద్ది నెలల్లో ముగియబోతోంది. ఈ పరిస్థితుల్లో తన భవిష్యత్ ఏమిటనేది కంచి రామారావు ఆలోచనల్లో పడినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ కంచి రామారావును రా…రమ్మని ఆహ్వానం పలుకుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కాపు సామాజిక వర్గం చంద్రబాబుకు క్రమేపీ దూరం అవుతున్న నేపథ్యంలో కంచి రామారావు లాంటి సీనియర్ కాపు నేతల అవసరం తెలుగుదేశం పార్టికి చాలా ఉంది. మరోపక్క కంచి రామారావుకు తెలుగుదేశం పార్టీ అవసరం కూడా చాలా ఉంది.
*** మేము రాము పో….!
కంచి రామారావు పరిస్థితి ప్రస్తుతం ఎటు తేల్చుకోలేని స్థితిలో ఉంది. గత నాలుగు రోజుల నుండి తన సన్నిహితులు, అభిమానులతో ఆయన ముమ్మరంగా చర్చలు జరుపుతున్నారు. పుట్టినప్పటి నుండి తనను పెంచి పోషించిన కాంగ్రెస్ పార్టీలో కొనసాగటమా? లేక తన మిగిలిన భవిష్యత్ కోసం తెలుగుదేశంలో చేరటమా? అనే విషయంపై మద్దతుదారులతో చర్చలు జరుపుతున్నారు. కంచి రామారావుకు స్థానికంగా కుడి, ఎడమ భుజాలుగా ఉన్న ముఖ్య అనుచరులు ఉప్పలపాటి లక్ష్మీదాస్, కోటగిరి వెంకట్రావులు తెలుగుదేశంలోకి కంచి ప్రవేశించడం పట్ల అభ్యంతరం వ్యక్తపరుస్తున్నారు. కంచి వెళ్లినా తాము మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉంటామని అంటున్నారు. స్థానికంగా ఉన్న కాపు నేతల నుండి కూడా కంచి పార్టీ మారటం పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో కంచి రామారావు నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూద్దాం.—కిలారు ముద్దుకృష్ణ

ముష్టికుంట్లలో పుట్టాడు. మద్రాసులో మెరిశాడు. ఆదర్శప్రాయుడు గద్దె రంగయ్యనాయుడు.

స్వాతంత్ర్య ఉద్యమంలో ఎందరో యోధులు తమ జీవితాన్ని దేశం కోసం ధారపోశారు. నష్టాలకు మరొక చాలా ఏళ్ల పాటు జైళ్లలో మగ్గారు. అటువంటి వారిలో కృష్ణాజిల్లా తిరువూరు మండలం ముష్టికుంట్ల గ్రామానికి చెందిన గద్దె రంగయ్యనాయుడు ఒకరు. చిన్నతనంలోనే ఇంటిని వదలి చెన్నైకి చేరి అక్కడే స్వాతంత్ర్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1943లో కాంగ్రెస్ పార్టీ తరపున శాసనసభలో ఎన్నికయ్యారు. మద్రాసు మున్సిపల్ కార్పోరేషన్ లో 24ఏళ్ల పాటు కౌన్సిలర్ గా సేవలు అందించారు. మద్రాస్ లో ఆంధ్రా మహా సభల స్థాపనలో రంగయ్యనాయుడు ప్రముఖ పాత్ర పోషించారు. నాయుడికి సంబంధించి మిగిలిన వివరాలు.
gdde rangaiah naidu

మెరుగైన సేవలే లక్ష్యం :కంచి రామారావు

*పదవీ కాలం పొడిగించినందుకు ధన్యవాదాలు
తన పదవీకాలం ఆరు నెలలు గడువు పోడిగించినందుకు తెదేపా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు కు ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సహాకార సంఘాలన్నీ తీర్మానం చేసి పంపినట్లు మార్క్ ఫెడ్ చైర్మన్ కంచి రామారావు తెలిపారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు శుక్రవారం తిరువూరు వచ్చిన ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రైతులు పండించిన ఉత్పత్తులకు మద్దతు ధరకు ప్రతి గింజ కొనుగోలు చేసి, మెరుగైన సేవలు అందించటానికి కృతజ్ఞతతో ఉన్నట్లు చెప్పారు.
kanchi rama rao chandrababu tiruvuru news tiruvuru news tvrnews.com tvrnews krishna district congress telugu desam

