బహుశా ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశంలోనే తిరువూరు పట్టణానికి ఉన్న తీవ్రమైన సమస్య మరెక్కడా కనిపించదేమో! ఈ ప్రాంత ప్రజాప్రతినిధులకు ప్రజల సమస్యల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ది లేదు. ముందుచూపు అస్సలే లేదు. ఇది తిరువూరు ప్రజల దురదృష్టం. నిండు వర్షాకాలంలో వారం రోజులు వర్షాలు కురిసి చుట్టూ జలవనరులు నిండుగా ఉన్నప్పటికీ పట్టణ ప్రజలకు మాత్రం మంచినీటి కష్టాలు తీరడంలేదు. వాస్తవానికి తిరువూరు ప్రజలకు ప్రతిరోజూ రెండు పూటల మంచినీరు ఇవ్వవచ్చు. దానికి తగ్గట్టుగా మరే పట్టణానికి లేని విధంగా తగినన్ని జలవనరులు ఈ ప్రాంతానికి ఉన్నాయి. ఏడు చెరువులు, ఏడు వాగులు ఉన్న పట్టణం ఆంధ్ర రాష్ట్రంలోనే తిరువూరు ఒక్కటే. తలకాయ ఉన్న ప్రజాప్రతినిధులు ఒక్కడు కూడా లేకపోవడం ఈ ప్రాంత ప్రజలపాలిటి శాపం. ఎప్పటి నుండో దిగుమతై వస్తున్నా ప్రజాప్రతినిధులకు ఈ ప్రాంత సమస్యలపై అసలు అవగాహనే ఉండటంలేదు.
*** మోటార్లు కొట్టుకుపోయాయంట
ఎక్కడైనా ఏ ప్రాంతంలోనైనా ఎండాకాలంలో మంచినీటి సమస్య ఉంటుంది. తిరువూరు ప్రజలు ఏ పాపం చేసుకున్నారో గాని మంచినీటి కష్టాలు నిండు వర్షాకాలంలోనే వస్తున్నాయి. నెలరోజుల క్రితం కొద్దిపాటి వర్షాలు కురిసినప్పుడు వరదనీటిలో మోటార్లు కొట్టుకుపోయాయని రెండు వారాల పాటు మంచినీటి సరఫరా నిలిపివేశారు. మళ్ళీ ఇప్పుడు అదే తంతు జరుగుతుంది. వారం రోజుల నుండి పట్టణంలోని చాలా ప్రాంతాలకు పంపుల ద్వారా మంచినీరు అందడం లేదు. మంచినీరు ఎందుకు సరఫరా చేయలేకపోతున్నారో మున్సిపల్ అధికారులు ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు.
*** ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తారు. టాంకర్లతో మంచినీరు ఇవ్వలేరా?
మున్సిపాల్టీ పన్నులు కట్టమని ప్రతినిత్యం ప్రత్యేక వాహనంలో మైకు పెట్టి అధికారులు ప్రజల చెవులు చిల్లులుపడేలా ప్రచారం చేయిస్తారు. వారం రోజుల నుండి మంచినీరు రాకపోతే ప్రత్యేక ట్యాంకర్ ద్వారా మంచినీరు అందిస్తారన్న బాధ్యతను మున్సిపల్ అధికారులు విస్మరించారు. తిరువూరుకు నాలుగు వైపులా పంపు హౌస్లు ఏర్పాటు చేసి ఉంటే ప్రజలకు మంచినీటి కష్టాలు ఉండేవి కావు. మున్సిపాల్టీ అయిన అనంతరం గడిచిన నాలుగేళ్ళల్లో మూడుకోట్ల రూపాయలు మంచినీటి వ్యవస్థ నిర్వహణకు మున్సిపాల్టీ ఖర్చు చేసింది. దీంట్లో చాలా వరకు నిధులు దిగమింగారన్న ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో వ్యవహరించి పట్టణ ప్రజలకు మంచినీటి కష్టాలు లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో తిరువూరు పట్టణ ప్రజల ఆగ్రహాన్ని చవిచూడక తప్పదు.–కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.