తిరువూరులో కరోనా నిర్ధారణ పరీక్షలు శుక్రవారమైనా జరుగుతాయా?
తిరువూరు మమ్మీడాడీ బట్టల దుకాణం యజమాని తల్లి గత సోమవారం నాడు కరోనాతో మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ఇది జరిగి నాలుగు రోజులు అవుతున్నప్పటికీ ఆ దుకాణం యజమానులకు కానీ అందులో పనిచేస్తున్న 38 మంది సిబ్బందికి గానీ గురువారం వరకు అధికారులు రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించలేదు. గురువారం నాడు వీరందరికీ కరోనా పరీక్షలు నిర్వహించడానికి స్థానిక ప్రభుత్వాసుపత్రికి రప్పించారు. అయితే విజయవాడ నుండి కరోనా పరీక్షలు జరిపే వాహనం రాలేదని చెప్పి వెనక్కి తిప్పి పంపించారు. శుక్రవారం కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించే విషయంపై గురువారం రాత్రి వరకు స్పష్టత రాలేదు. దీంతో పట్టణ ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తక్షణమే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని…బాధితులను గుర్తించి సహాయక కార్యక్రమాలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.