ఉదయం కళకళ. సాయంత్రం వెలవెల. దేవాలయాల్లో పరిస్థితి ఇది.

తిరువూరు పరిసర ప్రాంతాల్లో గురుపౌర్ణమి సందర్భంగా దేవాలయాల్లో ప్రత్యెక పూజలు జరిగాయి.తిరువూరులో ఉన్న షిర్డీ సాయిబాబా ఆలయంలో, పరిసర ప్రాంతాల్లో ఉన్న సాయి ఆలయాల్లోనూ అభిషేకాలు నిర్వహించి, అన్నదానాలు చేశారు. పలువురు గురువులకు ప్రస్తుత విద్యార్ధులు, పూర్వ విద్యార్ధులు గురుపూజోత్సవం నిర్వహించారు. చంద్రగ్రహణం సందర్భంగా తిరువూరుతో పాటు అన్ని గ్రామాల్లో ఉన్న దేవాలయాలను మూసివేశారు. నెమలి శ్రీకృష్ణ దేవాలయాన్ని మద్యాహ్నం మూడు గంటల నుండి మూసివేశారు. శనివారం మధ్యాహ్నం నుండి ఆలయాల్లో శుద్ధి కార్యక్రమం పూర్తీ అయిన అనంతరం భక్తులకు దర్శన ఏర్పాట్లు కల్పిస్తారు.

శేషవాహనం పై ఊరేగిన నెమలి వేణుగోపాలుడు–గురువారం నాడు కల్యాణోత్సవం


ఆంధ్రా రాష్టంలో ఉన్న ప్రముఖ పుణ్య క్షెత్రం నెమలి వేణుగోపాల స్వామీ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో మంగళవారం నాడు వేణుగోపాల స్వామిని పెండ్లి కుమారుడిని చేసి అంకురార్పణ చేసారు. రెండో రోజు శేషవాహనం పై బుధవారం రాత్రి నెమలి పుర వీదుల్లో శ్రీ రుక్మిణి సత్యభామ సామెత వేణుగోపాల స్వామిని ఊరేగింపు జరిపారు.
**నేడే కల్యాణోత్సవం
ఈ ఉత్సవాల్లో ప్రధామైనడిగా భావించే వేణుగోపాల స్వామీ కల్యాణోత్సవం గురువారం రాత్రం పది గంటలకు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసారు. కృష్ణా, ఖమం జిల్లాలతో పాటు ఉభయ రాష్ట్రాల నుండి దాదాపు లక్ష మంది భక్తులు ఈ కళ్యాణోత్సవానికి హాజరవుతారని ఏర్పాట్లు చేస్తున్నారు.

నెమలి కిట్టయ్య పెళ్లికుమారుడు అయ్యనే!


గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆరు రోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో మంగళవారం వేణుగోపాలస్వామిని పెండ్లి కుమారుడిగా అలంకరించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఆలయ అర్చకులు టి.గోపాలాచార్యులు ఆధ్వర్యంలో రుత్విక బృందం ఉదయం 5.30 గంటలకు స్వామివారి మూలవిరాట్‌కు సుప్రభాతసేవ, ప్రాతఃకాలార్చనలు నిర్వహించింది. సువర్ణాభరణాలు, ముత్యాలు, పుష్పాలతో మూలవిరాట్‌ను శోభాయమానంగా అలంకరించారు. తదుపరి వేణుగోపాలస్వామి ఉత్సవ విగ్రహాన్ని అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. ఉభయ దేవేరులైన రుక్మిణీసత్యభామ ఉత్సవ విగ్రహాలను నూతన వస్త్రాలతో అలంకరించారు. సాయంత్రం విజయవాడకు చెందిన వేదపండితులు పరాశరం పట్టాభిరామాచార్యులు ఆధ్వర్యంలో అంకురార్పణ, వాస్తుపూజ, అగ్ని ప్రతిష్ఠాపన, ధ్వజారోహణం, గరుడపట ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు వడ్లమూడి రాజశేఖర్‌, కార్యనిర్వాహణాధికారి వై.శివరామయ్య, పాలకవర్గ సభ్యులు ఎస్‌.పద్మావతి, కె.శ్రీను ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా పాలకవర్గ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాత్రి పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. నెమలి వేణుగోపాల స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి 7 గంటలకు స్వామివారికి శేషవాహన సేవ మహోత్సవం చేశారు. ప్రత్యేక రథంపై ఏర్పాటు చేసే శేషవాహనంపై రుక్మిణీసత్యభామా సమేతులైన వేణుగోపాలస్వామి ఉత్సవ విగ్రహాలను ఆశీనులను చేసి మేళతాళాలలతో తిరువీధుల్లో ఊరేగించారు.

tags: nemali krishna temple nemali brahmotsavam 2018 nemali krishna district gampalagudem tvrnews tiruvuru news tiruvuru krishna district temples

