తిరువూరు పట్టణంలోనూ, పరిసర ప్రాంతాల్లోనూ గత మూడు నెలలు నుండి డెంగ్యూ, విషజ్వరాలతో 70మంది మృతి చెందినప్పటికీ మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి, ఇతర అధికారులు పట్టించుకోవడం లేదని మాజీ ఎక్సైజ్ మంత్రి కేఎస్.జవహర్, మాజీ ఎమ్మెల్యే ఎన్.స్వామిదస్లు ధ్వజమెత్తారు. తిరువూరు మున్సిపాల్టిలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని, దోమల బెడద విపరీతంగా ఉందని మురుగు కాలవలు శుభ్రపరచడం లేదని కమిషనర్ శ్రీకాంత్ రెడ్డిని వారు నిలదీశారు. తక్షణమే ఫాగింగ్ మిషన్ల ద్వారా దోమల మందు చల్లాలని, డ్రెయిన్లు శుభ్రపరచాలని, పిచ్చి మొక్కలను తొలగించాలని పారిశుద్ధ్యం మెరుగుపరచాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. లేని పక్షంలో మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేపడతామని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిని వారు సందర్శించారు. జ్వరపీడితులతో ప్రభుత్వ ఆస్పత్రి కిటకిటలాడుతున్నప్పటికి ఆస్పత్రిలో రోగులకు సరైన వైద్యం అందటం లేదని రక్తపరీక్షలు నిలిపివేశారని వారు ఆరోపించారు. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ప్రెవేట్ ప్రాక్టీస్ చేసుకుంటూ రోగులను నిర్లక్ష్యం చేస్తున్నారని వారు ఆరోపించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలను నిలిపివేసి ప్రజల ప్రాణాలను తీస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెదేపా నాయకులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. అధికారుల స్పందన చూసి పరిస్థితులు మెరుగుపడకపోతే ప్రభుత్వ ఆస్పత్రి ముందు, మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేపడతామని వారు ప్రకటించారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.