కోవిడ్ కేసులు అనూహ్యంగా పెరుగున్నందున నూజివీడు డివిజన్లో వారం రోజులపాటు ఆంక్షలు కఠినతరం చేస్తున్నట్లు రెవిన్యూ డివిజినల్ అధికారి బి.హెచ్.భవానిశంకర్ తెలిపారు. మంగళవారం సాయంత్రం సబ్ కలెక్టర్ కార్యాలయంలో కోవిడ్ నియంత్రణ టాస్క్ ఫోర్సు కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నూజివీడు డివిజన్లో ఇప్పటివరక్కు 887 కరోన పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, సోమవారం ఒక్కరోజే 100కు పైగా కేసులు నమోదు కావడం, నూజివీడు పట్టణంలో ఒక్కరోజే 72 కేసులు ఆందోళన కలిగించే విషయమన్నారు. నూజివీడు డివిజన్లోని నూజివీడు టౌన్, తిరువూరు టౌన్, అగిరిపల్లి, గంపలగూడెం, గన్నవరం, బాపులపాడు, వేలేరు గ్రామాలలో ఈనెల 6వ తేది నుండి 13వ తేది వరకు కఠిన ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. దుకాణాలను ఉదయం 6గంటల నుండి 10గంటల వరకు మాత్రమే అనుమతించడం జరుగుతుందని, అనంతరం అత్యవసర సేవలు, హెల్త్ ఎమర్జెన్సీ, పాలు, నిత్యవసరాలుకు అనుమతి ఉంటుందన్నారు. బ్యాంకులు ఉదయం 8గంటల నుండి 10గంటల వరకు ప్రజలకు సేవలు అందిస్తారని ఆయన తెలిపారు. 10గంటల నుండి 12గంటల వరకు వాణిజ్య లావాదేవీలకు అనుమతించడం జరుగుతుందన్నారు. అత్యవసరం పరిస్థితుల్లో మాత్రమే ప్రజారవాణాను అనుమతించడం జరుగుతుందన్నారు. దుకాణాలు, బ్యాంకుల వద్ద ప్రజలు సామజిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అనవసరంగా రోడ్లపైకి గుంపులుగా వచ్చేవారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆయన ఆదేశించారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.