రేపటి నుండి నెమలి బ్రహ్మోత్సవాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏకైక కృష్ణాలయం, పేరెన్నికగన్న పుణ్యక్షేత్రం, నిత్యం భక్తుల రాకతో పులకించే ఈ గ్రామం ఎప్పుడూ సందర్శకులతో సందడిగా ఉండే ప్రదేశం, భక్తుల విరాళాలతో దినదినాభివృద్ది చెందుతున్న దేవస్థానం, లక్షలాది మంది భక్తులు ఇలవేల్పుగా కొలిచే కృష్ణాజిల్లా గంపలగూడెం మండలంలోని ‘నెమలి’ గ్రామంలోని వేంచేసి ఉన్న శ్రీవేణుగోపాలస్వామివారి ఆలయం.
*నెమలి వేణుగోపాలస్వామిని కొలిచే భక్తులు నవ్యాంద్రప్రదేశ్ ,తెలంగాణా రాష్ట్రాలలో లక్షలాది మంది ఉన్నారు. తాము కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా స్వామివారిని ఆరాదించే భక్తజనం నెమలి ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఎప్పటి నుంచో అభిలాషిస్తున్నారు. పాలక ప్రభుత్వాలు నెమలి పుణ్యక్షేత్రం స్వామి వారి దర్శనం ‘సర్వైశ్వర దాయకం సర్వరోగ నివారిణి’ అనే భావంతో వస్తున్నా, భక్తులకు ,ఆలయ అధికారులు వసతి కలిపిస్తున్నా, రాకపోకలకు నానా ఇక్కట్లు పడుతున్నారు. భక్తుల భూరి విరాళాలుతో ఆలయ ప్రాంగణంలో ఎన్నో కట్టడాలు నిర్మించారు. పర్యాటకులను ఆకర్షిస్తున్నారు.
**రాజకీయ రాక్షసత్వం భరతం పట్టడానికి అవతరించిన శ్రీ మహావిష్ణువు. దశావతారాల్లో కృష్ణావతారం బహుళ ప్రచారమైంది. అటు శృంగారంతో పాటు అఖండ చతురతతో రాజనీతి యోగనిష్టగా భారత యుద్ధంలో పాల్గొన్న అవతారమూర్తి గీతాగోవిందుడు.” “కృష్ణపరమాత్ముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అవతారం. ద్వాపరయుగంలో రాక్షస సంహారానికి
**స్వయంభువుగా స్వామివారు భూగర్భం నుండి ఇలా వెలిశారు..
1953 మార్చి 23 న (శ్రీరామనవమి నాడు) వేణుగోపాలస్వామి నెమలిలో స్వయంభుగా వెలిశారు. స్వామివారి విగ్రహం నెమలి గ్రామానికి చెందిన వనమా సీతారామయ్య అనే షావుకారు తన పొలంలోని సారవంతమైన మట్టి కోసం తవ్వుతుండగా మొదటిసారి గడ్డపలుగు ఉపయోగించగా వెంటనే ఖంగుమని శబ్దం వచ్చింది. ఆ వింత ధ్వని అర్ధం కాక కొంచెం పక్కగానే గడ్డపలుగు వేయగా అదే శబ్దం వచ్చింది. ఆ ధ్వని ఆలోచించుతూనే అతడు ఆ రెండు ఘతాముల మధ్య మరల పలుగు ప్రయోగించగా ఆ చోట బ్రహ్మాండమైన మిరుమిట్లుతో ఒక మెరుపు వెలువడింది. ఆ కాంతి తీవ్రతకు అతను మూర్చ పోయాడు అది చూసిన మిగిలిన వారు ఆందోళనతో అతని ముఖం పై చల్లని నీళ్ళు చల్లి కొద్ది సేపు సపర్యలు చేసారు. ఆతను కొంచెం తేరుకొని తనకు ఏమి కనిపించడంలేదని అన్నాడు. అపుడు మిగిలినవారంతా ఆప్రాంతంలో త్రవ్వి చూడగా ఒక విగ్రహం దానిచెంతనే ప్రాచీన శంఖము, పాచిక లభ్యమయినది. ఆరోజు పరమ పవిత్రమైన శ్రీరామనవమి (23-3-1953) ఆవిషయం తెలిసిన షావుకారు నవమి వేడుకల నిర్వహణలో ఉన్న ఆతను ఆ బాధ్యతలు వేరేవారికి అప్పగించి హుటాహుటీన తన అనుచరులతో కలిసి విగ్రహం లభ్యమైన దివ్యస్తలానికి చేరుకున్నాడు. ఆ విగ్రహమును పరిశీలించి శ్రీ వేణుగోపాల స్వామివారి దివ్య మంగళమూర్తి అని గ్రహించారు. కటారు వెంకటేశ్వర్లు ఉపయోగించిన గునపము వలన శ్రీస్వామివారి వేణువుకు కుడి, ఎడమలవైపుల తగిలి చిటికిన వ్రేలు భిన్నమయింది. గ్రామ పెద్దలు పెనుగొలను చెందిన అర్చకుడు నందలి క్రిష్ణమచార్యులుని వెంటనే రప్పించి స్వామివారి విగ్రహం చూపించగా మూడు అడుగుల ఎత్తు, ఉత్తరాభి ముఖముగా వ్యత్యస్థ పదముల నడుము, శిరస్సులు చక్కని ఓంపులతో మురళిని మ్రోగించుచూ, త్రిభంగిమతో దివ్య సుందరమైన చక్రములతో పాదముల కడ ఇరువైపులా విన్ద్యమారాలు వీచు గోపికా స్త్రీలు గోవులతో కూడి అలరారుచు ఉన్న ఆ ఏక శీల విగ్రహమును చూసి శ్రీ వేణుగోపాలస్వామివారి విగ్రహంగా గ్రహించారు. స్వామివారు భూగర్భమునుండి సాక్షాత్కరించిన తీరుకు గ్రామ ప్రజలు భక్తీ పారవశ్యంతో ఆశ్చర్యపోయారు. ఈసందర్భంగా భక్తులు స్వామివారిని ప్రతిస్థదలచి ఉరేగించ బయలుదేరగా స్వామివారు భక్తునికి ఆవహించి “నేను దర్శనమిచ్చిన చోటనే తనను ప్రతిష్టించాలని ఆదేశించారు” . స్వామి ఆదేశమును వెంటనే అమలుచేయదలచాగా ఉత్తరాభి ముఖమున వెలసిన స్వామివారిని తూర్పు ముఖముగా ఉంచడంతో ఆకస్మికంగా గాలివానతో కూడిన పెను తుఫాను విరుచుకుపడింది. వేసిన పందిళ్ళు చిన్నభిన్నమయ్యాయి. పొరపాటును గ్రహించిన వారు స్వామివారిని యధావిధిగా ఉత్తరాభి ముఖముచేయగా కొద్ది క్షణములలొనే తుఫాను శాంతించింది. వెంటనే గ్రామ పురోహితులతో పూజలు నిర్వహించారు.
