“ఊరందరిది ఒకదారి అయితే….ఉలిపి కట్టది వేరొక దారి” అన్న సామెత తిరువూరు నియోజకవర్గానికి అతికినట్లుగా సరిపోతుంది. గడిచిన మూడు ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్ధి స్వామిదాసును ఓడించిన తిరువూరు ప్రజలది మరొక సారి తెలుగుదేశం పార్టీని ఓడిస్తున్నారని అన్ని సర్వేలు తెలుపుతున్నాయి. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని కొన్ని సర్వేలు తెలుపుతున్నప్పటికీ ఆ సర్వే రిపోర్టులో తిరువూరు స్థానం తెలుగుదేశం గెలుచుకుంటుందని స్పష్టంగా చెప్పలేకపోయారు. తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు కూడా తిరువూరు సీటు పైన ఆశలు వదులుకున్నట్లు సమాచారం. తెలుగుదేశం అభ్యర్ధిగా పోటీ చేసిన మంత్రి జవహర్ మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద తాను 20వేలకు పైగా మెజార్టీతో తిరువూరు నుండి గెలుస్తానని చెప్పినట్లు సమాచారం. తిరువూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తాళ్లూరి రామారావు మాత్రం ఐదువేల మెజార్టీతో బయట పడతామని కార్యకర్తల్లో ఊరడిస్తున్నారు. నియోజకవర్గానికి చెందిన తెదేపా నేతలెవరూ విజయం పట్ల ధీమాగా లేరు.
*** వైకాపా జోరు
ఈ సారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఉన్న చాలా గ్రామాల్లో వైకాపా మెజార్టీ వస్తుందని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. దీంతో వైకాపా నాయకులు విజయం పట్ల ధీమాగా ఉన్నారు. పందేల కాద్దాం రండి అంటూ తెలుగుదేశం నేతలకు కార్యకర్తలకు వల విసురుతున్నారు. మొదట సరిపందేలు అన్నారు. అనంతరం రూపాయికి రూపాయిన్నర ఇస్తామని తెలుగుదేశం పార్టీ వారిని ప్రలోభాలకు గురి చేశారు. మంగళవారం నాటికి వైకాపా నాయకులు పందేల కోసం తెలుగుదేశం నేతల చుట్టూ, కార్యకర్తల చుట్టూ తిరుగుతున్నారు. రూపాయికు రెండు రూపాయిలు ఇస్తామంటూ ఆశలు చూపుతున్నారు. గ్రామాల్లో తప్ప తెలుగుదేశం తరపున తిరువూరు నియోజకవర్గంలో పందేలు కాయడానికి ఎవరూ సాహసించడం లేదని సమాచారం.
*** రక్షణనిధి మంత్రి అవుతాడట?
మొత్తం మీద ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా శ్రేణుల్లో మంచి ఉత్సాహం కనిపిస్తోంది. జగన్ ముఖ్యమంత్రి అయినట్టే వైకాపా శ్రేణులు కలలు కంటున్నారు. తిరువూరు నుండి రక్షణనిధి గెలుస్తాడని ఆయనకు రాష్ట్ర క్యాబినెట్లో మంత్రి పదవి ఇస్తారని ప్రచారం చేస్తున్నారు. ఆయనకు అప్పుడే శాఖలు కూడా కేటాయించారు. రక్షణనిధికి గృహనిర్మాణ శాఖ కేటాయిస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు వెలువడ్డాయి. ఈ విషయాన్ని రక్షణనిధి వద్ద ప్రస్తావించగా పార్టీలో తనకంటే సేనియర్లు చాలామంది ఉన్నారని మంత్రి పదవి వస్తుందని తనకెవ్వరూ చెప్పలేదని, కార్యకర్తలే అభిమానంతో పోస్టులు పెట్టారని తెలిపారు. మొత్తం మీద తిరువూరు ప్రజలు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఒకవేళ నూటికి వెయ్యి శాతం తెలుగుదేశం గెలుస్తుందని చంద్రబాబు చెబుతున్న దాని ప్రకారం తిరువూరులో కూడా తెదేపా అభ్యర్ధి జవహర్ గెలిస్తే ఎలాగో మళ్లీ మంత్రి అవుతారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ పార్టీ వర్గాలు ప్రచారం చేస్తున్నట్లు రక్షణనిధి మంత్రి అవుతారు. ఎవరు గెలిచినా తిరువూరుకు మంత్రి పదవి రావడం ఖాయం. (జనాలకు మంచినీళ్లు రావడం, దోమలు అరికట్టడం మాత్రం ఖచ్చితంగా అనుమానం.) ఆ మంత్రి ఎవరనేది 23వ తేదీ ఉదయం వరకు వేచి చూద్దాం. —కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.