తిరువూరులో జిల్లా కలెక్టర్ బీ.లక్ష్మీకాంతం ఆధ్వర్యంలో సోమవారం నాడు స్థానిక బాలికల పాఠశాలలో నిర్వహించిన “మీకోసం” కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుండి ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎక్కువ మంది తమకు పక్కాగృహాలు, రేషన్ కార్డులు, పాస్ పుస్తకాలు, పింఛన్లు మంజూరు చేయమని వినతిపత్రాలు అందజేశారు. తిరువూరు పట్టణంలో పారిశుద్ధ్యం, డ్రైనేజి వ్యవస్థ, మంచినీటి సరఫరా సరిగా లేదని ప్రజల నుండి పెద్ద ఎత్తున కలెక్టర్కు ఫిర్యాదులు అందాయి. దీనిపైన స్పందించిన కలెక్టర్…వారం రోజుల వ్యవధిలో తిరువూరు మున్సిపాల్టీలో పరిస్థితులు మెరుగుపడకుంటే కమీషనర్, శానిటరీ ఇన్స్పెక్టర్, మున్సిపల్ ఏఈలపై తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిరువూరు నియోజకవర్గంలో అన్ని సౌకర్యాలను మెరుగుపరుస్తామని, అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేస్తామని తెలిపారు. వినగడప వద్ద ఇటీవల కట్లేరుపై వంతెన వరదలకు కొట్టుకుపోయిన వంతెన స్థానంలో కొత్త వంతెన నిర్మిస్తామని ప్రకటించారు. అభివృద్ధి పథంలో కృష్ణాజిల్లా దేశంలోనే తన సారథ్యంలో ముందంజలో ఉందని కలెక్టర్ ప్రకటించారు. మిగిలిన ఏ జిల్లాలకు అందనంత దూరంలో కృష్ణాజిల్లా అన్ని రంగాలలో ముందడుగులో దూసుకువెళ్తుందని కలెక్టర్ తెలిపారు. తిరువూరు నియోజకవర్గానికి తాను ఇక నుండి తరచుగా వస్తానని పనిచేయని అధికారుల గురించి తనకు ఫిర్యాదులు చేయాలని కలెక్టర్ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీ విజయకృష్ణన్, ఆర్డీవో రంగయ్య, జిల్లాకు చెందిన పలువురు ఉన్నతాధికారులు, స్వామిదాస్ దంపతులు, నాలుగు మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రక్షణనిధి కార్యక్రమానికి హాజరై వెంటనే వెళ్లిపోయారు.
Krishna Collector Lakshmikantham in Tiruvuru Meekosam August 2018, Tiruvuru news, TVRNEWS, TVRNEWS.COM, Tiruvuru Kaburlu
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.