** 1957 ఫిబ్రవరి 6న శాస్రోక్తంగా నల్లనయ్య విగ్రహాన్ని వేదపండితుల ఆద్వర్యంలో ప్రతిష్టించారు. అప్పటి నుంచి స్వామివారి ఆలయం దినదిన ప్రవర్ధమానం చెందుతూ భక్తులు కోరిన కోరికలు తీర్చే ఇష్టదైవంగా వేణుగోపాలస్వామి నిలిసారు. నెమలి వేణుగోపాలస్వామి ఆలయానికి భక్తులు సమర్పించే కానుకలు వేలంపాటలు ద్వారా ఏటా రూ.కోటి వరకు ఆదాయం లభిస్తుంది. ఆ మొత్తం దేవస్థానం నిర్వహణకే సరిపోతుంది. ఉత్సవాలు, వేడుకలు ప్రసాదాలు సిబ్బంది జీతభత్యాలు తదితర వ్యయాలు ఆలయానికి వచ్చే ఆదాయం ద్వారా ఖర్చు చేస్తున్నారు. నెమలి పుణ్యక్షేత్రం పర్యటక కేంద్రంగా రూపాంతరం చేసేందుకు రవాణా వసతి ప్రదాన అడ్డంకిగా మారింది. వేలల్లో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. తెలంగాణా సరిహద్దున ఉన్న నెమలికి ఆ రాష్ట్రంలోనే భక్తులు అధికం. ప్యాకేజి టూర్ కు జిల్లాలో ఇతర దేవాలయల నుంచి నెమలి గ్రామం దూరంగా వుండడం కూడా సమస్యగా ఉంది. పుణ్యక్షేత్రాల సందర్శనకు రెండేళ్ళ క్రితం ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల ద్వారా దూరప్రాంతాలకు చెందిన భక్తులు ఇక్కడకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని తరించారు. ఇదే తరహాలో జిల్లాలో విజయవాడ కనకదుర్గ, వేదాద్రిలోని నరసింహ స్వామి, పెనుగంచిప్రోలులోని శ్రీతిరుపతమ్మ ఆలయాల మీదుగా నెమలికి వచ్చేందుకు రవాణా సౌకర్యం ఉంటే ఉపయుక్తంగా ఉంటుంది. నెమలి వేణుగోపాలస్వామి ఆలయానికి ప్రముఖుల సందర్శన కొదవలేదు. రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిదులు అధికారులు ప్రముఖులు తరచూ స్వామివారి సేవకు వస్తుంటారు. స్థానిక నాయకులు అధికారులు వారందరికీ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దలని తద్వారా ప్రభుత్వానికి ఆదాయ వనరులు పెరుగుతాయని వినతులు అందజేస్తున్నారు. హామీలు ఇస్తున్నారే తప్ప అవి అమలుకు చర్యలు తీసుకున్న దాఖాలాలు లేవు ఆలయాన్ని సందర్శించిన మంత్రులు, ఎంపిలు ఎమ్మెల్యేలు వివిధ శాఖల రాష్ట్ర స్థాయి అధికారులు పర్యటక కేంద్రం చేయలన్నారే తప్ప చేయలేదు.
**కన్నుల పండువగా స్వామివారి తిరుకళ్యాణం.
ఏటా ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు స్వామివారి తిరు కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆరు రోజులపాటు నిర్వహించే స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో లక్షల మంది భక్తులు పాల్గొంటారు. ప్రతి నెలా పూర్ణిమ నాడు మాస కళ్యాణం, గోశాలలో నిత్యం గోపూజలు జరుగుతూ ఉంటాయి. ఆలయంలో ప్రతి ఆది, సోమ, శుక్రవారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వైఖాసన ఆగమనం పద్దతిలో స్వామివారు పూజలందుకునే ఈ ఆలయంలో భక్తుల అన్నప్రాసనలు, వాహన పూజలు, వివాహాలు తదితర శుభకార్యాలు స్వామివారి సన్నిధిలో అధికంగా నిర్వహిస్తారు. శ్రీ కృష్ణాష్టమి, భీష్మ ఏకాదశి, ముక్కోటి, ధనుర్మాసోత్సవం, ఉగాది, శ్రీరామనవమి విశేషంగా నిర్వహిస్తారు.
**నెమలి పుణ్యక్షేత్రానికి ఇలా చేరుకోవాలి..
నెమలి పుణ్యక్షేత్రానికి తెలంగాణా రాష్ట్రంలోని మధిర నుంచి నెమలి గ్రామానికి చేరుకోవాలి. ఇతర ప్రదేశాల నుంచి వచ్చేవారు రైలు లేదా బస్సు మర్గాన మధిర చేరుకొని అక్కడినుంచి నెమలి పోవు బస్సు ఎక్కాలి. సాధారణ రోజుల్లో కుడా తిరువూరు, మధిర డిపోల నుంచి నుంచి నెమలికి బస్సులు తిరుగుతాయి. స్వామివారి తిరుకళ్యాణం రోజున మధిర, తిరువూరు డిపోల నుంచి బస్సులు ఉచితంగా తిరుగుతాయి.
**ఈనెల 27 నుండి వేణుగోపాలస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి.
**27-2-2018 – మంగళవారం – అంకురార్పణ
28-2-2018- బుధవారం – శేష వాహన ఉత్సవము
1-3-2018-గురువారం – శ్రీ స్వామివారి తిరు కల్యాణం (రాత్రి 10గంటలకు)
2-3-2018 – శుక్రవారం – రధోత్సవం
3-3-2018 – శనివారం – వసంతోత్సవం
4-2-2018 – ఆదివారం – శ్రీపుష్పయాగము తో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

