కృష్ణా జిల్లా తిరువూరు సమీపంలోని వేమిరెడ్డిపల్లి ప్రాంతంలోని రాళ్లు రత్నాలంట. అవి ఎంతో విలువైనవంట! ఈ మాటలు అక్కడి ప్రజలు చెప్పినవి కాదండీ.. సాక్షాత్తు జియాలజీ శాస్త్రంలో పీహెచ్డీ చేస్తున్న శాస్త్రవేత్త.. అక్కడి రాళ్లను పరిశోధన చేసి చెప్పిన మాటలు ఇవి. ఇంతకీ ఆ ప్రాంతం సంగతేంటి? ఆ శాస్త్రవేత్త ఎవరు..? ఆమె చేసిన పరిశోధన విశేషాలేంటి తెలుసుకోవాలనుందా..?
**పరిశోధనకు మూలం ఏంటీ..?
ఎమ్మెస్సీ పూర్తిచేసి హైదరాబాద్ జెమ్స్ నిర్ధారణ కేంద్రంలో పనిచేస్తున్న సమయంలో నజియా సుల్తానాకు వేమిరెడ్డిపల్లిలో పరిశోధన చేసే అవకాశం వచ్చింది. ఆ ప్రాంతానికి చెందిన పలువురు ఈ రాళ్లను పరిశోధన కోసం అక్కడికి తీసుకొని వచ్చారు. అప్పుడు ఈ రాళ్లు ఏ కోవకు చెందినవో గుర్తించడానికి అక్కడి విద్యార్థి నజియా ముందుకొచ్చింది. ఈ ప్రయత్నం చాలా ఆసక్తిగా అనిపించడంతో ఆ రాళ్లను ఎక్కడినుంచి తెచ్చారు..? అవి ఎక్కువగా ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని నాగార్జున విశ్వవిద్యాలయ సీనియర్ ఆచార్యులు పొదిరి శంకర్ పిచ్చయ్య పర్యవేక్షణలో అక్కడికి వెళ్లి పరిశోధన ప్రారంభించింది. స్థానికులు ఆ రాళ్లను కేవలం రంగురాళ్లుగా భావిస్తున్నారు. కానీ నజియా చేసిన ఈ పరిశోధనలో అవి బెరిల్ జాతికి చెందిన ఆక్వామెరైన్ రత్నాలుగా తేలాయి. ఫలితంగా ఈ రాళ్లకు ప్రస్తుతం ఎక్కడ లేని ప్రాధాన్యం లభిస్తోంది.
**రత్నాల విశేషాలేంటి..?
నజియా పరిశోధన చేసిన ఈ ఆక్వామెరైన్ రత్నాలు నీలం, ఆకుపచ్చ రంగుల్లో షట్కోణ ఆకృతిలో ఉంటాయి. 200 గ్రాముల బరువుండే ఈ రాళ్లు కాఠిన్య స్థాయి 7 నుంచి 8 శాతం వరకు ఉంటుంది. ఈ రాళ్లను సానబెడితే రత్నాల మాదిరి ఆకర్షణీయంగా మారుతాయి. వీటిలో ప్రధానంగా బెరీలియం, అల్యూ మినియం, ఆక్సైడ్ ఉంటాయి. ఈ రత్నాలు క్యారెట్ ధర సుమారు రూ.800 వరకు ఉంటుందని అంచనా. వీటిని నగలు, ఆభరణాల్లో ఉపయోగించుకోవచ్చు. ఇవి బ్రెజిల్, రష్యా, టాంజానియా, నైజీరియా, ఈజిప్ట్, నమీబియా, జింబాబ్వే, అమెరికా, కెనడా, మెక్సికో, వియత్నాంలలో విరివిగా లభిస్తాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, కేరళ, రాజస్థాన్ రాష్ట్రాల్లోనూ దొరుకుతాయి.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.