తిరువూరులో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న రాజీవ్ రతన్, బహుజన్ సమాజ్ పార్టీ తరపున పోటీ చేస్తున్న నంబూరు శ్రీనివాసరావులు నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తాము విజయం సాధించలేమని తెలిసినప్పటికీ ఎక్కడో, ఎప్పుడో ఓ చిన్న ఆశ వారిని ప్రచారం వైపు పరుగులు పెట్టిస్తోంది. 34 సంవత్సరాల యువకుడైన కాంగ్రెస్ అభ్యర్ధి రాజీవ్ రతన్ బ్రహ్మచారి, సౌమ్యుడు. 2014లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి 3500 ఓట్లు సంపాదించారు. రాజీవ్ రతన్ కు కాంగ్రెస్ పెద్దలతో మంచి పరిచయాలు ఉన్నాయి. చిన్న వయసులోనే కే.వీ.పీ రామచంద్రారావు, రఘువీరారెడ్డి వంటి కాంగ్రెస్ సీనియర్ నేతలతో రాజీవ్ కు ఉన్న పరిచయం ఆయనకు భవిష్యత్తుపై ఆశలు రేకెత్తిస్తున్నాయి. తిరువూరులో తాను గెలవలేకపోయినప్పటికీ తనలాగే బ్రహ్మచారిగా ఉన్న రాహుల్ గాంధీ ప్రధాని అయితే తనకు మంచి భవిష్యత్తు ఉంటుందని రాజీవ్ రతన్ భావిస్తున్నారు. దీని కోసమే సొంత డబ్బు చాలా ఖర్చు చేస్తున్నారు. నమ్మకమైన అనుచర వర్గం ఉండటం రాజీవ్ రతన్ కు ఒక వరం. నేటి రాజకీయాల్లో రాజీవ్ రతన్ లాంటి యువ నాయకులు ఏ పార్టీలో ఉన్నప్పటికీ వారినీ మిగిలిన వారు ఆదర్శంగా తీసుకోవాలి అనటంలో సందేహం లేదు.
*** దొరకడు. చిక్కడు. ఆయనే నంబూరు శ్రీనివాసుడు!
బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న నంబూరు శ్రీనివాసరావు నేటి రాజకీయాలకు సరిగ్గా సరిపోయే వ్యక్తి. తిరువూరు నియోజకవర్గంలో ఉన్న ఏ రాజకీయ నాయకుడికి తీసిపోలేని విధంగా నంబూరు రాజకీయం చేయగలరు. ఆయన ఆలోచనలకు తగ్గట్టుగానే 2014లోనూ, ప్రస్తుత ఎన్నికల్లోనూ, నంబూరు శ్రీనివాసరావు విచిత్రమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. 2014లో తమ అభిమాన నటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేయటానికి నంబూరు బీ-ఫారం కూడా తెచ్చుకున్నారు. 2014 ఎన్నికలకు ముందు సంవత్సరం క్రితమే తిరువూరు నియోజకవర్గంలో విసృతంగా పర్యటిస్తూ తనకంటూ అనుచర వర్గాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకున్నారు. చివరి నిమిషంలో కేంద్ర మాజీ మంత్రి పర్వతనేని ఉపేంద్ర సిఫారసుతో తిరువూరు మాజీ ఎమ్మెల్యే వక్కలగడ్డ ఆదాం కుమారుడు వక్కలగడ్డ విజయభాస్కర్‌కు చిరంజీవి తిరువూరు ప్రజారాజ్యం బీ-ఫారం ఇచ్చారు. దీనితో కలత చెందిన నంబూరు తిరువూరు నుండి కొద్ది కాలం కనుమరుగయ్యారు. కొన్నాళ్ళ తరువాత తెలుగుదేశంలో చేరి స్వామిదాసుకు పోటీగా మారారు. అక్కడ లాభం లేదనుకుని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టగానే మళ్ళీ తన పాత గురువు వద్దకు చేరారు. పెద్దకారులో జనసేన పార్టీ పెద్ద జెండాను వేసుకుని నియోజకవర్గం అంతా తిరిగారు. ఈసారి కూడా నంబూరు గత ఎన్నికల్లో లాగానే విచిత్రమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. జనసేన టికెట్ కోరుకుంటే నంబూరుకు పవన్ బీఎస్పీ టికెట్టు ఇచ్చారు. ఎవరికీ చిక్కడు, దొరకడుగా నంబూరుకు పేరుంది. ఏమి వ్యాపారం చేస్తారో…..ఎలా సంపాదింస్తారో, తెలియదు కానీ, నంబూరి వ్యవహారశైలి మాత్రం పవన్ కళ్యాణ్ కన్నా ఆడంబరంగా ఉంటుంది. ప్రస్తుతం నంబూరుకు ఒక బలమైన కోరిక ఉంది. మాయావతి ప్రధాన మంత్రి అవుతుందని, తాను ఢిల్లీలో పైరవీలు చేయవచ్చునని, అనే బలమైన ఆశతో నంబూరు శ్రీనివాసరావు ఈ ఎన్నికల్లో రాత్రింబవళ్ళు కష్టపడుతున్నాడు. బెస్ట్ ఆఫ్ లక్ నంబూరు. —కిలారు ముద్దుకృష్ణ సీనియర్ జర్నలిస్ట్.
tags: namburu srinivasa rao, parasa rajeev ratan, tiruvuru 2019 elections, tiruvuru kaburlu, tvrnews, krishna district, congress, janasena
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.