నాటక రంగం అభివృద్ధి కోసం విశేష కృషి చేస్తాను–గుమ్మడి గోపాలకృష్ణ

tvrnews.com gummadi gopalakrishna tiruvuru news
ఒకప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంచి వెలుగులు విరజిమ్మిన నాటక రంగానికి తిరిగి పూర్వ వైభవం తీసుకురావడానికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఏపీ నాటక అకాడమీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన గుమ్మడి గోపాలకృష్ణ వెల్లడించారు. శనివారం రాత్రి తిరువూరు త్యాగరాజ గాన కళా సమితి 64వ వార్షిక వేడుకల సందర్భంగా పశ్చిమ కృష్ణా ప్రాంతంలో ఉన్న కళాకారులు గోపాలకృష్ణను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గోపాలకృష్ణ మాట్లాడుతూ నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకువస్తానని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రంగస్థల కళాకారులతో త్వరలోనే ఒక సదస్సును నిర్వహిస్తామని తెలిపారు. నాటకరంగంలో నూతన కళాకారులు ప్రవేశించే విధంగా శిక్షణా తరగతులు అన్ని జిల్లాలో నిర్వహిస్తామని తెలిపారు. నాటకాల్లో నూతన సాంకేతిక పద్ధతులను ప్రవేశపెడతామని సినిమాలకు దీటుగా నాటకాలను కూడా తీర్చిదిద్దుతామని గుమ్మడి పేర్కొన్నారు. తిరువూరు, మైలవరం, నూజివీడు జమీందార్లు నాటక రంగ అభివృద్ధికి, కళాకారులను పోషించడానికి ప్రత్యేక శ్రద్ధ చూపారని ఈ ప్రాంతంలో ప్రభుత్వం తరపున కళాకారుల శిక్షణ కోసం ఒక ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సీనియర్ పాత్రికేయులు కిలారు ముద్దుకృష్ణ, గుమ్మడి గోపాలకృష్ణను సభకు పరిచయం చేశారు. రాష్ట్ర మార్క్‌ఫెడ్ అధ్యక్షుడు కంచి రామారావు మాట్లాడుతూ నాటక అకాడమీకి మంచి కళాకారుడైన గుమ్మడి గోపాలకృష్ణను అధ్యక్షునిగా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. తిరువూరు ప్రాంతంలో స్వాతంత్ర్యానికి పూర్వం నుండి పెద్ద సంఖ్యలో నాటకాలు వేసేవారని…వల్లం నరసింహారావు, సుంకర సత్యనారాయణ వంటి కళాకారులూ ఈ ప్రాంతం నుండి వచ్చారని తెలీపరు. స్థానికంగా మంచి కళాకారులు ఉన్నారని, అనేక నాటక సమాజాలు ఇక్కడ వెలిశాయని కంచి పేర్కొన్నారు. తిరువూరు శాసనసభ్యుడు కొక్కిలిగడ్డ రక్షణనిధి మాట్లాడుతూ తిరువూరు ప్రాంతంలో నాటక రంగం అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని, ఇక్కడ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని గోపాలకృష్ణను ఎమ్మెల్యే కోరారు. ప్రముఖ రంగస్థల నటుడు, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ మాట్లాడుతూ గుమ్మడి గోపాలకృష్ణ గొప్ప కళాకారుడని, కృష్ణుని వేషంలో ఎన్టీఆర్ తరువాత గుమ్మడి రాణించారని తెలిపారు. నాటక రంగం అభివృద్ధికి, కళాకారులను ప్రోత్సహించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తిరువూరు తదితర ప్రాంతాల్లో ఉన్న రంగస్థల కళాకారులు గోపాలకృష్ణను ఘనంగా సత్కరించారు. తిరువూరు త్యాగరాజ గాన కళా సమితి తరుపున కార్యదర్శి మురుకుంట్ల సీతారామలింగేశ్వరశర్మ గుమ్మడిని సత్కరించారు. కళాకారుల తరపున వీ. శ్రీనివాసరావు, వాణి రంగారావు, పసుపులేటి వెంకయ్య, పీ.మధుసూదనరెడ్డి, తేజా, ప్రసాద్ తదితరుల ఆధ్వర్యంలో గుమ్మడిని సత్కరించారు. అనంతరం సత్యసాయి సేవ నాట్యా మండలి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ రాయబారం నాటకాన్ని ప్రదర్శించారు.తిరువూరులో దూకుడు పెంచిన వైకాపా

