తిరువూరు మేజర్ పంచాయతి ఏ ముహూర్తంలో మున్సిపాల్టీగా ఆవిర్భవించిందో గాని ప్రజలకు మాత్రం అభివృద్ధి ఫలితాలు ఏమాత్రం అందడంలేదు. తిరువూరు మున్సిపాల్టీలో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. అధికార పార్టీ కౌన్సిలర్ల మధ్య ఏర్పడిన విభేదాలు మున్సిపాలిటి పాలన పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. మొదటి నుండి పరిపాలన మొత్తం కుంభకోణాల మయంగా మారింది. అవకతవకలు, అవినీతి రాజ్యమేలుతోంది. మున్సిపల్ చైర్మన్ ను ఎవరూ పట్టించుకోవడంలేదు. కమీషనర్, అసిస్టెంట్ ఇంజనీర్, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల మున్సిపాల్టీలో జరిగిన కుంభకోణానికి సంబంధించి నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసినప్పటికీ మున్సిపల్ పరిపాలనలో ఏమాత్రం మార్పు రాలేదు. నానాటికి పరిపాలన దిగజారుతోంది. కమీషనర్ మెతక వైఖరి మూలంగా ఉద్యోగులలో క్రమశిక్షణ లోపించింది. పరిపాలనపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
**అధ్వానంగా పారిశుద్యం.
మున్సిపాల్టి అయిన అనంతరం పారిశుద్యం మెరుగుపడకపోగా నానాటికి అధ్వానంగా మారుతోంది. మురుగు కాల్వల నుండి దుర్గంధం వెలువడుతోంది. డ్రైనేజీలు తరచుగా పూడిక తీయటంలేదు. ప్రధాన రహదారులు సైతం ప్రతినిత్యం శుభ్రపరచడం లేదు. మున్సిపాల్టి చేపట్టిన మొక్కల పెంపకం ఓ ఫార్సులాగా మారింది. వీటికి ప్రతి రోజు నీరు పోసే నాధుడే కరువయ్యాడు. చాలా మొక్కలు చనిపోయాయి. మొక్కల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన గార్డులు నిరుపయోగంగా ఉన్నాయి. వీలాది రూపాయలు వీటికోసం తగులపెట్టారు. మున్సిపల్ కార్యాలయం నుండి బైపాస్ రోడ్డు వరకు వెళ్ళే రహదారి లాంటి ప్రధాన రహదారులు సైతం ప్రతినిత్యం శుభ్రపరచడం లేదు.
**నత్తనడకన అభివృద్ధి పనులు
మున్సిపాల్టీలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు అవకతవకల మయంగా, లోప భూఇష్టంగా ఉన్నాయి. నూతనంగా నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డు పనులు నత్తనడకన సాగుతున్నాయి. గతంలో వేసిన సిమెంట్ రోడ్లు శిదిలమవుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గత నాలుగేళ్ళ నుండి మున్సిపాల్టీ కోసం నిర్మిస్తున్న నూతన భవన నిర్మాణం ఇంజనీరింగ్ శాఖ అసమర్ధతకు నిదర్శనంగా మారింది. గతేడాది జరిగిన డ్రైనేజి పనులలోనూ, పైపు లైన్ మార్పిడి పనులలోను పెద్ద ఎత్తున కుంభకోణం జరిగినట్లు కౌన్సిలర్లే ఆరోపిస్తున్నారు. మున్సిపాల్టిలో చెత్తను తరలించడానికి పది లక్షల రూపాయల వ్యవయంతో కొనుగోలు చేసిన రెండు ఆటోలు, రెండు సంవత్సరాలనుండి అధికారుల మధ్య విభేదాల మూలంగా నిరుపయోగంగా పడి ఉంటున్నాయి. నూతనంగా కొనుగోలు చేసిన ట్రాక్టర్లను సర్వీసింగ్ చేయడానికి కూడా ప్రయత్నించడం లేదు. మున్సిపాల్టి భవనానికి ఆనుకుని ఉన్న పొట్టి శ్రీరాములు పార్క్ నిరుపయోగంగా పడి ఉన్నప్పటికీ పట్టించుకునే నాధుడే కరువయ్యాడు.
**ఎమ్మెల్యే పట్టించుకోరు..స్వామిదాస్ కదలరు..
తిరువూరు మున్సిపాల్టిని బాగు చేయగలిగే సమర్ధత ప్రస్తుతం ఇరువురికే ఉంది. ఎమ్మెల్యే రక్షణ నిధి దృష్టి పెడితే కొంత మెరుగవుతుంది. కానీ ప్రతిపక్షంలో ఉన్న రక్షణ నిధి తన మాట చెల్లుబాటు కాదని తప్పించుకోవడం సమంజసం కాదు. మున్సిపాల్టీలో ఉన్న వైకాపా కౌన్సిలర్లతో కలిసి రక్షణ నిధి మున్సిపాల్టి అవకతవకలను సరిచేసే ప్రయత్నం చేయవచ్చు. తిరువూరు నియోజకవర్గ తెదేపా ఇన్ చార్జిగా ఉన్న నల్లగట్ల స్వామిదాస్ దంపతులు తగిన శ్రద్ధ పెడితే పరిపాలన గాడిలో పడుతుంది. మున్సిపాల్టీలో జరుగుతున్న కుంభకోణాల వెనుక, అవకతవకల వెనుక స్వామిదాస్ దంపతుల పాత్ర ఉందని ప్రతిపక్ష కౌన్సిలర్లు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. ప్రజలు కూడా దీనినే నమ్ముతున్నారు. స్వామిదాస్ దంపతులు ఇప్పటికైనా శ్రద్ద తీసుకుని మున్సిపాల్టీలో ఏర్పడిన అసమర్ద అవకతవకల పరిపాలనపైనా దృష్టి పెట్టాలని, అవసరమైతే ఇతర రాజకీయ పార్టీలతోనూ, వివిధ సంఘాల ప్రతినిధులతోనూ ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.—కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.