తిరువూరులో ఇప్పటివరకు నమోదు అయిన కరోనా కేసులపై స్పష్టతను ఇవ్వని అధికారులు తాజాగా మరోసారి స్థానికంగా కరోనా కలకలం రేపారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం 10మందికి చేపట్టిన రాపిడ్ పరీక్షల్లో ఇరువురికి పాజిటివ్ ఫలితం రాగా వారి నమూనాలు విజయవాడకు ధృవీకరణ నిమిత్తం పంపినట్లు సమాచారం. ఈ కారణంగా స్థానిక అధికారులు ప్రకటనలు వెలువరించలేదు. ఈ కేసుల ధృవీకరణకు మరికొంచెం సమయం పట్టే సూచనలు ఉన్నాయి.
Category: తాజా వార్తలు
తాజా వార్తలు
తిరువూరును ముంచెత్తిన వరదలు. భారీగా నష్టం.
తిరువూరు పరిసర ప్రాంతాల్లో సోమవారం రాత్రి దాదాపు నాలుగు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. పల్లపు ప్రాంతాలు జలమయ్యాయి. చాలా ప్రాంతాల్లోకి నీరు ప్రవేశించి పేదప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. తిరువూరులోని భగత్‌సింగ్‌నగర్ కాలనీ, సుందరయ్య కాలనీ తదితర లోతట్టు ప్రాంతాలన్నీ వరదముంపుకు గురయ్యాయి. రోలుపడి శివారు రాజీవ్‌నగర్‌లో ఒక గృహం పూర్తిగా కూలిపోయింది. 12 గృహాల్లోకి నీరు ప్రవేశించడంతో అందులో నివసిస్తున్న వారిని సమీపంలోని పాఠశాలకు తరలించారు. కోకిలంపాడు పరిసర ప్రాంత పంటపొలాలు అన్నీ ముంపునకు గురయ్యాయి. కట్టలేరు, ఎదుళ్ల, పడమటి వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. తిరువూరు మండలం మల్లేల వద్ద ఒక చేపల లోడు లారీ బోల్తా పడింది. అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. తిరువూరు పట్టణంలో మంచినీరు సరఫరా చేసే మోటార్లు, పైప్లైన్లు వరదముంపునకు గురికావడంతో మూడురోజుల పాటు సరఫరా ఉండదని మున్సిపల్ అధికారులు ప్రకటన జారీచేశారు.
తిరువూరులో కరోనా పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి
కృష్ణాజిల్లా తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ తన గృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న పట్టణంలో కరోనా వైరస్ కలకలంతో ప్రజలు భయభ్రాంతులకు గురవౌతున్నారని అన్నారు. స్థానిక వస్త్రవ్యాపారి మాతృమూర్తి కరోనాతో మృతిచెందగా 60మంది ఉద్యోగులకు చేసిన పరీక్షల్లో పొంతన లేని వివరాలు వెల్లడిస్తున్నారని ఆయన మండిపడ్డారు. 50000 జనాభా కలిగిన తిరువూరులో కరోనా పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 60మంది కరోనా పరీక్షా ఫలితాలపై స్పష్టత ఇవ్వాలని కోరారు.
తిరువూరులో ప్రభుత్వ యంత్రాంగం పని చేస్తోందా?
59 మంది కరోనా అనుమానితులు పరీక్షలు చేసి ఐదు రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు ఫలితాలను ఎందుకు ప్రకటించలేదు? ప్రజలు భయాందోళనకు గురి అవుతుంటే పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. మన ఎమ్మెల్యే రక్షణనిధి ఎక్కడ? తక్షణమే ఆయన స్పందించి తిరువూరులో కరోనా వ్యాధి నిరోధక చర్యలు పకడ్బందీగా చేపట్టాలి. కరోనా పరీక్షా ఫలితాలను తక్షణమే వెల్లడించాలి. స్వామిదాస్ డిమాండ్…..
తిరువూరులో కొనసాగుతున్న టెన్షన్…టెన్షన్!
తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం నిర్వహించిన 59మంది కరోనా అనుమానితుల నిర్ధారణ పరీక్షల్లో ఈ రోజు ఉదయం రెండు పాజిటివ్ కేసులుగా నమోదు అయినట్లు సమాచారం. అధికారులు దీన్ని ధృవీకరించవల్సి ఉంది. మిగిలిన కేసులకు సంబంధించిన ఫలితాలు రేపు ఉదయం తెలుస్తాయని అధికారులు అంటున్నారు. ఈ రోజు పాజిటివ్‌గా నమోదు అయిన రెండు కేసుల్లో ఒకటి దుకాణం యజమానికి మరొకటి దుకాణంలో పనిచేసే గుమాస్తాకు కరోనా సోకినట్లు సమాచారం. పాజిటివ్ ఫలితం వచ్చిన ఇరువురు వ్యక్తులను మెరుగైన చికిత్స కోసం కోవిడ్ ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు జరిగి మూడురోజులు దాటుతున్నప్పటికీ పూర్తి ఫలితాలు వెల్లడి కాకపోవడంతో తిరువూరు ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మంగళవారం నాడు అయినా పూర్తి ఫలితాలతో కూడిన వివరాలు వెల్లడించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. మరొకపక్క తిరువూరులో లాక్‌డౌన్‌ను అధికారులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. బోసుబొమ్మ సెంటరు నుండి రాజుపేట సెంటరు వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయిన సాయిబాబా గుడి బజారును అధికారులు పూర్తిగా మూసివేశారు. రాకపోకలను నిషేధించారు.
కరోనా పరీక్షా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న ప్రజలు
తిరువూరు: తిరువూరులో కరోనా సోకి మమ్మీడాడీ యజమానుల తల్లి సోమవారం నాడు మృతి చెందగా ఆ సంస్థలో పనిచేస్తున్న యజమానులకు, సిబ్బందికి, పది మంది బయట వ్యక్తులకు శుక్రవారం నాడు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు. చౌటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి, కరోనా నోడల్ అధికారి డా.గంగాధర కుమార్ ఆధ్వర్యంలో నమూనాలు సేకరించి ప్రయోగశాలకు తరలించారు. ఈ పరీక్షలకు రెడేమేడ్ దుకాణం యజమాని కుటుంబం నుండి 10మంది, దుకాణ సిబ్బంది 38మంది, కరోనా సోకిందని అనుమానం వచ్చిన 10మంది నుండి నమూనాలు సేకరించారు. ఈ పరీక్షా ఫలితాలు ఆదివారం నాడు వస్తాయని భావిస్తున్నారు. శుక్రవారం నాడు తిరువూరులో రెండో వ్యక్తికి కరోనా పాజిటివ్ సోకిందని అధికారులు ప్రకటించడంతో పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు ఆయా ప్రాంతాల్లో ప్రజలు రాకపోకలు సాగించకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. శానిటరీ చర్యలను చేపడుతున్నారు. కరోనా కేసులు నమోదు అయిన సాయిబాబా రోడ్డు, రామాలయం వీధుల్లో అధికారులు పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతలకు 200మీటర్ల పరిధిలో బారికేడ్లు పెట్టి ప్రయాణాలను నిషేధించారు. మొత్తమ్మీద నేడు నిర్వహించిన కరోనా పరీక్షా ఫలితాల కోసం తిరువూరు పట్టన ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Breaking: తిరువూరులో మరో కరోనా పాజిటివ్ కేసు
తిరువూరు పట్టణంలో రెండో కరోనా పాజిటివ్ కేసు నమోదయింది. స్థానిక సాయిబాబా ఆలయ రోడ్డులో ఓ మహిళకు పాజిటివ్‌గా తేలినట్లు తహశీల్దార్ స్వర్గం నరసింహారావు ఓ ప్రకటనలో తెలిపారు. వస్త్ర దుకాణ సిబ్బంది, ఈ రెండో కేసుకు సంబంధించిన వారందరికీ నేడు పరీక్షలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని ఆయన కోరారు. ఈ రెండు రోజులు ప్రజలు ప్రభుత్వాధికారులకు సహకరించవల్సిందిగా నరసింహరావు విజ్ఞప్తి చేశారు.