తిరువూరులో శివరాత్రి వేడుకలకు సిద్దమైన ఆలయాలు

తిరువూరు పరిసర ప్రాంతాల్లో శివరాత్రి పర్వదినాన్ని వైభవంగా నిర్వహించడానికి స్థానిక ప్రజలు సన్నద్దమవుతున్నారు. పలు శివాలయాలు, ఇతర ఆలయాలు విద్యుత్ దీపాలతో అలంకరించారు. శివపార్వతుల కల్యాణం నిర్వహించడానికి ఏర్పాట్లు చేసారు. కొత్త బస్టాండ్ సెంటర్ లో ఉన్న రామలింగేశ్వరస్వామీ దేవాలయంలో, పాత బస్సు స్టాండ్ సెంటర్ లో ఉన్న చంద్రమౌళీశ్వర స్వామీ దేవాలయంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యెక పూజల కోసం ఏర్పాట్లు చేసారు. సమీపంలో ఉన్న ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం నీలాద్రి గుడిలో శివరాత్రి ఉత్సవాలను, శివ కల్యాణాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తీ అయ్యాయి. మంగళవారం నాడు తిరువూరు ఆర్టీసీ డిపో నుంచి నీలాద్రి గుడికి ప్రతి అరగంటకు ఒక బస్సు నడపడానికి ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేసారు. మధిర సమీపంలో ఉన్న కూడలి, కోటప్పకొండ, శ్రీశైలం తదితర ప్రాంతాలు వెళ్ళడానికి భక్తులు సిద్దమవుతున్నారు. వివిధ గ్రామంలోని శివాలయాల్లో ప్రత్యెక పూజలు నిర్వహిస్తున్నారు. పలు దేవాలయాల్లో అన్నదానానికి ఏర్పాట్లు చేసారు.

