తిరువూరు నియోజకవర్గం నుండి వైకాపా అభ్యర్ధిగా కొక్కిలిగడ్డ రక్షణనిధి ఘనవిజయం సాధించారు. ఎక్సైజ్ శాఖా మంత్రి కె.ఎస్.జవహర్‌ను మట్టికరిపించారు. దాదాపు 11000 ఓట్ల మెజార్టీతో జవహర్‌పై విజయం సాధించారు. ఎన్నికల ప్రచారంలో రక్షణనిధి నిరక్షరాస్యుడని, స్థానికుడు కాదని, దిగుమతి సరుకని మంత్రి జవహర్ విమర్శలు చేశారు. అయినప్పటికీ రక్షణనిధి మంచితనాన్ని గత అయిదేళ్ల నుండి గమనించిన తిరువూరు నియోజకవర్గ ప్రజలు మళ్లీ ఆయనకే బ్రహ్మరథం పట్టారు. జవహర్‌ను ఆయన వచ్చినదారినే వెనక్కి పంపించారు. రక్షణనిధి కన్నా జవహర్‌కు ఒక్క గంపలగూడెం మండలంలోనే ఆరవ రౌండు వరకు 7000 మెజార్టీ వచ్చింది. ఏడవ రౌండు నుండి తిరువూరు మండలం లెక్కింపు ప్రారంభమై రక్షణనిధిని అందలం ఎక్కించింది. తిరువూరు పట్టణంలోనే వైకాపాకు 2500 మెజార్టీ లభించింది. మండలంలోని మిగిలిన గ్రామాల నుండి మరొక రెండు వేల మెజార్టీ రక్షణనిధికి రాగా ఒక్క మునుకుళ్ళ గ్రామంలోనే 500 మెజార్టీ రక్షణనిధికి లభించింది. జవహర్ స్వగ్రామం గానుగపాడులో రక్షణనిధికి 7వేల ఓట్ల మెజార్టీ లభించాయి. విస్సన్నపేట మండలం నుండి 2500, ఎ.కొండురు మండలం నుండి 4000 మెజార్టీ రక్షణనిధికి లభించింది. రెండవ సారి తిరువూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన రక్షణనిధికి పార్టీలకు అతీతంగా ప్రజలను స్వాగతం పలుకుతున్నారు. ఆయనకి జగన్ క్యాబినెట్లో మంత్రి పదవి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. తనని గెలిపించిన తిరువూరు నియోజకవర్గ ప్రజలకు రక్షణనిధి కృతజ్ఞతలు తెలిపారు.
Tags: Kokkiligadda Rakshana Nidhi Gets 7000 Votes Majority In Jawahars Own Village – Tiruvuru Kaburlu – Tiruvu News – Tiruvuru Political News
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.