తిరువూరు శాసనసభ్యుడిగా ఎన్నికై దాదాపు నాలుగు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు నిద్రావస్థలో ఉన్న వైకాపాకు చెందిన ఎమ్మేల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి ప్రస్తుతం జరుగుతున్న జన్మభూమి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఎమ్మెల్యేగా తన వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహించారని తొలిసారిగా స్థానికంగా ఉన్న వైకాపా పార్టీ నాయకులు, కార్యకర్తలు రక్షణనిధిని అభినందిస్తున్నారు. ఎన్నికైనప్పటి నుండి ఇలాగే ఉంటే తిరువూరులో వైకాపా చాలా బలంగా ఉండేదని ఆ పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. రాజకీయాల్లో కేవలం మంచితనం పనికిరాదని ప్రస్తుత రాజకీయాల్లో దూకుడు ప్రదర్శిస్తేనే పార్టీ కార్యకర్తలు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తారని ఆ పార్టీలో అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైకాపా బలంగా ఉన్న పుట్రేల జన్మభూమి సభలో రక్షణనిధి తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలను సమర్థవంతంగానే ఎండగట్టారు. తాను చూపించిన లబ్ధిదారులు ఎవరికీ ఫించన్లు, ఇళ్ల స్థలాలు, ముఖ్యమంత్రి సహాయ నిధిని మంజూరు చేయలేదని, ఎన్నికైన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను తెలుగుదేశం ప్రభుత్వం చులకనగా చూస్తోందని రక్షణనిధి ఆరోపణలు గుప్పించారు. మరుసటి రోజు తిరువూరులో జరిగిన జన్మభూమి సభలో ఎమ్మెల్యే రక్షణనిధి ఇదే విధంగా ఆరోపణలు చేశారు. సుధారాణి-స్వామిదాస్ దంపతులు రక్షణనిధిపై ఎదురుదాడికి దిగారు. తెలుగుదేశం కార్యకర్తలు కూడా వైకాపా కార్యకర్తలతో ఘర్షణకు దిగి జన్మభూమి సభను రాజకీయ వేదికగా మార్చారు. మరొక పద్నాలుగు నెలలు వ్యవధిలో సాధారణ ఎన్నికలు వస్తున్నాయి. రక్షణనిధి గతంలో లాగా “మొద్దబ్బాయి” మంచబ్బాయిలాగా ఉంటే సరిపోదని, ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులు కూడా రక్షణనిధిపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రక్షణనిధి దూకుడు పెంచారు. భవిష్యత్‌లో తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం వైకాపాల మధ్య రాజకీయ వాతావరణం వేడెక్కే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తమ స్థానాన్ని కాపాడుకోవడానికి వైకాపా, మూడు సార్లు పరాజయం నుండి విజయం వైపు దూసుకు వెళ్లే విధంగా తెలుగుదేశం పార్టీ చురుగ్గా పావులు కదుపుతున్నాయి. మొత్తం మీద ఇప్పటి వరకు రాజకీయంగా స్తబ్దుగా ఉన్న తిరువూరులో ప్రజలకు పసందైన రాజకీయ విందు తరచుగా కనిపించబోతోంది.– కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్
tvrnews.com tiruvuru kaburlu tiruvuru news rakshananidhi tiruvuru mla

తిరువూరులో నూతన సంవత్సర హడావుడి-చిత్రాలు

tvrnews tiruvuru news tiruvuru kokkiligadda rakshananidhi new year 2018 tiruvuru krishna district
కృష్ణా జిల్లా తిరువూరు పరిసర ప్రాంతాల్లో 2018 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసనసభ్యుడు కొక్కిలిగడ్డ రక్షణనిధి విస్సన్నపేట, తిరువూరుల్లో వేడుకల్లో పాల్గొన్నారు. ఆయనను స్థానిక ప్రజలు గజమాలతో సత్కరించారు. మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ నివాసానికి స్థానికులు పెద్దసంఖ్యలో తరలివచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తిరువూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తాళ్లూరి రామారావు తదితరులు విజయవాడ వెళ్లి ఎంపీ నానికి శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ఆలయాలు, చర్చిల్లో అర్ధరాత్రి వరకు వేడుకలు నిర్వహించారు.


