తమిళనాడులోని చెన్నై మెరీనా సముద్ర తీరంలో నీట మునిగి ఓ యువకుడు చనిపోగా మరో ఇద్దరు గల్లంతయ్యారు. చనిపోయిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా విద్యార్థి. మిగిలిన ఇద్దరు కృష్ణాజిల్లాకు చెందిన వారు. పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణాజిల్లా నందిగామ మండలం అడవిరావులపాడు గ్రామానికి చెందిన సూరా గోపిచంద్(18) ఇటీవల ఇంటర్ పూర్తి చేశాడు. చెన్నైలో ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశం పొందడానికి గంపలగూడెం మండలం దుందిరాలపాడు శివారు మల్లెంపాడుకు చెందిన వాకదాని ఆకాశ్(18) పాటు గుంటూరు గ్రామీణ మండలం పొత్తూరుకు చెందిన శివబాలాజీ(19)తో కలిసి రెండు రోజుల కిందట చెన్నై వెళ్లారు. అక్కడ ఉన్న మరో ఇద్దరు మిత్రులు రాజశేఖర్, శివ ప్రశాంత్‌తో కలిసి గురువారం మెరీనా తీరానికి వెళ్లారు. రాజశేఖర్, శివప్రశాంత్ ఒడ్డున ఉన్నారు. మిగిలిన వారు సముద్రంలోకి దిగి గల్లంతయ్యారు. చెన్నై పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి శివబాలాజీ మృతదేహాన్ని వెలికితీశారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Blog
తిరువూరులో 3కిలోల గంజాయి పట్టివేత
తిరువూరు పట్టణంలోని వాహిణి ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో గంజాయి కల్గి ఉన్న 8 మంది వ్యక్తులను ఎస్సై సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలోని బృందం అదుపులోకి తీసుకున్నట్లు నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. నిందితులు 20-22 వయస్సు కలిగినవారని ఆయన తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం నుండి గంజాయి తెప్పించి ఇక్కడ అక్రమంగా అమ్ముతున్నారని ఆయన వెల్లడించారు. వీరి నుండి 3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే కరోనా పరీక్షలు నిర్వహించాలి
తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక నుండి ప్రతినిత్యం కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. మంగళవారం నాడు 110మంది రక్తనమూనాలు సేకరించి నిర్ధారణ నిమిత్తం బెజవాడ తరలించారు. ఇవి రావడానికి 3-4 రోజుల సమయం పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. కానీ గత అనుభవాల దృష్ట్యా ఇవి రావడానికి మరింత సమయం పడుతుందని అవగతమవుతుంది. స్థానిక ఎమ్మెల్యే రక్షణనిధి చొరవ తీసుకుని తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే వచ్చిన వారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెంటనే వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
బుధవారం నాడు తిరువూరు ప్రభుత్వాసుపత్రిలో 43మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 16మందికి పాజిటివ్‌గా వచ్చింది. స్థానిక ఆసుపత్రి సిబ్బంది ఇరువురికి కూడా పాజిటివ్‌గా వచ్చినట్లు సమాచారం.
తిరువూరులో కఠిన ఆంక్షలు-నూజివీడు RDO
కోవిడ్ కేసులు అనూహ్యంగా పెరుగున్నందున నూజివీడు డివిజన్లో వారం రోజులపాటు ఆంక్షలు కఠినతరం చేస్తున్నట్లు రెవిన్యూ డివిజినల్ అధికారి బి.హెచ్.భవానిశంకర్ తెలిపారు. మంగళవారం సాయంత్రం సబ్ కలెక్టర్ కార్యాలయంలో కోవిడ్ నియంత్రణ టాస్క్ ఫోర్సు కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నూజివీడు డివిజన్లో ఇప్పటివరక్కు 887 కరోన పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, సోమవారం ఒక్కరోజే 100కు పైగా కేసులు నమోదు కావడం, నూజివీడు పట్టణంలో ఒక్కరోజే 72 కేసులు ఆందోళన కలిగించే విషయమన్నారు. నూజివీడు డివిజన్లోని నూజివీడు టౌన్, తిరువూరు టౌన్, అగిరిపల్లి, గంపలగూడెం, గన్నవరం, బాపులపాడు, వేలేరు గ్రామాలలో ఈనెల 6వ తేది నుండి 13వ తేది వరకు కఠిన ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. దుకాణాలను ఉదయం 6గంటల నుండి 10గంటల వరకు మాత్రమే అనుమతించడం జరుగుతుందని, అనంతరం అత్యవసర సేవలు, హెల్త్ ఎమర్జెన్సీ, పాలు, నిత్యవసరాలుకు అనుమతి ఉంటుందన్నారు. బ్యాంకులు ఉదయం 8గంటల నుండి 10గంటల వరకు ప్రజలకు సేవలు అందిస్తారని ఆయన తెలిపారు. 10గంటల నుండి 12గంటల వరకు వాణిజ్య లావాదేవీలకు అనుమతించడం జరుగుతుందన్నారు. అత్యవసరం పరిస్థితుల్లో మాత్రమే ప్రజారవాణాను అనుమతించడం జరుగుతుందన్నారు. దుకాణాలు, బ్యాంకుల వద్ద ప్రజలు సామజిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అనవసరంగా రోడ్లపైకి గుంపులుగా వచ్చేవారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆయన ఆదేశించారు.
