“పిల్లి చేతకానిదైతే ఎలుక ఎక్కిరించింది” అన్న సామెత తిరువూరులో విధిస్తున్న విద్యుత్ కోతలకు అక్షరాల సరిపోతుంది. ఇక్కడి ప్రజా ప్రతినిధుల అసమర్ధతను, చేతగానితనాన్ని ఆసరాగా తీసుకుని తిరువూరులో విద్యుత్ అధికారులు చెలరేగిపోతున్నారు. తమ బాధ్యతలను పూర్తిగా విస్మరించి రోజుకు ఎనిమిది గంటలపాటు విచక్షణారహితంగా కరెంట్ కోతను విధిస్తూ ప్రజల సహనానికి పరీక్ష పెడుతున్నారు. ప్రజలకు విద్యుత్‌ను నిరంతరాయంగా అందించడం కోసం నియమితులైన ఆ శాఖ అధికారులు, సిబ్బంది తిరువూరులో మాత్రం నిరంతరాయంగా విద్యుత్‌ను నిలిపివేయడంపైనే దృష్టి పెడుతున్నారు.
*** చినుకు పడినా..ఆకు కదిలినా…
గతంలో వేసవికాలంలో డిమాండ్ అధికంగా ఉండడంతో కరెంట్ కోతను విధించేవారు. ప్రస్తుతం వర్షాకాలంలో కరెంట్ కోతల విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆకాశంలో మబ్బులు పట్టినా, చినుకు రాలినా, కొద్దిపాటి గాలి వచ్చినా కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నారు. కరెంట్ కోత గురించి సరైన సమాచారం ఇచ్చే నాధుడే కరువయ్యాడు. అధికారులు ఫోన్లు ఎత్తడం లేదు. కనీసం వాట్సాప్ గ్రూపుల్లో అయినా కరెంట్ కోతలకు సంబంధించి వివరాలు తెలపడం లేదు. కరెంట్ ఆఫీసులో ఫోన్ ఎత్తడం లేదు. వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తూ 24గంటలు వారికి అందుబాటులో ఉండవలసిన తిరువూరు విద్యుత్ అధికారులు, సిబ్బంది పూర్తిగా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు.
*** మీకు పదవులు ఎందుకు?
తమ సమస్యలను పరిష్కరిస్తారని ఎంతో ఆశతో ప్రజలు ఎన్నుకున్న స్థానిక ప్రజాప్రతినిధులు తమ బాధ్యతలను పూర్తిగా విస్మరిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. ప్రజల కనీస అవసరాలను గురించి పట్టించుకునే తీరుబాటు కూడా ఎమ్మెల్యేకు ఉన్నట్లు కనిపించడం లేదు. అప్పుడప్పుడు రావడం విలేకర్లతో నాలుగు మాటలు మాట్లాడటం వరకే ఎమ్మెల్యే పరిమితమయ్యారు. ఇక అధికార పార్టీ నాయకులు అందినంతవరకు దోచుకోవడం మళ్ళీ అధికారంలోకి రాలేమోనన్న ఆలోచనతో దోచుకున్న దాన్ని దాచుకోవడంలోనే నిమగ్నమయ్యారు. కనీసం విద్యుత్ అధికారులను ఒక్క అధికార పార్టీ నాయకుడైనా ఇంతవరకు కరెంట్ కోతను గురించి ప్రశ్నించలేదు. ఇంత చేతగాని నాయకత్వం ఒక్క తిరువూరులోనే కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు, తమకు లేని అధికారాన్ని చెలాయిస్తూ డబ్బులు కూడబెడుతున్న అధికార పార్టీ నాయకులు తమ బాధ్యతలను తెలుసుకోవడం మంచిది. లేని పక్షంలో ప్రజల ఆగ్రహానికి గురి కాక తప్పదు. విద్యుత్ అధికారులు కూడా తమను అడిగేవాడు లేడన్న అభిప్రాయం నుండి బయటకు వచ్చి విద్యుత్ కోతల నుండి తిరువూరు ప్రజలను కాపాడవలసిన అవసరం ఉంది.—కిలారు ముద్దుకృష్ణ సీనియర్ జర్నలిస్ట్.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.