తిరువూరు మున్సిపాల్టీలో పరిపాలన అధ్వానంగా ఉంది. ప్రజలు ఎన్నుకున్న కౌన్సిలర్లు కాంట్రాక్టులపై చూపుతున్న శ్రద్ధ పారిశుద్ధ్యం మెరుగుదలపై చూపడం లేదు. మున్సిపల్ చైర్మన్ శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలకే పరిమితమయ్యారు. యువకుడైన మున్సిపల్ కమిషనర్ తన కార్యాలయంలో నాలుగు గోడలకే పరిమితమయ్యారు. వార్డుల్లో పర్యటించి సమస్యల గురించి పట్టించుకునే తీరికే కమీషనర్‌కు ఉండటం లేదు. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ప్రజల నుండి వచ్చే ఫోన్‌కాల్స్‌ను స్వీకరిస్తూ సమస్యలను పరిష్కరిస్తూ ఉంటే మున్సిపల్ అధికారులు మాత్రం ఫోన్లు ఎత్తడం లేదు. తిరువూరు పట్టణం అంతా మురుగువాసనతో కంపు కొడుతోంది. దోమలు విజృంభిస్తున్నాయి. ప్రతి ఇంటిలో విషజ్వరాలతో జనం మూలుగుతున్నారు. తెదేపా ఇన్‌ఛార్జి స్వామిదాస్ జ్వరంతో బాధపడుతున్నారు. మరో సీనియర్ నేత తాళ్లూరి రామారావు డెంగీ బారిన పడి నెలరోజులు మంచాన పడ్డారు. ఆసుపత్రులన్నీ జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి. ప్రధాన రహదారులు సైతం చెత్తాచెదారంతో దారుణంగా ఉంటున్నాయి. ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ రోడ్డులో ప్రతినిత్యం వీఐపీలు తిరుగుతూ ఉంటారు. ఈ ప్రాంతంలో రహదారికి ఇరువైపులా ఉన్న కాలువల్లో పూడిక తీసి నెలరోజులు అవుతోంది. మురుగు కంపుతో ఈ ప్రాంతం అంతా నిండిపోయింది. మురుగు కాలువలలో మోకాలు లోతున పిచ్చి మొక్కలు మొలిచి మురుగు నీటి పారుదల నిలిచిపోయినప్పటికీ, వాటిలో పందులు దొర్లుతున్నప్పటికి పట్టించుకునే నాధుడే లేడు. ఇటీవల కలెక్టర్ లక్ష్మికాంతం తిరువూరు వచ్చినప్పుడు పారిశుద్ధ్యం మెరుగుపరచమని మున్సిపల్ అధికారులకు హెచ్చరికలు చేశారు. అయినప్పటికీ పరిస్థితుల్లో మార్పు లేదు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని తిరువూరులో పారిశుద్ధ్యం మెరుగుపడే విధంగా చర్యలు చేపట్టాలని విషజ్వరాలు, దోమలు, పందుల బారి నుండి ప్రజలను కాపాడాలని కోరుతున్నారు.
tiruvuru krishna district worst sanitation, tiruvuru news, tiruvuru kaburlu, tvrnews
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.