తిరువూరులో కరోనా నిర్ధారణ పరీక్షలు శుక్రవారమైనా జరుగుతాయా?
తిరువూరు మమ్మీడాడీ బట్టల దుకాణం యజమాని తల్లి గత సోమవారం నాడు కరోనాతో మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ఇది జరిగి నాలుగు రోజులు అవుతున్నప్పటికీ ఆ దుకాణం యజమానులకు కానీ అందులో పనిచేస్తున్న 38 మంది సిబ్బందికి గానీ గురువారం వరకు అధికారులు రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించలేదు. గురువారం నాడు వీరందరికీ కరోనా పరీక్షలు నిర్వహించడానికి స్థానిక ప్రభుత్వాసుపత్రికి రప్పించారు. అయితే విజయవాడ నుండి కరోనా పరీక్షలు జరిపే వాహనం రాలేదని చెప్పి వెనక్కి తిప్పి పంపించారు. శుక్రవారం కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించే విషయంపై గురువారం రాత్రి వరకు స్పష్టత రాలేదు. దీంతో పట్టణ ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తక్షణమే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని…బాధితులను గుర్తించి సహాయక కార్యక్రమాలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
తిరువూరులో కరోనా కలకలం
తిరువూరు చీరాల సెంటరు సమీపంలోని రామాలయం వీధిలో ఓ వృద్ధురాలు కరోనా పాజిటివ్‌తో మృతి చెందినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ విషయాన్ని మంగళవారం రాత్రి 7గంటల వరకు అధికారులు ధృవీకరించలేదు. కరోనా కలకలం రేగడంతో పట్టణంలోని ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు కుటుంబ సభ్యులు ఎవరినీ అధికారులు విచారించలేదు. కుటుంబ సభ్యుల నుండి రక్త నమూనాలు సేకరించలేదు. బుధవారం నాడు వీరి రక్తనమూనాలు సేకరించే అవకాశం ఉంది. పట్టణంలో మంగళవారం నాడు బంద్ పాటించారు. బుధవారం నాడు లాక్డౌన్ ప్రకటించే అవకాశం ఉంది. అన్ని దుకాణాలు, ప్రధాన రహదారిని మూసివేశారు. బోసు విగ్రహం నుండి రాజుపేట వరకు పోలీసు ప్రహారాతో రహదారిని మూసివేశారు. తిరువూరులో కరోనా పాజిటివ్ కేసు వచ్చిన దుకాణదారు వద్ద పనిచేసే రోలుపడికి చెందిన ఏడుగురు వ్యక్తులకు వైద్యారోగ్యశాఖ సిబ్వంది హోం క్వారంటైన్లో ఉండాలని నోటీసులు ఇచ్చారు. వారి నుంచి నమూనాలు సేకరిస్తున్నారు.
ఊటుకూరులో కరోనా పాజిటివ్ కేసు
తిరువూరు నియోజకవర్గంలో మొదటి కరోనా పోసిటివ్ కేసు గంపలగూడెం మండలం ఊటుకూరు గ్రామంలో నమోదైంది. ఓ ప్రభుత్వ ఉపాద్యాయుడు కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలారు. భార్య వైద్య అవసరాల నిమిత్తం విజయవాడ పర్యటనకు వెళ్లిన ఆయన గత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతుండగా స్థానిక RMP వైద్యుడు చేసిన చికిత్స ప్రభావం చూపకపోవడంతో నూజివీడులో జరిపిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా వచ్చినట్లు సమాచారం. పోలీసులు ఆ ప్రాంతంలో ఆంక్షలు విధించి మరింత సమాచారం సేకరిస్తున్నారు.