2014 ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబు ఇప్పటి వరకు తిరువూరు నియోజకవర్గాన్ని సందర్శించలేదు. గత 20వ తేదీన చంద్రబాబు విస్సన్నపేట మండలం తాతకుంట్ల వస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌తో సహా అధికార యంత్రాంగం హడావుడి చేశారు. ముఖ్యమంత్రి పర్యటన 24వ తేదీకి మార్పు చేసినట్లు అధికారులు ప్రకటించారు. ముఖ్యమంత్రి రాక కోసం తిరువూరు నియోజకవర్గ ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి పర్యటన నిరవధికంగా వాయిదా పడినట్లు వార్తలు వచ్చాయి. అసలు ముఖ్యమంత్రి తిరువూరు నియోజకవర్గ పర్యటనకు వస్తారా? రారా? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. 24వ తేదీన వైకాపా రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చిన నేఫథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన రెండోసారి వాయిదాపడినట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరువూరు ప్రాంతానికి వస్తారని దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యలను పరిష్కరిస్తారని ప్రజలు ఆశాభావంతో ఉన్నారు. నియోజకవర్గ కేంద్రమైన తిరువూరును సందర్శించాలని ప్రజలు కోరుకుంటున్నారు. చంద్రబాబు రాక కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన అనంతరం పార్టీకి తిరువూరు నియోజకవర్గంలో నూతన శక్తి వస్తుందని, గతంలో మూడుసార్లు ఓడిపోయినప్పటికి ఈ పర్యాయం చంద్రబాబు తెలుగుదేశం పార్టీని తిరువూరులో గెలిపిస్తారని ఆ పార్టీవర్గాల్లో అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.