ఏపీ రాష్ట్ర నూతన డీజీపీగా నియమితులైన ఆర్.పీ.ఠాకూర్‌కు మంచి పరిపాలనాదక్షుడుగా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఆయన కృష్ణాజిల్లా ఎస్పీగా పని చేసిన కాలంలో జిల్లాపై తనదైన ముద్రవేశారు. జిల్లా అంతటా సుడిగాలి పర్యటనలు చేసేవారు. ప్రజలుకు ఏ కష్టం వచ్చినా ఆయన స్వయంగా ప్రత్యక్షం అయ్యేవారు. ఠాకూర్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వహించిన సమయంలో తిరువూరులో రౌడీలు రాజ్యమేలుతూ ఉండేవారు. వ్యాపారస్థులను బెదిరించడం, దౌర్జన్యంగా డబ్బులు వసూళ్లు చేయడం వంటి చర్యలకు వారు పాల్పడుతుండేవారు. ఆ సమయంలో తిరువూరు ఆర్టీసీ బస్టాండ్ సంఘ విద్రోహ శక్తులకు నిలయంగా ఉండేది. రెండు మూడు హత్యలు కూడా ఆ సమయంలో జరిగాయి. ఇదే సమయంలో స్థానిక వ్యాపారస్థులు జిల్లా ఎస్పీ ఠాకూర్‌ను ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఠాకూర్ తిరువూరు పోలీస్‌స్టేషన్‌కు తరచుగా వచ్చి స్థానిక రౌడీలకు హెచ్చరికలు చేశారు. అయినప్పటికీ అప్పటి కేబుల్ ఆపరేటర్ దారా లక్ష్మీకాంతారావును స్థానిక బస్టాండ్ సెంటరులో రౌడీలు అందరూ చూస్తుండగానే కత్తులతో పొడిచి చంపారు. దీంతో ఆర్.పీ.ఠాకూర్ పోలీస్ తడాఖాను రౌడీలకు రుచి చూపించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు తిరువూరులో రౌడీ అనేవాడు ఎవడూ కాలర్ ఎత్తుకు తిరగలేదు. తిరువూరు రౌడీలకు ఆర్.పీ ఠాకూర్ సింహంలా కనిపించారు. అనంతరం వ్యాపారస్థులతో పాటు ప్రజలు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఆర్.పీ.ఠాకూర్ చేపట్టిన చర్యలను తిరువూరు ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేదు. కొత్త డీజీపీగా ఎన్నికైన ఆర్.పీ.ఠాకూర్‌కు తిరువూరు ప్రజలు హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నారు. తిరువూరు ప్రాంతంలో ఇటీవలి కాలంలో పేట్రేగిపోతున్న కోడిపందేలు, పేకాట స్థావరాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, శాంతి భద్రతలను పరిరక్షించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. —కిలారు ముద్దుకృష్ణ, సినీయర్ జర్నలిస్ట్.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.