మొత్తం మీద మార్క్ ఫెడ్ అద్యక్షుడు కంచి రామారావు తన రాజకీయ చివరిదశలో కంప దూకేశారు.గతంలో మేము చెప్పినట్లుగానే ఆయన తెలుగుదేశంలోకి దూకేశారు. కంచి రామారావుతో పాటు స్థానికంగా ఉన్న ఆయన అనుచరులందరూ ఇప్పటి వరకు తెలుగుదేశంలోకి ప్రవేశించలేదు. కంచి రామారావు రాకతో తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఏవిధంగా బలపడుతుంది? అనే విషయం గురించి వేచి చూడవలసి ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం పట్ల కాపుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈదశలో అదే సామాజిక వర్గానికి చెందిన కంచి రామారావు తెలుగుదేశంలో చేరారు. పార్టీ ఆదిస్థానం కూడా కంచి రామరావును సాధనంగా ఆహ్వానించింది. కంచి ప్రవేశం మూలంగా ఇటు స్థానికంగానూ, అటు రాష్ట్రంలోనూ తెలుగుదేశం పార్టీకి ఎంత వరకు మేలు జరుగుతుందనే విషయం గురించి వేచి చూడవలసిందే.
**మరొక పక్క కంచి రామారావు తెలుగుదేశంలోకి వెళ్ళడం పట్ల తిరువూరు నియోజకవర్గంలో ఉన్న ఆయన అనుచరుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇన్నాళ్ళు కాంగ్రెస్ వారిగా ఉండి ఆ పార్టీ మద్దతుతో ఆర్ధికంగానూ, రాజకీయంగానూ బలపడిన కంచి రామారావు తన వృద్దాప్యంలో పార్టీ ఫిరాయించి ఏమి సాధిస్తారని? ఆయన అనుచరులు బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. మరొకపక్క తెలుగుదేశంలో కంచి రామరావు ప్రవేశం పై ఒక్క స్వామిదాస్ దంపతులు తప్ప మిగిలిన నాయకులు, కార్యకర్తలు అంత సంతోషంగా లేరు. వచ్చే ఎన్నికల్లో కంచి రామారావుతో పాటు ఆయన అనుచరులు కూడా పార్టీలోకి వస్తేనే కొంతవరకు మేలు జరుగుతుందని స్థానిక తెలుగుదేశం వర్గాలు భావిస్తున్నాయి. కంచి తెలుగుదేశంలో ప్రవేశానికి సంబంధించి గతంలో మేము ఇచ్చిన కధనాన్ని ఈ దిగువ తిరిగి ఇస్తున్నాము.
+++++++++++++++++++++++
“కంచి”…కంప దూకేస్తారా?
కాకలు తీరిన రాజకీయ యోధుడు, కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుడు, కృష్ణాజిల్లా తిరువూరుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు కంచి రామారావు(76) ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారంటూ గత కొద్ది రోజుల నుండి వార్తలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో పలు ఉన్నత పదవులను కంచి రామారావు అలకరించారు. ఉడా చైర్మన్గా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, డి.సి.ఎం.ఎస్ అధ్యక్షుడిగా ఆయన పదవులు నిర్వహించారు. నాలుగేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో అత్యున్నతమైన రాష్ట్ర మార్క్ఫెడ్ అధ్యక్ష పదవిని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కంచి రామారావుకు అప్పగించింది. తిరువూరులో తొలినాళ్ల నుండి కాంగ్రెస్ పార్టీకి కంచి రామారావు పెద్ద దిక్కుగానే ఉన్నారు. తిరువూరు ఎమ్మెల్యేలుగా పేట బాపయ్య, కోనేరు రంగారావులు ఉన్నప్పటికి తెర వెనుక ఉండి కంచి రామారావే చక్రం తిప్పేవారు. కాంగ్రెస్ పార్టీకి కంచి ఎంత సేవలు అందించారో అంతకు ఎక్కువగానే ఆ పార్టీ ఆయనను గౌరవించింది. ఉన్నత పదవులతో పాటు ప్రముఖ వ్యాపారవేత్తగానూ కంచి రామారావు రాణించారు-రాణిస్తున్నారు!
