తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి 1989వ సంవత్సరంలో తన అన్న కొత్తపల్లి రవీంద్రనాథ్ తెదేపా అభ్యర్థిగా పోటీచేసి 1170 ఓట్ల స్వల్ప మెజార్టీతో పరాజయం పాలయ్యారని అనంతరం స్వామిదాస్‌కు తెదేపా ఈ సీటు కేటాయించిందని ఎక్సైజ్ శాఖా మంత్రి తిరువూరు తెదేపా అభ్యర్థిగా టికెట్ దక్కిన కొత్తపల్లి శామ్యూల్ జవహర్ శుక్రవారం నాడు తిరువూరులో విలేఖరులకు తెలిపారు. ఆనాడు తాము ఏ విధమైన అభ్యంతరం పెట్టకుండా పార్టీ నిర్ణయం ప్రకారం స్వామిదాస్‌కు పనిచేశామని, ఇప్పుడు స్వామిదాస్ కూడా తమకు సహకరించాలని కోరారు. తాను కొవ్వూరు కోరుకున్నప్పటికీ తిరువూరుకు టికెట్ కేటాయించారని, పార్టీ నిర్ణయాన్ని శిరసా వహిస్తానని జవహర్ తెలిపారు. 30 సంవత్సరాల నుండి పార్టీకి సేవలందిస్తున్న స్వామిదాస్‌కు మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని, ఎమ్మెల్యే టికెట్ రానంత మాత్రాన స్వామిదాస్‌తో పాటు ఆయన అనుచరులు నిరుత్సాహపడాల్సిన పనిలేదని, ఆయనకు మంచి పదవినిచ్చి గౌరవిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని జవహర్ పేర్కొన్నారు. స్థానికుడైన, మంచి కుటుంబం నుండి వచ్చిన తనను తిరువూరు ప్రజలు ఆదరిస్తారని, మంచి మెజార్టీతో ఎన్నికవుతానని తెలిపారు. అంతకుముందు ఆయన స్వామిదాస్ ఇంటికి వెళ్లి జవహర్ ఆయన మద్దతు కోరారు. ఈ సందర్భంగా స్వామిదాస్ అనుచరులు తిరువూరు సీటు స్వామిదాస్కే కేటాయించాలని నినాదాలు ఇచ్చారు. జవహర్ వారిని సముదాయించారు.
tags:tiruvurnews, tiruvurutelugudesam, tiruvuru krishna district tdp, jawahar tdp, jawahar minister, swamydas tdp, swamydastiruvuru
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.