తిరువూరు మార్కెట్ కమిటి చైర్మన్ పదవి కోసం తన్నుకు ఛస్తున్నారు.

గత మూడు పర్యాయాల నుండి ఎమ్మెల్యేగా తెలుగుదేశం అభ్యర్ధిని గెలిపించలేని నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు చాలా మంది…తమకు ప్రస్తుతం ఖాళీగా ఉన్న తిరువూరు మార్కెట్ కమిటి చైర్మన్ పదవి ఇవ్వాలని అధిష్టానం వద్ద పైరవీలు ప్రారంభించారు. ఈసారి తెలుగుదేశం పార్టీ అధిష్టానం మాత్రం తిరువూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి సత్తా, దమ్ము ఉన్న నాయకుడికే ఇవ్వాలని భావిస్తోంది. దాని కోసం వివిధ మార్గాలలో సమాచారాన్ని పార్టీ రాష్ట్ర నాయకత్వం తెప్పించుకొంటుంది.

** గత రెండు సంవత్సరాల నుండి ప్రాధాన్యత కలిగిన తిరువూరు మార్కెట్ కమిటి చైర్మన్ పదవీ తిరువూరు మాజీ సర్పంచ్ తాళ్లూరి రామారావు నిర్వహించారు. పరిపాలనలో కాస్తో కూస్తో ఆయన ముద్ర వేశారు. రైతు బజారు ఏర్పాటు చేయటంలో శ్రద్ధ వహించారు. ఈ పర్యాయం కూడా ఎంపీ కేశినేని నాని సహాయ సహకారాలతో ముచ్చటగా మూడోసారి తనకే చైర్మన్ పదవి కేటాయించాలని తాళ్లూరి రామారావు అధిష్టానం వద్ద మారాం చేస్తున్నారు.

** 2019లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్ధిని గెలిపించే బాధ్యత మార్కెటింగ్ కమిటి చైర్మెన్‌పై చాలా ఉంటుంది. నేర చరిత్ర, అవినీతి వంటి ఆరోపణలు ఉన్న నాయకులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పదవి ఇవ్వకూడదని ఒక పక్క నాయకత్వం భావిస్తూ ఉండగా, మరొక పక్క నియోజకవర్గంలోని తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ఎ.కొండూరు మండలం నుండి అలవాల రమేష్‌రెడ్డి, గంపలగూడెం మండలం నుండి యనమద్ది నాగమల్లేశ్వరరావు, దేవభక్తుని సీతారాంప్రసాద్, తిరువూరు మండలం నుండి కిలారు రమేష్, సుంకర కృష్ణమోహన్, విస్సన్నపేట మండలం నుండి నెక్కలపు శ్రీనివాసరావు చైర్మన్ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న నియోజకవర్గ కన్వీనర్ స్వామిదాస్ ఈ నెలాఖరుకు తిరిగి వస్తున్నారు. ఆయన వచ్చిన అనంతరం అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది. గతంలో తిరువూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవీ తాళ్లూరి రామారావుకు ఇప్పించటానికి ఎంపీ కేశినేని నాని గట్టిగా ప్రయత్నించి ఆ పదవిని ఇప్పించారు. ఈ పర్యాయం తనమాటే చెల్లుబాటు కావాలని స్వామిదాస్ కోరుతున్నట్లు సమాచారం. తన వ్యాపార భాగస్వామి, ముఖ్య అనుచరుడు రమేష్‌రెడ్డి వైపే స్వామిదాస్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. పార్టీ అధిష్టానం నిర్ణయం ఎలాగ ఉంటుందో వేచి చూద్దాం.––కిలారు ముద్దుకృష్ణ.