తిరువూరు నగర పంచాయతీకి ఎన్నికైన పాలకవర్గ సభ్యులను చూసి పట్టణ ప్రజలు “ఛీ” కొడుతున్నారు. ఎన్నికై నాలుగేళ్ళు అవుతున్నప్పటికీ ఒక్క కౌన్సిల్ సమావేశం కూడా సజావుగా సాగలేదు. తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో మెజారిటి ఉన్నప్పటికీ వర్గాల గొడవ ఎక్కువై తన్నుకుఛస్తున్నారు. ప్రస్తుత చైర్పర్సన్ మరకాల కృష్ణకుమారిని ఏదో విధంగా పదవి నుండి దించాలని స్వామిదాసు వర్గం, ఆమెనే కొనసాగించాలని తాళ్ళూరి రామారావు పావులు కదుపుతూనే ఉన్నారు. తెదేపా కౌన్సిలర్లలో ఏర్పడిన వర్గ విభేదాలు వైకాపా కౌన్సిలర్లు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. దీంతో అధికారం తెదేపా చేతిలో ఉన్నా మున్సిపాల్టీలో పెత్తనమంతా వైకాపా చేతిలోకి వెళ్ళిపోయింది. మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రామవరపు లక్ష్మణరావు పెత్తనమే కొనసాగుతోంది. మున్సిపాల్టీలో తెలుగుదేశం కౌన్సిలర్లు కూడా తమ పనుల కోసం లక్ష్మణరావు చుట్టూనే తిరిగేంత స్థాయికి తిరువూరు మున్సిపాల్టీలో పరిస్థితులు దిగజారాయి. మున్సిపల్ ఏఈ, శానిటరీ ఇన్స్పెక్టర్, వైకాపా ప్లోర్ లీడర్ చెప్పుచేతల్లోనే పనిచేస్తున్నారు. మున్సిపాల్టీలో జరిగిన కుంభకోణాల చిట్టా లక్ష్మణరావు చేతుల్లో ఉంది. తిరువూరు పట్టణంలో వైకాపా కౌన్సిలర్లు చాలామంది తమ వాళ్లకు పింఛన్లు ఇప్పించుకున్నారు. తిరువూరు మున్సిపాల్టీలో గత నాలుగేళ్లలో జరిగిన అవినీతి కోట్లల్లోనే ఉంటుందని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నప్పటికి దీనిపై విచారణ చేసే నాథుడే కరువయ్యాడు. మున్సిపాల్టీలో ప్రజల సమస్యల గురించి పట్టించుకునే ప్రతినిధే కానరావట్లేదు. ఇటీవల పింఛన్ల కుంభకోణంలో నలుగురు ఉద్యోగులు సస్పెన్షన్కు గురయినప్పటికీ మున్సిపాల్టి పరిపాలనలో ఏమాత్రం మార్పు రాలేదు. కౌన్సిలర్లు అంతా ప్రజల సమస్యలను పట్టించుకోకుండా తమ సొంత పనులను, కాంట్రాక్టులను చేసుకోవడంలోనే నిమగ్నమయ్యారు.
*** మంచినీళ్ళు ఏవీ?
ఏప్రిల్ నెల ప్రవేశించినప్పటికీ పట్టణంలో ఏర్పడిన మంచినీటి ఎద్దడిని నివారించడంలో మున్సిపాల్టీకి ముందుచూపు లేకుండా పోయింది. తిరువూరు చుట్టూ ఏడు చెరువులు, ఏడు వాగులు ఉన్నప్పటికీ వర్షాకాలంలోనే రెండురోజులకు ఒక్కసారి మంచినీళ్ళను అందించే దౌర్భాగ్య పరిస్టితులు ఈ మున్సిపాల్టిలో నెలకొన్నాయి. ఈ మండు వేసవిలో పట్టణ ప్రజలకు మంచినీటి కష్టాలు తీవ్రంగా ఉండబోతున్నాయి.
** చెత్త సేకరణ కోసం కొనుగోలు చేసిన వాహనాన్ని ఆ పని కోసం ఉపయోగించకుండా ప్రతినిత్యం “పన్నులు కట్టండి” అంటూ మైకులు కట్టి ప్రజల చెవులు హోరెత్తిస్తున్నారు. పన్నుల వసూళ్ళపై చూపుతున్న శ్రద్ధ మంచినీటి ట్యాంకరులు ఏర్పాటు చేయడంలో చూపలేకపోతున్నారు. రాష్ట్రంలో నగర పంచాయతీల మధ్య పోటీ పెడితే…అవినీతి, అవకతవకలు, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి, కుంభకోణాలు, అధికారుల మధ్య తన్నులాట తదితర విషయాల్లో తిరువూరు నగర పంచాయతీ తప్పక ప్రథమ స్థానంలో నిలుస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. చివరకు శ్మశానాల అభివృద్ధిలోనూ, చెత్తను ఎత్తిపోసే డంపింగ్ యార్డుల ఏర్పాటులోనూ ఈ మున్సిపాల్టిలో బుర్ర బద్ధలయ్యే కుంభకోణాలు జరుగుతున్నాయి అంటే ప్రజలు సిగ్గుపడవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికైనా మున్సిపల్ శాఖా మంత్రి, ఇతర ఉన్నతాధికారులు తిరువూరు మున్సిపాల్టీలో పరిస్థితులు చక్క బెట్టాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తెలుగుదేశం రాష్ట్ర నాయకత్వం కూడా ఈ విషయంలో శ్రద్ధ చూపి నగర పంచాయతీలో తమ పార్టీ కౌన్సిలర్ల మధ్య ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటే వచ్చే ఎన్నికల్లో తిరువూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీకి పుట్టగతులు ఉండవని ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. —కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్.
tiruvuru municipality tvrnews.com tvrnews tiruvuru news krishna district telugudesam frauds tdp vs ysrcp krishna district tiruvuru political picture tiruvuru water problem tvrnews tiruvuru kaburlu
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.