శివోహం: శివరాత్రిపై TVRNEWS ప్రత్యేక కథనం


విద్యలన్నింటిలోనూ వేదం గొప్పది. వేదాలన్నింటిలోనూ సంహితకాండలోని నమక చమక మంత్రాలతో కూడిన రుద్రం గొప్పది. అందులోనూ ‘ఓం నమః శివాయ’ అనే పంచాక్షరీ మంత్రం గొప్పది. పంచాక్షరిని పలుకలేకున్నా, అందులో ‘శివ’ అనే రెండక్షరాలు చాలా గొప్పవి అని శాస్త్ర వచనం. శివుడినే శంకరుడని కూడా అంటారు. శంకరోతి ఇతి శంకరః అని వ్యుత్పత్తి. అంటే శమనం లేదా శాంతిని కలిగించేవాడు అని అర్థం.
***‘శివ శివ శివ యనరాదా… భవభయ బాధలనణచుకోరాదా’ అని త్యాగరాజ స్వామి అన్నాడు గాని, అచంచల భక్తితో శివనామాన్ని స్మరిస్తే చాలు, భవభయ బాధలన్నీ తొలగిపోతాయని శాస్త్ర పురాణాలు చెబుతున్నాయి. మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి శివభక్తులకు అత్యంత పవిత్రమైనది. ఉపవాస దీక్షలతో, జాగరణలతో రోజంతా శివనామ స్మరణలో, అభిషేక, అర్చనాది శివారాధన కార్యక్రమాలలో నిమగ్నమై పునీతమవుతారు. దేవదానవులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేసినప్పుడు తొలుత హాలాహలం ఉద్భవించింది. దాని ధాటికి ముల్లోకాలూ దగ్ధమై భస్మీపటలం కాగలవని భయపడిన దేవదానవులు తమను కాపాడాలంటూ శివుడికి మొర పెట్టుకోవడంతో, శివుడు హాలాహలాన్ని మింగి తన కంఠంలో బంధిస్తాడు. హాలాహలం వేడిమికి శివుడి కంఠమంతా కమిలిపోయి, నీలంగా మారుతుంది. ఈ కారణంగానే శివుడు నీలకంఠుడిగా, గరళకంఠుడిగా పేరుగాంచాడు. ఇది జరిగిన రోజు మాఘ బహుళ చతుర్దశి. లోకాలను కాపాడిన శివుడు తిరిగి మెలకువలోకి వచ్చేంత వరకు జనులందరూ జాగరణ చేస్తారు. అప్పటి నుంచి మహాశివరాత్రి రోజున శివభక్తులు జాగరణ చేయడం ఆచారంగా మారిందని ప్రతీతి.
***రాశులు… జ్యోతిర్లింగాలు
శైవక్షేత్రాలన్నింటిలోనూ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు అత్యంత విశిష్టమైనవి. ఏడాది పొడవునా భక్తుల సందడితో కనిపించే ఈ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు మహాశివరాత్రి పర్వదినాన మరింతగా భక్తులతో కిటకిటలాడుతాయి. మహాశివరాత్రి రోజున జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఏదో ఒక క్షేత్రాన్ని దర్శించుకోవడంపై చాలామంది ఆసక్తి చూపుతారు. మన దేశంలో ఉన్న ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలకు రాశిచక్రంలోని ద్వాదశ రాశులకు సంబంధం ఉన్న సంగతి చాలామందికి తెలియదు. జ్యోతిర్లంగాలను సందర్శించుకోవాలనుకునే వారు తమ జన్మరాశులకు చెందిన జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం శుభదాయకమని శాస్త్రాలు చెబుతున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఏ జ్యోతిర్లింగం ఏ రాశికి చెందుతుందంటే…
***రామేశ్వరం – మేషం
మేషరాశికి చెందిన వారు దర్శించుకోవలసిన జ్యోతిర్లింగ క్షేత్రం రామేశ్వరం. త్రేతాయుగంలో సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించిన జ్యోతిర్లింగం ఇది. తమిళనాడులో సముద్ర తీరాన వెలసిన రామేశ్వరం తీరం నుంచే వానరులు లంక వరకు సేతువును నిర్మించారు. దీని మీదుగానే వానరసేనతో రామలక్ష్మణులు లంకకు చేరుకున్నారు. రావణుడి రాక్షస సేనతో యుద్ధం చేసిన శ్రీరాముడు చివరకు రావణుడిని సంహరించాడన్న రామాయణ గాథ అందరికీ తెలిసిందే. బ్రాహ్మణుడైన రావణుడిని సంహరించడం వల్ల చుట్టుకున్న బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తి పొందడానికి శ్రీరాముడు ఇక్కడ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించినట్లు ప్రతీతి.
***సోమనాథ్‌ – వృషభం
వృషభ రాశి వారు దర్శించుకోవలసిన జ్యోతిర్లింగం సోమనాథ్‌. ద్వాపరయుగంలో దీనిని శ్రీకృష్ణుడు ప్రతిష్ఠించాడు. గుజరాత్‌లో సముద్ర తీరాన వెలసిన క్షేత్రం ఇది. మహమ్మద్‌ ఘజనీ దాడిలో విధ్వంసానికి గురైన సోమనాథ్‌ ఆలయాన్ని స్వాతంత్య్రానంతర కాలంలో చాళుక్య శిల్ప శైలిలో పునర్నిర్మించారు. దక్షుడి శాపానికి గురైన చంద్రుడు ఇక్కడి జ్యోతిర్లింగాన్ని ఆరాధించడం వల్ల తిరిగి తేజస్సును పొందగలిగాడని, అందువల్ల దీనికి చంద్రుడి పేరిట సోమనాథ క్షేత్రమనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.
***నాగేశ్వరం – మిథునం
మిథున రాశిలో జన్మించిన వారు దర్శించుకోవలసిన జ్యోతిర్లింగం నాగేశ్వర లింగం. ఇది గుజరాత్‌లో సముద్రతీరాన ద్వారకలోని దారుకావనంలో ఉంది. ఒకప్పుడు దారుకావన ప్రాంతాన్ని దారుకుడనే రాక్షసుడు పాలించేవాడు. జనాలను విపరీతంగా పీడించేవాడు. తనకు నచ్చని వారిని నిష్కారణంగా చెరసాలలో బంధించేవాడు. ఒకసారి సుప్రియుడనే శివభక్తుడిని కూడా అలాగే చెరసాలలో బంధించాడు. సుప్రియుడు ప్రార్థించడంతో శివుడు దారుకుడిని సంహరించి అక్కడ స్వయంభువుగా జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడని శివపురాణం చెబుతోంది.
***ఓంకారేశ్వరం – కర్కాటకం
కర్కాటర రాశి వారు దర్శించుకోవలసిన జ్యోతిర్లింగం ఓంకారేశ్వర లింగం. ఇది మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో వింధ్య పర్వత శ్రేణుల్లో వెలసిన క్షేత్రం. ఓంకారేశ్వర లింగం ఆవిర్భావానికి సంబంధించి పురాణాల్లో పలు గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఇక్ష్వాకు వంశానికి చెందిన మాంధాత మహారాజు చేసిన తపస్సుకు మెచ్చిన శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ స్వరూపంలో ఆవిర్భవించినట్లు ఒక గాథ ఉంది.