తిరువూరు అధ్యాపకుడికి తానా అవార్డు
స్థానిక తిరువూరు శ్రీ వాహిని ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న తేజస్వికి కీబోర్డ్ ప్రదర్శనలో ద్వితీయ స్థానం సంపాదించుకున్నారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, ఇతర 100 తెలుగు సంస్థలు కలిసి నిర్వహించిన ఆన్లైన్ అంతర్జాతీయ తెలుగు కల్చరల్ ఫెస్ట్ 2020 పోటీలలో భాగంగా నాదామృతం – కీబోర్డ్ విభాగంలో ప్రదర్శించగా గత రాత్రి విజేతలను ఆన్లైన్లో ప్రకటించారు. తేజస్వి కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తూ, సాయంత్రం సమయంలో విద్యార్థులకు కీబోర్డ్ పై ఆన్లైన్ లో శిక్షణ కూడా ఇస్తుంటారు.
కోనేరు పేరు మీద స్మృతివనం ఏర్పాటు చేయాలి
గంపలగూడెం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులపై రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మాజీ ఉప-ముఖ్యమంత్రి కోనేరు రంగారావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ రాజమండ్రిలో మైనర్ బాలికపై అత్యాచారం, చీరాలలో దళిత యువకుడి హత్య, సీతానగరంలో దళిత యువకుడికి శిరోముండనం తదితర అంశాలపై నిరసన వ్యక్తపరిచారు. అనంతరం ఈ దిగువ తీర్మానాలకు ఆమోదం తెలిపారు.
* రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ కమీషన్‌ను వెంటనే నియమించాలి.
* దళితులపై జరుగుతున్న దాడుల కేసులను CBCIDకి అప్పగించాలి.
* ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
* రాష్ట్రంలో ఎన్నో సేవలందించిన కోనేరు రంగారావు పేరు మీద స్మృతివనం, రాష్ట్రస్థాయిలో ఒక పథకానికి పేరు పెట్టాలి.
తిరువూరు గంపలగూడెం మండలాల్లో 4 కొత్త కరోనా కేసులు
తిరువూరు సాయిబాబా గుడి ప్రాంతంలో ఒకరు. వావిలాలలో ఒకరికి కరోనా పాజిటివ్. గంపలగూడెం మండలంలో నిర్వహించిన కరోనా నిర్దారణ పరీక్షలో తునికిపాడు-1,దుందిరాలపాడు-1. మొత్తం 2 కేసులు నమోదు అయినట్లు పేర్కొన్న అధికారులు.
తిరువూరులో మళ్లీ కరోనా కలకలం
తిరువూరులో ఇప్పటివరకు నమోదు అయిన కరోనా కేసులపై స్పష్టతను ఇవ్వని అధికారులు తాజాగా మరోసారి స్థానికంగా కరోనా కలకలం రేపారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం 10మందికి చేపట్టిన రాపిడ్ పరీక్షల్లో ఇరువురికి పాజిటివ్ ఫలితం రాగా వారి నమూనాలు విజయవాడకు ధృవీకరణ నిమిత్తం పంపినట్లు సమాచారం. ఈ కారణంగా స్థానిక అధికారులు ప్రకటనలు వెలువరించలేదు. ఈ కేసుల ధృవీకరణకు మరికొంచెం సమయం పట్టే సూచనలు ఉన్నాయి.
తిరువూరును ముంచెత్తిన వరదలు. భారీగా నష్టం.
తిరువూరు పరిసర ప్రాంతాల్లో సోమవారం రాత్రి దాదాపు నాలుగు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. పల్లపు ప్రాంతాలు జలమయ్యాయి. చాలా ప్రాంతాల్లోకి నీరు ప్రవేశించి పేదప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. తిరువూరులోని భగత్‌సింగ్‌నగర్ కాలనీ, సుందరయ్య కాలనీ తదితర లోతట్టు ప్రాంతాలన్నీ వరదముంపుకు గురయ్యాయి. రోలుపడి శివారు రాజీవ్‌నగర్‌లో ఒక గృహం పూర్తిగా కూలిపోయింది. 12 గృహాల్లోకి నీరు ప్రవేశించడంతో అందులో నివసిస్తున్న వారిని సమీపంలోని పాఠశాలకు తరలించారు. కోకిలంపాడు పరిసర ప్రాంత పంటపొలాలు అన్నీ ముంపునకు గురయ్యాయి. కట్టలేరు, ఎదుళ్ల, పడమటి వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. తిరువూరు మండలం మల్లేల వద్ద ఒక చేపల లోడు లారీ బోల్తా పడింది. అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. తిరువూరు పట్టణంలో మంచినీరు సరఫరా చేసే మోటార్లు, పైప్లైన్లు వరదముంపునకు గురికావడంతో మూడురోజుల పాటు సరఫరా ఉండదని మున్సిపల్ అధికారులు ప్రకటన జారీచేశారు.
తిరువూరులో కరోనా పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి
కృష్ణాజిల్లా తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ తన గృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న పట్టణంలో కరోనా వైరస్ కలకలంతో ప్రజలు భయభ్రాంతులకు గురవౌతున్నారని అన్నారు. స్థానిక వస్త్రవ్యాపారి మాతృమూర్తి కరోనాతో మృతిచెందగా 60మంది ఉద్యోగులకు చేసిన పరీక్షల్లో పొంతన లేని వివరాలు వెల్లడిస్తున్నారని ఆయన మండిపడ్డారు. 50000 జనాభా కలిగిన తిరువూరులో కరోనా పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 60మంది కరోనా పరీక్షా ఫలితాలపై స్పష్టత ఇవ్వాలని కోరారు.