తిరువూరుకు రైలు సౌకర్యం–50 ఏళ్లుగా ఊరిస్తున్న కేంద్ర ప్రభుత్వం

మాజీ కేంద్ర మంత్రి డా.కే.ఎల్.రావు తాను విజయవాడ ఎంపీగా, కేంద్రంలో కీలకమైన మంత్రిగా ఉన్న సమయంలో పశ్చిమ కృష్ణా అభివృద్ధికి ముందుచూపుతో భారీ ప్రాజెక్టులను రూపొందించారు. తిరువూరుతో పాటు పశ్చిమ కృష్ణాలో నేడు రైతులు పచ్చగా ఉంటున్నారంటే డా.కెఎల్.రావు చలవే. సాగర్ కాలువలు తవ్వించిన పుణ్యం ఆయనదే. రాబోయే మూడు, నాలుగు తరాల ప్రజల గురించి ఆలోచించి ఈ ప్రాంత అభివృద్ధి గురించి ఆరోజుల్లోనే కె.ఎల్.రావు మంచి ప్రాజెక్టులు నిర్మించారు. తిరువూరులో ఏడు చెరువులకు నీరు వచ్చే విధంగా రాకట్ సప్లై ఛానల్‌ను, కొకిలంపాడు వద్ద కట్టలేరుపై ప్రాజెక్టును కె.ఎల్.రావు నిర్మింపజేశారు. తిరువూరు నియోజకవర్గ ప్రజలకు కె.ఎల్.రావు దేవుడు వంటి వాడు. ఆయన గురించి మరోసారి సవివరంగా తెలుసుకుందాం….
*** నేడు మూడు తరాలకు సంపాదించుకునే నేతలు
డా.కె.ఎల్.రావు నిరాడంబర జీవితాన్ని నేటి రాజకీయ నేతలు అవగాహన చేసుకోవాలి. అధికారంలోకి రాగానే మూడు తరాలకు సరిపడా పోగుచేసుకుందామనే ఆలోచన నేటి నేతలది. డా.కె.ఎల్.రావు తిరువూరు, మైలవరం నియోజకవర్గ ప్రజలకు రైలు సౌకర్యం కల్పించడానికి 50ఏళ్ల క్రితమే ప్రణాళికలు వేశారు. కొండపల్లి నుండి కొత్తగూడెం వరకు ఈ రెండు నియోజకవర్గాలను కలుపుతూ రైలు మార్గం నిర్మించాలని కె.ఎల్.రావు ఒక ప్రణాళిక రూపొందించి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి అందజేశారు. రైల్వేబోర్డు వద్ద ఈ రైలు మార్గం నిర్మాణానికి సంబంధించి ప్రత్యేక ప్రాజెక్ట్ ఉంది. కొండపల్లి నుండి కొత్తగూడెంకు రైలు మార్గం నిర్మిస్తే దేశంలోని చాలా ప్రాంతాలకు బొగ్గు రవాణా తేలికగా జరుగుతుందని, ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన భద్రాచలంకు భక్తులు రావడం సులభతరం అవుతుందని డా.కె.ఎల్.రావు ప్రకటించారు. రెండవ దశలో కొత్తగూడెం నుండి ఛత్తీస్‌ఘడ్‌లో ఉన్న కిరండల్ బొగ్గు గనుల ప్రాంతానికి ఈ రైలు మార్గాన్ని పొడిగిస్తే దక్షిణ, ఉత్తరాది రాష్ట్రాల మధ్య దగ్గర రవాణా మార్గం ఏర్పడుతుందని దేశంలో ఉన్న అన్ని కర్మాగారాలకు బొగ్గు రవాణా సులభతరం చేయవచ్చని డా.కె.ఎల్.రావు ప్రతిపాదించారు. వాస్తవానికి దేశంలో ఉన్న మిగిలిన రైలుప్రాజెక్టుల కన్నా కొండపల్లి-కొత్తగూడెం-కిరండల్ రైలు మార్గం నిర్మాణం చాలా ప్రాధాన్యత కలిగినదని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో గుర్తించింది.
*** కేవలం నాయకత్వ లోపమే
డా.కె.ఎల్.రావు అనంతరం ఎంపీలుగా వచ్చిన గోడే మురహరి, చెన్నుపాటి విద్య, వడ్డే శోభనాద్రీశ్వరరావు, పర్వతనేని ఉపేంద్ర, గద్దె రామ్మోహన్, లగడపాటి రాజగోపాల్ తదితరులతో పాటు ప్రస్తుత ఎంపి కేశినేని నాని సైతం ఈ ప్రాజెక్టుపై ఆసక్తి చూపలేదు. మార్చి 2016 రైల్వే ఆఖరి బడ్జెట్‌లో ఈ ప్రాజెక్ట్ సర్వేకు బిచ్చం మాదిరి కోటి రూపాయలు మొక్కుబడిగా కేటాయించారు. మొన్న బడ్జెట్‌లో అసలు కేటాయింపులే ఎత్తేశారు.
*** మంత్రి దేవినేని ఉమాకు అవగాహనే లేదు
తాను అపర భగీరథుడినంటూ సొంత జబ్బలు చరుచుకునే మైలవరం శాసనసభ్యుడు, మంత్రి దేవినేని ఉమాకు ఈ రైలు ప్రాజెక్టుపై అవగాహన ఉన్నట్లు కనిపించదు. కనీసం ఈ ప్రాజెక్ట్ గురించి ఆయన ఎప్పుడూ ప్రస్తావించిన సందర్భం లేదు. మాజీ మంత్రి చనుమోలు వెంకట్రావు, మాజీ ఎమ్మెల్సీ కొల్లి పావన వీరరాఘవరావు, మాజీ ఎమ్మెల్యే కోమటి భాస్కరరావు తదితరులు ఈ రైలు ప్రాజెక్ట్ కోసం చాలాసార్లు ముమ్మర ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉన్న తిరువూరుకు చెందిన సగ్గుర్తి శ్రీనివాసరావుకు ఈ ప్రాజెక్టుపై పూర్తి అవగాహన ఉంది. ఆ పార్టీ తరఫున అడపాదడపా ప్రకటనలు ఇవ్వడం తప్ప ఈ ప్రాజెక్ట్ కోసం గట్టిగా ప్రయత్నించిన దాఖలాలు లేవు. గతం ఎలా ఉన్నప్పటికీ కొండపల్లి-కొత్తగూడెం రైలు మార్గం నిర్మాణం కోసం ఈ ప్రాంత ప్రజలు పార్టీలకు అతీతంగా ఉద్యమబాట పట్టకపోతే మరో రెండు తరాలకు కూడా తిరువూరు, మైలవరం ప్రాంతానికి రైలు కూత వినిపించే అవకాశం కనుచూపు మేర కనిపించడం లేదు.—కిలారు ముద్దుకృష్ణ.
tvrnews.com-TiruvuruNews