***వైద్యనాథ్‌ – సింహం
సింహ రాశిలో జన్మించిన వారు దర్శించుకోవలసినది వైద్యనాథ లింగం. జార్ఖండ్‌లోని దేవ్‌ఘర్‌ జిల్లాలో ఉన్న వైద్యనాథ క్షేత్రాన్ని స్థానికంగా బైద్యనాథ్‌గా పిలుస్తారు. వైద్యనాథ లింగం సాక్షాత్తు పరమశివుని ఆత్మలింగమేనని ప్రతీతి. లంకకు రక్షణగా సాక్షాత్తు శివుడినే ప్రతిష్ఠించాలనే సంకల్పంతో రావణుడు కైలాసానికి వెళ్లి, శివుడిని ఆత్మలింగం కోరాడు. అతడికి ఆత్మలింగం అనుగ్రహించిన శివుడు, మార్గమధ్యంలో దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై ఉంచరాదని షరతు విధిస్తాడు. అలా ఉంచితే అది అక్కడే శాశ్వతంగా ఉండిపోతుందని హెచ్చరిస్తాడు. రావణుడు ఆత్మలింగంతో లంకకు చేరుకుంటే ముల్లోకాలకు మరింత ప్రమాదకారిగా పరిణమించగలడని తలచిన దేవతలు అతడికి ఆటంకం కలిగించేందుకు వరుణుడి సాయం కోరుతారు. వరుణుడి ప్రభావంతో రావణుడికి మార్గమధ్యంలో లఘుశంక తీర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సమయంలో బ్రాహ్మణ రూపంలో తారసపడిన వినాయకుడి చేతికి ఆత్మలింగం ఇచ్చి, దానిని జాగ్రత్తగా పట్టుకుని, తాను రాగానే తన చేతికి ఇవ్వాలని కోరాడు. అయితే, నిమిషంలోగా రాకుంటే శివలింగాన్ని వదిలేసి తన దారిన తాను పోతానని చెబుతాడు. రావణుడు నిమిషంలోగా తిరిగి రాలేకపోవడంతో వినాయకుడు దాన్ని అక్కడే వదిలేసి మాయమవడంతో ఆత్మలింగం అక్కడే ఉండిపోయిందని శివపురాణం చెబుతోంది.
***మల్లికార్జునుడు – కన్య
కన్య రాశి వారు దర్శించుకోవలసినది ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలంలో వెలసిన మల్లికార్జున జ్యోతిర్లింగం. శివపార్వతులు తన కంటే ముందుగా వినాయకుడిని వివాహం చేయడంతో కార్తికేయుడు అలిగి కైలాసాన్ని వీడి, క్రౌంచపర్వతం మీదకు చేరుకుని అక్కడ జపతపాలు ప్రారంభిస్తాడు. కార్తికేయుడిని బుజ్జగించి ఎలాగైనా అతడిని తిరిగి కైలాసానికి తీసుకురావాలనే సంకల్పంతో శివపార్వతులిద్దరూ అక్కడకు బయలుదేరుతారు. తన తల్లిదండ్రులు అక్కడకు వస్తున్నట్లు దేవతల ద్వారా తెలుసుకున్న కార్తికేయుడు క్రౌంచపర్వతాన్ని వీడి వెళ్లడానికి సిద్ధపడతాడు. అయితే, దేవతలు నచ్చజెప్పడంతో అతడు అక్కడే ఉంటాడు. ఆ ప్రాంతానికి చేరుకున్న శివుడు జ్యోతిర్లింగంగా శ్రీశైలంపై ఆవిర్భవించి,. మల్లెపూలతో అర్చనలు అందుకోవడం వల్ల మల్లికార్జునుడిగా ప్రసిద్ధి పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి.
***మహాకాళేశ్వరం – తుల
తుల రాశి వారు దర్శించుకోవలసినది మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉంది ఈ క్షేత్రం. ఇక్కడి జ్యోతిర్లింగం ఆవిర్భావానికి కారణాలుగా పలు గాథలు ప్రచారంలో ఉన్నాయి. శివుడు ఇక్కడ స్వయంభువుగా జ్యోతిర్లింగ రూపంలో వెలసినట్లు పురాణాలు చెబుతున్నాయి. తన భక్తుడైన రాజు చంద్రసేనుడిపై శత్రురాజులు దండెత్తినప్పుడు అతడికి రక్షణగా శివుడు మహాకాళుడిగా వచ్చి, శత్రువులను సంహరించాడు. ఆ తర్వాత ఇక్కడ జ్యోతిర్లింగంగా ఉద్భవించినట్లు పురాణాల కథనం.
***ఘృష్ణేశ్వరం – వృశ్చికం
వృశ్చిక రాశి వారు దర్శించుకోవలసినది ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం. దీనినే ధూషణేశ్వర లింగం అని, కుశేశ్వర లింగం అని కూడా అంటారు. ఇది మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ జిల్లా ఎల్లోరా గుహలకు అత్యంత చేరువలో ఉంది. ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగ ఆవిర్భావంపై అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఒకనాడు పార్వతీదేవి తన పాపిట తిలకం దిద్దుకోవడం కోసం అరచేతిలో కుంకుమపువ్వ, పసుపు నీటితో కలుపుతూ ఉండగా ఆశ్చర్యకరంగా అది తేజోవంతమైన శివలింగాకృతి ధరించింది. నేలపై ఉంచగానే అది నేలలో కూరుకుపోయింది. శివుడు ఈ విషయం చెప్పగా, తన తేజోరూపమైన జ్యోతిర్లింగం పాతాళంలో కూరుకుపోయిందని చెప్పి, దానిని తన త్రిశూలంతో పైకి తీసుకొస్తాడు. శివుడు త్రిశూలంతో తవ్విన చోట ఉద్భవించిన గంగ ఇక్కడ ఎలగంగానదిగా ప్రవహిస్తోంది.
***విశ్వేశ్వరం – ధనుస్సు
ధనుస్సు రాశి వారు దర్శించుకోవలసినది విశ్వేశ్వర జ్యోతిర్లింగం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లోనూ భక్తులు అత్యధికంగా దర్శించుకునేది కాశీలోని పవిత్ర గంగా తీరంలో ఉన్న విశ్వేశ్వర జ్యోతిర్లింగాన్నే. కాశీలోని విశ్వనాథ ఆలయం అత్యంత పురాతనమైనది. పలు పురాణాలలో కాశీ క్షేత్ర ప్రాశస్త్యం గురించిన ప్రస్తావన కనిపిస్తుంది. ఇది మోక్ష క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. కాశీలో మరణిస్తే మరుజన్మ ఉండకుండా నేరుగా మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ ప్రాణాలు వదిలిన వారిని యమభటులు ఏమీ చేయరని వారు విశ్వసిస్తారు. నిర్గుణ నిరాకారుడిగా ఉన్న శివుడు సుగుణుడిగా జ్యోతిర్లింగ స్వరూపంతో ఇక్కడ స్వయంభువుగా వెలిశాడని పురాణాలు చెబుతాయి. సాక్షాత్లు శివుడే కాశీ నగరాన్ని సృష్టించాడని ప్రతీతి.
