దుర్గగుడి మాజీ చైర్మన్ పిడపర్తి నారాయణరెడ్డి ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టుముడతాయి. విభేదాలు తలెత్తుతాయి. ప్రస్తుతం తిరువూరు కాంగ్రెస్లో కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులే పదుల సంఖ్యలో ఆ పార్టీని బతికించుకుంటున్నారు. ఇందిరమ్మ, రాజీవ్, నెహ్రుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించుకుంటున్నారు. వాస్తవానికి స్వార్ధం లేని రాజకీయ నాయకులు వీరేనని వారు నిరూపించుకున్నారు. తాము పుట్టింది, పెరిగింది కాంగ్రెస్లోనేనని, తమ రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీతోనే ముగియాలని వీరు భావిస్తూ ఆ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తిరువూరులో నాయకులు, కార్యకర్తలు తక్కువగా ఉన్నప్పటికీ స్థానిక జైభావి సెంటర్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం క్రమం తప్పకుండా ప్రతి రోజు తెరిచే ఉంచుతున్నారు.
** కంచి వెంట వెళ్ళని కాంగ్రెస్ నేతలు
కాంగ్రెస్ పార్టీ ద్వారా రాష్ట్రం మొత్తంలో కొద్ది మంది నాయకులు చాలా ప్రయోజనాలు పొందారు. వారిలో కంచి రామారావు ప్రధానమైన వ్యక్తి. మార్క్ఫెడ్ చైర్మన్గా కాంగ్రెస్ హయాంలో నియమితులైన కంచి రామారావు తన పదవులను, వ్యాపారాలను చక్కబెట్టుకోవడానికి “కంచె” దూకేశారు. తన వెంట అంచరులు లేరు, రానప్పటికీ కంచి రామారావు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తిరువూరులో కాంగ్రెస్ పార్టీలో కంచి రామారావు లేని లోటును భర్తీ చేయాలని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి భావించారు. తనకు రాజకీయ భిక్ష పెట్టి, ప్రధానమైన దుర్గగుడి చైర్మన్ పదవి కట్టబెట్టిన రాజశేఖరరెడ్డి కొడుకు జగన్ను పిడపర్తి దంపతులను వదిలేశారు. వైకాపాను వీడి కాంగ్రెస్లో చేరతామని రఘువీరారెడ్డిని పిడపర్తి దంపతులు ఆశ్రయించారు. రఘువీరారెడ్డి స్వయంగా తిరువూరు వచ్చి నారాయణరెడ్డి దంపతులకు కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నారాయణరెడ్డి భార్య లక్ష్మికుమారిని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించారు. స్థానిక కాంగ్రెస్ నాయకులను సంప్రదించకుండానే పిడపర్తి దంపతులకు కాంగ్రెస్ నాయకత్వం పెద్దపీట వేసింది. వాస్తవానికి నారాయణరెడ్డి గతం నుండి గుణపాఠం నేర్చుకుని ఉంటే బాగుండేది. కాంగ్రెస్లో చేరిన మరుసటి రోజు నుండే వేరు కుంపటి పెట్టారు. లక్ష్మికుమారీ స్థానిక నాయకులతో సంబంధం లేకుండా తిరువూరులో ఇంటింటి ప్రచారం చేపట్టారు. చివరకు ఆదివారం నాడు రాజీవ్ గాంధి జయంతి కార్యక్రమాన్ని కూడా విడిగానే నిర్వహించారు. దుర్గగుడి చైర్మన్ లాంటి గొప్ప పదవి లభిస్తే దానిని నిలబెట్టుకోలేని వ్యక్తి నారాయణరెడ్డి! అటువంటి వ్యక్తి తిరువూరు కాంగ్రెస్లో ఎలా ఇమడగలుగుతాడు? ప్రశాంతంగా ఉన్న తిరువూరు కాంగ్రెస్లో నారాయణరెడ్డి దంపతుల రాక కల్లోల్లమే రేపుతోంది. సోమవారం నాడు విజయవాడలో జరిగిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఉమెన్ చాందితో భేటీకి తిరువూరు నుండి ఇరువర్గాల నాయకులు విడివిడిగానే హాజరయ్యారు. ప్రతినిత్యం తెలుగుదేశం ప్రభుత్వంపై నిప్పులు చెరిగే ఈ పీసీసీ అద్యక్షుడు రఘువీరారెడ్డి తిరువూరు కాంగ్రెస్లో రేగిన కల్లోల్లాన్ని ఎలా పరిష్కరిస్తాడో వేచి చూద్దాం. —కిలారు ముద్దుకృష్ణ సీనియర్ జర్నలిస్ట్.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.