“తిరువూరులో చినుకుపడినా…ఆకు కదిలినా…కనుమరుగవుతున్న కరెంట్(http://tvrnews.com/?p=892)” పేరుతో TVRNEWS.COMలో వచ్చిన కథనానికి స్థానిక శాసనసభ్యుడు కొక్కిలిగడ్డ రక్షణనిధి స్పందించారు. స్థానిక ఆర్ అండ్ బీ అతిథిగృహంలో రక్షణనిధి తిరువూరు కరెంట్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా తిరువూరు పట్టణ, మండలాల్లో మాత్రమే ఎందుకు సరఫరా నిలిపివేస్తున్నారని ప్రశ్నించారు. జన్మభూమి కార్యక్రమంలో ఇదే విషయమై తాను ప్రశ్నిస్తే కొందరు ఎలాంటి కోతలు లేవని సమాధానం చెప్పారని, 24 గంటలు నిరంతరాయంగా సరఫరా చేస్తున్నామంటూ ప్రగల్భాలు పలికి…వాస్తవంలో మాత్రం గంటల తరబడి ఎందుకు కోత విధిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం సమాచారం కోసం కార్యాలయాలు, అధికారులకు ఫోన్ చేస్తే సమాధానం చెప్పేందుకు కూడా తీరికలేనంత పని బరువులు ఏం మోస్తున్నారని ఆయన ప్రశ్నించారు. విద్యుత్తు కోతలు ఎక్కువగా ఉంటే మీకేమైనా అవార్డులు ఇస్తున్నారా? అని నిలదీశారు. చెప్పా పెట్టకుండా సరఫరా నిలిపివేయటం వలన వర్షాకాలం నేపథ్యంలో దోమల బారిన పడుతూ ప్రజలు అవస్థలు పడుతున్నారని, కనీసం ఇక నుంచైనా ప్రజలకు సమాచారం తెలియజేయాలని సూచించారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.