***భీమశంకరం – మకరం
మకర రాశి వారు దర్శించుకోవలసిన జ్యోతిర్లింగం భీమశంకర జ్యోతిర్లింగం. ఇది మహారాష్ట్రలోని పూణే సమీపంలో సహ్యాద్రి పర్వత శ్రేణుల వద్ద భీమా నది తీరాన వెలసింది భీమశంకర క్షేత్రం. త్రిపురాసుర సంహారం తర్వాత శివుడు దేవతల కోరిక మేరకు సహ్యాద్రికి చేరుకుని, ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో స్వయంభువుగా వెలసినట్లు పురాణాలు చెబుతున్నాయి.
***కేదారేశ్వరం – కుంభం
కుంభ రాశి వారు దర్శించుకోవలసినది కేదారే«శ్వర జ్యోతిర్లింగం. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ జిల్లాలో హిమాలయాల వద్ద కైలాస పర్వతానికి సమీపంలో ఉంది కేదార్‌నాథ్‌ క్షేత్రం. నాలుగు పవిత్ర ధామాలలో ఒకటిగా ప్రసిద్ధి పొందిన క్షేత్రం ఇది. కృతయుగంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన కేదార మహారాజు పేరిట ఈ క్షేత్రానికి కేదార్‌నాథ్‌ అనే పేరు వచ్చిందని చెబుతారు. పురాణాల కథనం ప్రకారం… కురుక్షేత్ర సంగ్రామంలో సోదరులను వధించిన పాపం నుంచి విముక్తి పొందడానికి పాండవులు ఇక్కడ శివుడి కోసం తపస్సు చేశారు. పాండవులు చేసిన పాపం తక్కువేమీ కాకపోవడంతో శివుడు వారికి అంత తేలికగా పాప విమోచనం కల్పించరాదని భావించాడు. వారికి పరీక్ష పెట్టడం కోసం వృషభ రూపంలో వారి ఎదుట రంకెలు వేస్తూ నిలిచాడు. భీముడు వృషభాన్ని అదుపు చేయడానికి ప్రయత్నించాడు. అతడు మూపురాన్ని మాత్రమే పట్టుకోగలిగాడు. ఆ మూపురమే ఇక్కడ జ్యోతిర్లింగంగా వెలసిందని పురాణాలు చెబుతాయి.
***త్రయంబకేశ్వరం – మీనం
మీన రాశిలో జన్మించిన వారు దర్శించుకోవలసినది త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం. త్య్రయంబకేశ్వర క్షేత్రం మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లాలో గోదావరి నది ఉద్భవించిన ప్రదేశానికి చేరువలో ఉంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మూడు ముఖాలు ఈ జ్యోతిర్లింగంపై ఉండటం ఇక్కడి విశేషం. పాండవుల నాటిదిగా చెప్పుకొనే రత్నఖచిత కిరీటం కూడా ఈ క్షేత్రంలోని ప్రత్యేకత. ప్రతి సోమవారం ప్రదోష వేళ… అంటే సాయంత్రం సుమారు నాలుగు నుంచి ఐదు గంటల సమయంలో ఈ కిరీటాన్ని దర్శించుకోవడానికి భక్తులను అనుమతిస్తారు. పురాణాల కథనం ప్రకారం… గౌతమ మహర్షి చేతిలో మాయ గోవు మరణిస్తుంది. గోహత్యా పాతకం నుంచి విముక్తి పొందడానికి గౌతమ మహర్షి శివుడి కోసం ఈ ప్రాంతంలో తపస్సు చేస్తాడు. గౌతముడి తపస్సుకు మెచ్చిన శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో స్వయంభువుగా అవతరించాడు. గౌతముడి కోరికపై గంగను గో కళేబరం మీదుగా ప్రవహింపజేసి, అతడికి పాప విమోచనుడిని చేశాడు. గో కళేబరం మీదుగా గంగ ప్రవహించడంతో ఇక్కడ ఆవిర్భవించిన నదికి గోదావరి అనే పేరువచ్చింది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఆలయాన్ని పద్దెనిమిదో శతాబ్దికి చెందిన మరాఠా రాజు బాలాజీ బాజీరావు నిర్మించాడు. త్రయంబకేశ్వర క్షేత్ర పరిసరాల్లో నీలాంబిక, మాతాంబిక మందిరాలు, దత్తాత్రేయ ఆలయం వంటి సందర్శనీయ స్థలాలు ఉన్నాయి.
***మహాశివరాత్రిని ఎలా పాటించాలంటే…
మహాశివరాత్రి రోజున వేకువజామునే నిద్రలేచి, సూర్యోదయానికి ముందే స్నానాదికాలు ముగించుకోవాలి. ఇంట్లో నిత్యపూజ తర్వాత సమీపంలోని శివాలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి. ఉపవాస దీక్షలు పాటించేవారు పండ్లు, పాలు మాత్రమే స్వీకరించాలి. లౌకిక విషయాలను ఎక్కువగా చర్చించకుండా వీలైనంతగా భగవద్ధ్యానంలో గడపాలి. పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి. వీలుంటే మహాశివునికి అభిషేకం జరిపించడం మంచిది. మరునాటి సాయంత్రం ఆకాశంలో చుక్క కనిపించేంత వరకు జాగరణ ఉండాలి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వృద్ధులు ఉపవాస, జాగరణ నియమాలను పాటించకపోయినా, సాత్విక ఆహారం తీసుకుని, వీలైనంతగా భగవద్ధ్యానంలో గడపాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
***మహా శివభక్తుడు కన్నప్ప
శివ భక్తులందరిలోనూ మహాభక్తుడైన కన్నప్ప ఉదంతమే వేరు. అతడి అసలు పేరు తిన్నడు. బోయవాడు. రోజూ అడవిలో వేటాడేవాడు. ఒకసారి అతడికి ఎవరూ లేని గుడిలో శివలింగం కనిపిస్తుంది. శివుడిని తనతో ఇంటికి రమ్మని వేడుకుంటాడు. శివలింగం నుంచి ఎలాంటి బదులు రాకపోవడంతో తాను అక్కడే ఉండిపోయి, రోజూ ఉదయం శివలింగాన్ని, ఆలయాన్ని శుభ్రపరచేవాడు. తర్వాత అడవిలోకి వెళ్లి రెండు చేతుల్లోనూ పట్టినన్ని బిల్వపత్రాలు, నోట పట్టినన్ని నీళ్లు తీసుకొచ్చేవాడు. శివలింగాన్ని నోట ఉన్న నీటితో అభిషేకించి, బిల్వపత్రాలతో అలంకరించేవాడు. వేటాడిన జంతువుల మాంసాన్ని నివేదించేవాడు. ఒకసారి శివలింగం కన్నుల నుంచి రక్తం కారడం గమనించి కలత చెందుతాడు. ముందుగా ఒక కంటిని బాణంతో పెకలించి శివుడికి అర్పిస్తాడు. శివలింగం రెండో కంటి నుంచి రక్తం కారుతుండటంతో గుర్తుగా దానిపై కాలి బొటనవేలిని ఉంచి, రెండో కంటిని పెకలించేందుకు సిద్ధపడగా, శివుడు ప్రత్యక్షమవుతాడు. శివుడికి కంటిని సమర్పించడం వల్ల కన్నప్పగా ప్రసిద్ధి పొందుతాడు.

