“అంగట్లో అన్నీ ఉన్నా…..అల్లుడి నోట్లో శని” సామెతగా తిరువూరు నియోజకవర్గంలో అన్ని వనరులు ఉన్నప్పటికీ ప్రజలకు అవి ఏవీ అందుబాటులోకి రావడం లేదు. సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడంతో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనితీరు స్తంభించింది. కొన్ని ప్రభుత్వ శాఖల్లో పనితీరు మరీ అధ్వాన్నంగా మారింది. కొన్ని శాఖల్లో అధికారులు, ఉద్యోగస్థులే లేకపోవడంతో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయి.
* తిరువూరు ఆర్ అండ్ బీ కార్యాలయం ఒకప్పుడు రాష్ట్రంలో ఆదర్శంగా ఉండేది. అక్కడ డీఈ పోస్టు ఖాళీ అయ్యి ఏడాదిన్నర గడుస్తునప్పటికి పట్టించుకునే ప్రతినిధే కరువయ్యాడు. ముగ్గురు ఏఈలతో పాటు, మరో పదిమంది ఉద్యోగులు లేకపోవడంతో ఈ కార్యాలయంలో పనులు స్తంభించాయి. కార్యాలయం దాదాపుగా మూతపడింది.
* రెండు జిల్లాల సరిహద్దుల్లో ఉన్న తిరువూరు ఆర్టీసీ బస్సు డిపో ఒకప్పుడు ఆదాయంలో ఉభయరాష్ట్రాల్లో ముందు ఉండేది. గత మూడు సంవత్సరాల నుండి ఈ డిపోలో పరిస్థితులు దారుణంగా మారాయి. హైదరాబాద్‌కు పగటి సమయాల్లో తిరుగుతున్న ఐదు బస్సులను రద్దు చేసినప్పటికీ పట్టించుకునే వాడే లేడు. తిరువూరు నుండి వివిధ ప్రాంతాలకు ఎక్స్ ప్రెస్ సర్వీసులను పెంచమని, హైదరాబాద్‌కు ఒక ఏసీ బస్సు ఏర్పాటు చేయమని, విజయవాడకు నాన్‌స్టాప్ బస్సులను నడపమని ప్రయాణీకులు మొత్తుకుంటున్నప్పటికి అవన్నీ బధిర శంఖారావాలే అయ్యాయి.
* తిరువూరు పట్టణానికి రాష్ట్రంలోనే ఏ పట్టణానికి లేని విధంగా మంచినీటి వనరులు ఉన్నాయి. తిరువూరు చుట్టూ ఏడు వాగులు, ఏడు చెరువులు ఉన్నాయి. తిరువూరు పట్టణం చుట్టూ ఉన్న సాగర్ మేజర్ కాల్వ జోన్-2 పరిధిలో ఉంది. జోన్-2లో ఏడాదిలో తొమ్మిది నెలల పాటు సాగర్ జలాలు వదులుతున్నారు. అయినప్పటికీ తిరువూరు ప్రజలకు మంచినీటి దరిద్రం వదలడం లేదు. రెండు రోజులకు ఓసారి మొక్కుబడిగా మంచినీరు వదులుతున్నారు. చుట్టూ నీళ్ళు సమృద్ధిగా ఉన్నప్పటికీ…ఎన్నికైన ప్రజాప్రతినిధులకు, అనధికారికంగా పెత్తనం చెలాయిస్తున్న అధికార పార్టీ నాయకులకు చిత్తశుద్ది లేకపోవడంతో తిరువూరు ప్రజలకు వర్షాకాలంలో కూడా మంచినీటి కష్టాలు తప్పడం లేదు.
* తిరువూరు ప్రాంతంలో చెరువులను, పంట కాలువలను మరమ్మత్తులు చేసే విధంగా యాభై ఏళ్ల క్రితమే ఏర్పాటైన ఇరిగేషన్ కార్యాలయం ఎప్పుడూ మూతబడే ఉంటుంది.
* స్థానిక అధికార పార్టీ నాయకుల అసమర్థతకు మరో మచ్చుతునక – తిరువూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం. రెండు సంవత్సరాల నుండి ఈ కమిటీకి పూర్తి స్థాయి కార్యదర్శి లేడు. పాలకవర్గం పదవీకాలం ముగిసి సంవత్సరం దాటుతున్నప్పటికి కనీసం నూతన పాలకవర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకోలేకపోయారు.
* తిరువూరు మున్సిపాల్టీలో నెలకొన్న అవినీతి రాష్ట్ర స్థాయిలోనే సంచలనం సృష్టించింది. ఇప్పటికే మున్సిపాల్టీ ఏర్పడిన నాలుగేళ్ళలో నలుగురు కమీషనర్లు మారారు. శానిటరీ ఇన్స్పెక్టర్, మున్సిపల్ ఏఈలు, కమీషనర్లను లెక్క చేయకుండా అధికార పార్టీ నేతల అండదండలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే కొత్తగా వచ్చిన యువ కమీషనర్ చురుగ్గా వ్యవహరించి గాడి తప్పిన పరిపాలనను సరిచేయవలసి ఉన్నది.
* తిరువూరులో ఉన్న పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ కార్యాలయాలు కళ తప్పాయి. తగిన పర్యవేక్షణ లేకపోవడంతో ఇవీ మూతపడే ఉంటున్నాయి.
* ఎన్నో ఏళ్ల పోరాటం తరువాత కోట్ల రూపాయల ఖర్చుతో తిరువూరులో స్టేడియం నిర్మించారు. ఒక్క షటిల్ కోర్టు తప్ప ఈ స్టేడియం దేనికీ పనికిరావడం లేదు. సరైన సిబ్బంది లేరు. సరైన లైట్లు కూడా ఏర్పాటు చేయలేదు. స్టేడియంలో సౌకర్యాల గురించి ఎవరికి వారే యమునకు తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
* విద్యుత్ శాఖ పనితీరు అధ్వానంగా ఉంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గత నెలరోజుల నుండి రోజుకు ఎనిమిది గంటలపాటు విద్యుత్ కోతలు విధిస్తున్నప్పటికి ఒక్క నాయకుడికి కూడా ఈ విషయం పట్ల స్పందించాలనే ఆలోచన రాకపోవడం తిరువూరు ప్రజల దురదృష్టం.
ఇప్పటికైనా నాయకులు స్పందించి తిరువూరులో ప్రభుత్వ శాఖల పనితీరును మెరుగుపరచాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. —కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.