తిరువూరు: తిరువూరులో కరోనా సోకి మమ్మీడాడీ యజమానుల తల్లి సోమవారం నాడు మృతి చెందగా ఆ సంస్థలో పనిచేస్తున్న యజమానులకు, సిబ్బందికి, పది మంది బయట వ్యక్తులకు శుక్రవారం నాడు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు. చౌటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి, కరోనా నోడల్ అధికారి డా.గంగాధర కుమార్ ఆధ్వర్యంలో నమూనాలు సేకరించి ప్రయోగశాలకు తరలించారు. ఈ పరీక్షలకు రెడేమేడ్ దుకాణం యజమాని కుటుంబం నుండి 10మంది, దుకాణ సిబ్బంది 38మంది, కరోనా సోకిందని అనుమానం వచ్చిన 10మంది నుండి నమూనాలు సేకరించారు. ఈ పరీక్షా ఫలితాలు ఆదివారం నాడు వస్తాయని భావిస్తున్నారు. శుక్రవారం నాడు తిరువూరులో రెండో వ్యక్తికి కరోనా పాజిటివ్ సోకిందని అధికారులు ప్రకటించడంతో పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు ఆయా ప్రాంతాల్లో ప్రజలు రాకపోకలు సాగించకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. శానిటరీ చర్యలను చేపడుతున్నారు. కరోనా కేసులు నమోదు అయిన సాయిబాబా రోడ్డు, రామాలయం వీధుల్లో అధికారులు పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతలకు 200మీటర్ల పరిధిలో బారికేడ్లు పెట్టి ప్రయాణాలను నిషేధించారు. మొత్తమ్మీద నేడు నిర్వహించిన కరోనా పరీక్షా ఫలితాల కోసం తిరువూరు పట్టన ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.