ఫిబ్రవరి 1న నుండి పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తిరునాళ్ళు

పెనుగంచిప్రోలులోని తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో ఏటా నిర్వహించే పెద్దతిరునాళ్ల ఉత్సవాలు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు, ధర్మకర్తల మండలి ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రాచలంలో నిర్వహించే సీతారాముల కల్యాణం తరహాలో తిరుపతమ్మ, గోపయ్య స్వామలు కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని నిర్ణయించారు. ప్రత్యక్షంగా 50 వేల మంది అమ్మవారి కల్యాణాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
**2న జలబిందెల మహోత్సవం
గ్రామానికి చెందిన ఐదు కుటుంబాల వారు మట్టి కుండలతో మునేరుకు వెళ్లి అక్కడి నుంచి నీటిని తీసుకొచ్చి ఆలయంలో ఉంచుతారు. పోలీసుస్టేషన్‌ సెంటర్‌లో జలబిందెలకు పోలీసులు మొక్కులు చెల్లిస్తారు. ఉత్సవంగా ఆలయానికి చేరుకున్న జలబిందెలను ఆలయంలో నవధాన్యాలతో ఏర్పాటు చేసిన మట్టిపై ఉంచుతారు.
**1న దీక్షల విరమణ
వచ్చే నెల ఒకటో తేదీ ఉదయం 6 గంటలకు ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మండల దీక్షలు పూర్తి చేసిన భక్తులు ‘తిరుముడి’ సమర్పిస్తారు. అనంతరం దేవస్థానం ఆధ్వర్యంలో భారీ అన్నసమారాధన కార్యక్రమం ప్రారంభమవుతుంది. రాత్రి 9 గంటలకు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మండపంలో అమ్మవారి కల్యాణం నిర్వహిస్తారు.
**3న పొంగళ్లు, అంక సేవ
ఆలయంలో పరివార దేవతగా ఉన్న అంకమ్మ తల్లికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. గ్రామానికి చెందిన రజకులు, కుమ్మర్లతో బోనాలు చేసి దేవతలకు ఆరగింపు చేస్తారు. సంప్రదాయ పూజలు నిర్వహిస్తారు.
**4న దీవెన బండారు
గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేయడాన్ని దీవెన బండారు అని పిలుస్తారు. ఆ రోజున ఆలయంలో రజకులు, కుమ్మర్లు గ్రామ దేవతలకు పూజలు నిర్వహిస్తారు. ఆయా దేవతలకు సంబంధించిన ఒగ్గు కథలను కళాకారులు ప్రదర్శిస్తారు.
***పెనుగంచిప్రోలుకు ఇలా చేరుకోవచ్చు..
విజయవాడ బస్‌స్టాండ్‌లో 39, 40, 41వ నంబర్‌ ప్లాట్‌ఫారాల్లో పెనుగంచిప్రోలు బస్సులు ఉంటాయి. నేరుగా వచ్చే అవకాశం లేనివారు నందిగామ బస్టాండ్‌లో దిగి అక్కడి నుంచి ఆటోలు, ఇతర వాహనాల్లో పెనుగంచిప్రోలు చేరుకోవచ్చు. సొంత వాహనాల్లో వచ్చేవారు జాతీయ రహదారిపై నవాబుపేట సమీపంలోని ముండ్లపాడు అడ్డరోడ్డు నుంచి 9 కిలోమీటర్లు ప్రయాణిస్తే పెనుగంచిప్రోలు చేరుకోవచ్చు.
*హైదారాబాద్‌ నుంచి వచ్చేవారు చిల్లకల్లు వద్ద నుంచి 12 కిలోమీటర్లు ప్రయాణిస్తే అమ్మవారి ఆలయానికి చేరుకోవచ్చు. జగ్గయ్యపేట బస్టాండ్‌ నుంచి నేరుగా బస్సులు ఉంటాయి.
* ఖమ్మం, మధిర పట్టణాల నుంచి నేరుగా బస్సు సర్వీసులు తిరుగుతున్నాయి. తిరునాళ్ల సమయంలో బస్టాండ్ల నుంచి ప్రత్యేక బస్సులుంటాయి.
ఉత్సవాల చివరి రోజున ఆలయంలో పుర్ణాహుతి నిర్వహిస్తారు. కల్యాణం పీటలపై కూర్చున్న కాకాని, కొల్లా వంశీయులు, ఆలయ అధికారులు, ధర్మకర్తలు పుర్ణాహుతిలో పాల్గొంటారు.
penuganchiprolu 2018 tirunallu tvrnews tiruvuru news kaburlu 2018 tirunallu tirupatamma

వైభవంగా తిరువూరు తిరునాళ్ళు ప్రారంభం

గత 400సంవత్సరాల నుండి మాఘమాసంలో క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న తిరువూరు శ్రీ వేంకటాచల స్వామి కల్యాణ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. తిరువూరు తిరునాళ్ళుగా ఈ ఉత్సవాలు పూర్వం జమిందార్ల హయాం నుండి జరుగుతున్నాయి. పాత తిరువూరులో శ్రీ వేంకటాచల స్వామీ దేవాలయాన్ని 416 ఏళ్ల క్రితం అప్పటి జమిందార్లు నిర్మించారు. దీనికోసం తిరువూరు రోలుపడి గ్రామాల్లో దాదాపు 50ఎకరాల భూమిని ఉత్సవాల కోసం ధూపదీప నైవేద్యాల కోసం జమిందార్లు కేటాయించారు. సోమవారం నుండి ఈ ఉత్సవాలు వైభవంగా జరిగేటట్లుగా ఏర్పాట్లు చేశారు. 30వ తేదీ మంగళవారం రాత్రి స్వామివారి కల్యాణం వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసారు. ఫిబ్రవరి 1వ తేదీన రధోత్సవం, 2వ తేదీన చూర్ణోత్సవం, 3వ తేదీన స్వామివార్ల పవళింపు సేవతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. మరి కొన్ని వివరాలు దిగువన పరిశీలించవచ్చు.