గత 50 సంవత్సరాల నుండి లక్షలాది మంది విద్యార్థులు విద్యాబుద్ధులు నేర్చుకున్న కలల సౌధం తిరువూరులో కాలగర్భంలో కలిసిపోయింది. వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనంలో 1969వ సంవత్సరంలో అప్పటి వరకు ఉన్న హైస్కూళ్లను ప్రభుత్వ జూనియర్ కళాశాలగా అభివృద్ధి చేశారు. జూనియర్ కళాశాలగా మారక ముందు కూడా వేలాది మంది విద్యార్థులు ఇక్కడి హైస్కూల్లోని ఈ భవనాల్లో విద్యనభ్యసించారు. 1969లో అప్పటి వరకు ప్రధానోపాధ్యాయులుగా ఉన్న గాడేపల్లి దక్షిణామూర్తిశాస్త్రి (జీ.డీ.ఎం.శాస్త్రి) హయాంలో జూనియర్ కళాశాల ఏర్పడింది. మొదటి ప్రిన్సిపాల్‌గా సివీ.నరసావదానులు నియమితులయ్యారు. అనంతరం సీవీ పూర్ణచంద్రరావు, కే.ధర్మారావు, వెంకట్ రెడ్డి, ఆనందమూర్తి, బోటని నరసింహారావు తదితరులు ఈ కళాశాల ప్రిన్సిపాళ్లుగా పని చేసి తిరువూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మంచి గుర్తింపు తెచ్చారు. ప్రస్తుతం కనుమరుగైన ఈ భవనాల్లో తమ బాల్యాన్ని గుర్తుకు తెచ్చుకుందాం – అందరం కలిసి కళాశాల ఏర్పడి 50ఏళ్లు అయిన సందర్భంగా స్వర్ణోత్సవాలు జరుపుకోవాలనేది చాలా మంది పూర్వ విద్యార్థుల కోరిక. ఈ కళాశాల తొలి విద్యార్థి సంఘం అధ్యక్షుడు కవుటూరి వినయకుమార్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రముఖ న్యాయవాదిగా రాణిస్తున్నారు. ఇక్కడే విద్యనభ్యసించిన పసుపులేటి వెంకటేశ్వరరావు ఇటీవలే ఆదాయపు పన్ను శాఖ చీఫ్ కమీషనరుగా పదవీవిరమణ చేశారు. ఇక్కడే చదువుకున్న బుద్ధారపు వెంకటేశ్వరరావు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్(క్యాట్) చైర్మన్‌గా ఇటీవల వరకు పనిచేశారు. ఇటువంటి ప్రముఖులు ఇంకా ఎందఱో ఉన్నారు. వీరంతా తిరువూరు హైస్కూల్, జూనియర్ కళాశాల పూర్వ విద్యార్ధుల సమ్మేళనాన్ని నిర్వహించాలని ఆసక్తిగా ఉన్నారు. త్వరలోనే హైదరాబాద్‌లో ఒక తొలి సమావేశాన్ని నిర్వహించి తిరువూరులో పూర్వవిద్యార్థుల సమ్మేళనానికి శ్రీకారం చుట్టాలని అలోచనలో ఉన్నారు. దీనికి సంబంధించి మీ అభిప్రాయలను కూడా పంచుకోండి. —కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్. ఈమెయిల్:kilarumuddukrishna@yahoo.com, ఫోన్ నంబరు-9440231118. ఈ క్రింది పేపర్ కట్టింగ్ కూడా తిలకించండి.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.