నూతన రాష్ట్రం ఏర్పడిన అనంతరం ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబు నాయుడు నాలుగున్నరేళ్ళ తరువాత తొలిసారిగా శుక్రవారం నాడు తిరువూరు నియోజకవర్గంలోని తాతకుంట్ల గ్రామానికి విచ్చేశారు. అట్టహాసంగా ముఖ్యమంత్రి గ్రామదర్శిని కార్యక్రమం జరిగింది. గ్రామంలో దాదాపు ఐదున్నర గంటలు ముఖ్యమంత్రి వీధివీధిన పర్యటించారు. ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తపరిచారు. తాతకుంట్ల గ్రామంలో అభివృద్ధి బాగా ఉందని ఆ గ్రామ ప్రజలను మెచ్చుకున్నారు. రాక రాక ముఖ్యమంత్రి తమ నియోజకవర్గానికి వచ్చారని ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న తమ సమస్యలను పరిష్కరిస్తారని ఆశపడిన తిరువూరు నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం నిరాశనే మిగిల్చింది. ఏ.కొండురులో ఆటోనగర్ ఏర్పాటును పరిశీలిస్తామని, ప్రభుత్వ పాలిటెక్నిక్ ఏర్పాటును కూడా ఆలోచిస్తానని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇది తప్ప నియోజకవర్గంలో సమస్యల గురించి ప్రస్తావించకపోవడంతో ప్రజలు నిరాశ చెందారు. ముఖ్యమంత్రి తాతకుంట్ల పర్యటనకు ప్రజలు చాలా ఆశగా తరలివచ్చారు. ముఖ్యమంత్రి ఏ పథకానికి స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో పాటు ఇక్కడి సమస్యలను కూడా ప్రస్తావించకపోవడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.