ధర్మప్రచారంలో భాగంగా నెమలి వేణుగోపాలస్వామి దేవాలయంవారు వేణుగోపాల స్వామి కళ్యాణాలను వివిధ ప్రాంతాలలో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ది: 20-10-2019 న తిరువూరులోని శ్రీవేంకటాచలస్వామి ఆలయంలో ఉ:10.00 గంటలకు శ్రీవేణుగోపాలస్వామి వారి కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని తీర్దప్రసాదాలను స్వీకరించాలని ఆలయ ఇ.ఓ కోరారు.
స్థల పురాణం . :—- ద్వాపరం లో అవతరించిన శ్రీకృష్ణ పరమాత్మ , తన అవతారాన్ని చాలిస్తూ, తన నెమలి పింఛాన్ని ఇచ్చట వదిలి వెళ్లాడని , ఆ ప్రదేశం లోనే స్వామి భూగర్భం లో ఉండేవాడని, ఎందరో మహర్షులు ఈయనను సేవించి ,తరించారని ప్రతీతి. అందుకే ఈ ప్రాంతాన్ని “ నెమలి “గ్రామం గా పిలుస్తున్నారు.
మరొక కధనాన్ని—— అనుసరించి, “ అదృశ్యో వ్యక్త రూపశ్చ” అని కదా విష్ణుసహస్రనామము. ఈ స్వామి వ్యక్త రూపుడైన విధము ఈ విషయాన్నే నిరూపిస్తోంది. ఇంతకు పూర్వము ఈ ప్రాంతం లో తపస్సు చేసుకున్న మహర్షులు , మునులు కారణాంతరాల వల్ల ఈ ప్రాంతాన్ని వదిలి వెడుతూ, ఈ సుందర సుకుమారమూర్తి ని భూగృహం లో భద్రపరచి వెళ్లి వుంటారని, స్వామి లభించిన తీరును బట్టి భక్తులు భావిస్తున్నారు.
ఆ రోజు 23.3.1953 వ తేది శ్రీ రామనవమి . ఊరంతా సీతారామ కళ్యాణ వేడుకల్లో మునిగి వుంది. అదే సమయం లో ఒకరైతు పొలం లోకి మేరువు తోలించు కుంటున్నాడు. పలుగు వేసిన మొదటి దెబ్బ కే ఖంగుమన్న శబ్దం వచ్చింది. చోటు మార్చి మళ్లీ పలుగు వేశాడు. మళ్లీ అదే ధ్వని. ఈ సారి రెండు ఘాతాల మధ్య పలుగు వేయబోవు నంతలో మిఱుమిట్లు గొలిపే ఒక మెరుపు వెలువడింది. దానితో ఆ మనిషి స్పృహ తప్పి పడిపోయాడు. తోటి పనివారు అతని ముఖం మీద నీళ్లు చల్లి సపర్యలు చేయగా, కోలుకున్నాడు కాని అతని చూపు పోయింది. మిగిలిన వారందరు అక్కడ త్రవ్వి చూడగా స్వామి వారి విగ్రహము, ప్రక్కనే హోమగుండము,ప్రమిదలు.ఒక శంఖము,మొదలైనవి లభించినవి. అదృశ్య రూపం లో ఉన్నస్వామి ఈ విధం గా వ్యక్త రూపుడైనాడు. ఏనాడో మహర్షుల చేత పూజలందుకున్న యోగీశ్వరేశ్వరుడు మరలా ఇలా దర్శన మిచ్చాడని భక్తులు భావించారు. స్వామి ఆదేశానుసారం స్వామి లభించిన ప్రదేశం లోనే ఆలయ నిర్మాణం గావించారు.
చుట్టుప్రక్కల అరవై గ్రామాల ప్రజల్లో ఎంతోమంది స్వామి తమకు కలలో కన్పించాడని దేవాలయ నిర్మాణానికి ముందుకొచ్చారు. ఆలయాన్ని నిర్మించి, ఉత్తరాభిముఖం గా వెలసిన స్వామిని తూర్పు ముఖంగా ప్రతిష్టించ ప్రయత్నించారు. ఒక్కసారిగా భయంకరమైన గాలివాన వచ్చి, వేసిన పందిళ్లు, చేసిన ఏర్పాట్లు ఛిన్నాభిన్నమైనాయి. చేసిన తప్పును తెలిసి కొని, స్వామిని ఉత్తరాభిముఖుని చేయడం తో సామాన్య పరిస్ధితి ఏర్పడిందిట. అందువలన స్వామి ఆలయ ముఖద్వారం ఈనాటికీ ఉత్తర ముఖం గానే ఉంటుంది. 6.2.1957 లో స్వామి ని ఇప్పుడున్న ఆలయం లో ప్రతిష్టించారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.