తిరువూరు నియోజకవర్గ సార్వత్రిక ఎన్నికల తేది దగ్గర పడుతుండటంతో తిరువూరు నియోజకవర్గంలో ఓటర్లను ఆకట్టుకొనేందుకు ఆయా ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దాదాపుగా నాలుగు మండలాలలోని ఆన్ని గ్రామాల్లో ఆత్మీయ సమ్మేళనాల పేరుతో కార్యక్రమాలను నిర్వహించి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు. ఆయా కులాలు, మతాల వారిగా రహస్య ప్రదేశాల్లో సమావేశాలు నిర్వహించి భారీ స్థాయిలో నగదు పంపిణీకి తెరతీశారు. రాత్రి వేళల్లో కొందరు అభ్యర్థులు కుల సంఘాలు, వ్యాపార, ఉద్యోగ, చేతి వృత్తిదారుల సంఘాల వారికి విందు, వినోదాలు ఏర్పాటు చేసి తమ పార్టీకి ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని సంఘ నాయకులపై ఒత్తిడి తెస్తున్నారన్నది బహిరంగ రహస్యం. ఆయా సంఘాల అవసరాలను బట్టి మీకు అండగా ఉంటామని, ఏ విషయంలోనైనా మీకు సహకరిస్తామని హామీలు గుప్పిస్తూన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా కొందరు అభ్యర్థులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
*** వ్యక్తిగత విమర్శలెందుకో?
తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న మంత్రి జవహర్ ఎక్కడికి వెళ్లినా స్థానిక ఎమ్మెల్యే వైకాపా అభ్యర్ధి కొక్కిలిగడ్డ రక్షణనిధిపై వ్యక్తిగత విమర్శలు చేయటం ఆ పార్టీలోని వారికే నచ్చడం లేదు. వైకాపా అభ్యర్ధి రక్షణనిధి కూడా తనపై చేస్తున్న ఆరోపణలకు గట్టిగానే సమాధానం ఇస్తున్నారు. తిరువూరు తెలుగుదేశం పార్టీలో ఇంకా నాయకులందరూ ఏకతాటిపై నడుస్తున్న సూచనలు కనిపించడం లేదు. అందరిని సమన్వయ పరచడంలో తెదేపా అభ్యర్ధి జవహర్ ఇంకా చొరవ చూపడం లేదు. భాజపా, బీఎస్పీ అభ్యర్ధుల ప్రచారం నియోజకవర్గంలో మొక్కుబడిగానే సాగుతోంది. మొత్తం మీద ఓటర్లను తమవైపు తిప్పుకోవడం కోసం తెదేపా వైకాపా పార్టీలు గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున సొమ్ములు ఖర్చు చేయటానికి సిద్దమవుతున్నాయి.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.