తిరువూరు నియోజకవర్గంలో అందరూ అనుకున్నట్లుగానే, మీరందరూ ఊహించినట్లుగానే ప్రస్తుత ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి రక్షణనిధి విజయం సాధించారు. కొవ్వూరు నుండి ఎన్నికలకు ముందు అర్ధాంతరంగా తిరువూరుకు దిగుమతి అయిన మంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్‌పై రక్షణనిధి ఘనవిజయం సాధించారు. తిరువూరు నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి విజయం సాధిస్తారని అన్ని సర్వేలు ముందుగానే వెల్లడించాయి. అయితే ఓట్ల లెక్కింపు సందర్భంగా 5వ రౌండు పుర్తి అయ్యేంత వరకు మంత్రి జవహర్ ప్రతి రౌండ్లోనూ ముందంజలో ఉన్నారు. మధ్యాహ్నం 3గంటల వరకు EVMలు మొరాయించడంతో జవహరే ఆధిక్యంలో ఉన్నారని ప్రచారం సాగింది. అప్పటి వరకు గంపలగూడెం మండలం ఓట్ల లెక్కింపు జరిగింది. ఆరవ రౌండు నుండి తిరువూరు మండలం లెక్కింపు ప్రారంభమయింది. ఇక్కడ నుండి రక్షణనిధి హవా కొనసాగింది. 19వ రౌండు లెక్కింపు పూర్తి అయ్యేసరికి రక్షణనిధి మెజార్టీ 10వేలు దాటింది. చివరి వరకు ప్రతి రౌండులోనూ రక్షణనిధి ఆధిక్యాన్ని కొనసాగిస్తూనే వచ్చారు. సౌమ్యుడు, మంచివ్యక్తిగా పేరు పొందిన రక్షణనిధి రెండవ సారి ఎన్నిక కావడం పట్ల తిరువూరు ప్రజలు సంతోషం వ్యక్తపరుస్తున్నారు. వైకాపా శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. రక్షణనిధి గత ఐదు సంవత్సరాల నుండి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వం ఆయన్ను ఉత్సవ విగ్రహంగా మార్చింది. అయినప్పటికీ రక్షణనిధి ఎవరి వద్దా పైసా ఆశించకుండా తిరువూరు ప్రజల మధ్యనే గడిపి వారి అభిమానాన్ని చూరగొన్నారు. ఈ పర్యాయం వైకాపా అధికారంలోకి రావడంతో రక్షణధి మంత్రి అవుతారని వార్తలు వెలువడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రలోభాలకు గురై చాలా మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు వైపునకు వెళ్లినప్పటికీ రక్షణనిధి మాత్రం నీతి, నిజయతీగా వ్యవహరించి జగన్ వైపే ఉన్నారు. దీంతో కాబోయే ముఖ్యమంత్రి జగన్ వద్ద మంచి పేరును సంపాదించారు. రక్షణనిధికి మంచి పదవి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. —కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్టు.
Tags:Kokkiligadda Rakshananidhi wins over KS Jawahar – Tiruvuru 2019 Election Result – Tvrnews – Tiruvuru Political News – Tiruvuru Krishna District Political News – Tiruvuru Kaburlu
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.