*** నిత్య అసమ్మతివాది
కంచి రామారావు ఎన్ని పదవులు అలంకరించినా ఆయన నిరంతరం ఇంకా అసంతృప్తితోనే ఉండేవారు. తన రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిన అప్పటి మంత్రి కోనేరు రంగారావుపైనా ఆయన తిరుగుబాటు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే కంచి రామారావు అందరు నేతలతోను సన్నిహిత సంబంధాలనే కొనసాగించారు. అసంతృప్తి, అసమ్మతిని కొంత కాలం వరకే కొనసాగించేవారు. తాను అనుకున్నది సాధించగానే అందరితో కలిసిపోయే వ్యక్తి కంచి రామారావు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తిరువూరు నియోజకవర్గం నుండి తమ అభీష్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అధిష్ఠానం రాజీవ్రతన్కు టికెట్ ఇవ్వడంతో కంచి రామారావు కాంగ్రెస్ నాయకత్వంపై తిరుగుబాటు చేశారు. ఒకరకంగా యుద్ధాన్నే ప్రకటించారు. గత రెండున్నరేళ్ల నుండి కాంగ్రెస్ సమావేశాలకు, ఆ పార్టీ నేతలకు దూరంగానే ఉంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతోనూ, ఇతర తెలుగుదేశం నేతలతోనూ సయోధ్యను సాగిస్తున్నారు.
*** కంప దూకడం అవసరమా?
ప్రస్తుతం కంచి రామారావు పదవీకాలం మరి కొద్ది నెలల్లో ముగియబోతోంది. ఈ పరిస్థితుల్లో తన భవిష్యత్ ఏమిటనేది కంచి రామారావు ఆలోచనల్లో పడినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ కంచి రామారావును రా…రమ్మని ఆహ్వానం పలుకుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కాపు సామాజిక వర్గం చంద్రబాబుకు క్రమేపీ దూరం అవుతున్న నేపథ్యంలో కంచి రామారావు లాంటి సీనియర్ కాపు నేతల అవసరం తెలుగుదేశం పార్టికి చాలా ఉంది. మరోపక్క కంచి రామారావుకు తెలుగుదేశం పార్టీ అవసరం కూడా చాలా ఉంది.
*** మేము రాము పో….!
కంచి రామారావు పరిస్థితి ప్రస్తుతం ఎటు తేల్చుకోలేని స్థితిలో ఉంది. గత నాలుగు రోజుల నుండి తన సన్నిహితులు, అభిమానులతో ఆయన ముమ్మరంగా చర్చలు జరుపుతున్నారు. పుట్టినప్పటి నుండి తనను పెంచి పోషించిన కాంగ్రెస్ పార్టీలో కొనసాగటమా? లేక తన మిగిలిన భవిష్యత్ కోసం తెలుగుదేశంలో చేరటమా? అనే విషయంపై మద్దతుదారులతో చర్చలు జరుపుతున్నారు. కంచి రామారావుకు స్థానికంగా కుడి, ఎడమ భుజాలుగా ఉన్న ముఖ్య అనుచరులు ఉప్పలపాటి లక్ష్మీదాస్, కోటగిరి వెంకట్రావులు తెలుగుదేశంలోకి కంచి ప్రవేశించడం పట్ల అభ్యంతరం వ్యక్తపరుస్తున్నారు. కంచి వెళ్లినా తాము మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉంటామని అంటున్నారు. స్థానికంగా ఉన్న కాపు నేతల నుండి కూడా కంచి పార్టీ మారటం పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో కంచి రామారావు నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూద్దాం.—కిలారు ముద్దుకృష్ణ
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.