రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికల రాజకీయం తారాస్థాయికి చేరింది. నామినేషన్ల ఘట్టం కూడా తుదిదశకు చేరింది. మరొక 24గంటల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్ధుల పేర్లను చంద్రబాబు ఖరారు చేయవలసి ఉంది. ఆంధ్రా రాష్ట్రం నుండి ముగ్గురు అభ్యర్ధులు రాజ్యసభకు ఈ పర్యాయం వెళుతున్నారు. ప్రస్తుత బలాబలాలను బట్టి తెలుగుదేశం తరపున ఇరువురు అభ్యర్ధులు, వైకాపా తరపున ఒక అభ్యర్ధి ఎన్నికయ్యే అవకాశం ఉంది. వైకాపా తన అభ్యర్ధిగా వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిని ప్రకటించింది. తొలుత ముగ్గురు అభ్యర్ధులను రంగంలోకి దించాలని భావించిన చంద్రబాబు నాయుడు మారిన రాజకీయ పరిస్థితులలో ఇరువురు అభ్యర్ధులనే రంగంలోకి దించే అవకాశం ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ షెడ్యుల్ కులాల నుండి ఒకరికి తెలుగుదేశం అభ్యర్దిత్వం ఖరారు అవుతుందని వార్తలు వస్తున్నాయి. ఈనేపద్యంలో తిరువూరు మాజీ శాసన సభ్యుడు నల్లగట్ల స్వామిదాస్ ఆయన భార్య కృష్ణాజిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ నల్లగట్ల సుధారాణిలు చంద్రబాబుని కలిశారు. తమ ఇద్దరిలో ఒకరికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని చంద్రబాబుకు వినతి పత్రం అందజేశారు. గత వారం రోజుల నుండి స్వామిదాస్, సుధారాణిలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేసారు. పోలిట్ బ్యూరో సభ్యులందరినీ కలిసి తమ అభ్యర్ధనను వారి ముందు ఉంచారు. సుధారాణి బాల్యం నుండి డిల్లి, హైదరాబాద్ లలో ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్నారు. హిందీ, ఇంగ్లిష్ బాషలలో ప్రావీణ్యత ఉంది. స్వామిదాస్ కూడా ఈ రెండు భాషల్లో మాట్లాడగలరు. తెలుగుదేశం పార్టీలో సినియర్ నేతలుగా ఉంటూ ఆ పార్టీకి, చంద్రబాబుకు వినయ, విధేయతతో ఉన్న తమ అభ్యర్దిత్వాన్ని రాజ్యసభ సభ్యత్వం కోసం పరిశీలించాలని వారు కోరుతున్నారు. ఒక పక్క రాజకీయంగా ప్రయత్నాలు సాగిస్తూనే మరొకపక్క ఆద్యాత్మికంగా ప్రత్యేక ప్రార్ధనలో పాల్గొంటున్నారు. వారి ప్రార్దనలు ఫలిస్తాయో? లేదో? మరి కొద్ది గంటలు వేచి చూద్దాం. –కిలారు ముద్దుకృష్ణ.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.