గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆరు రోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో మంగళవారం వేణుగోపాలస్వామిని పెండ్లి కుమారుడిగా అలంకరించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఆలయ అర్చకులు టి.గోపాలాచార్యులు ఆధ్వర్యంలో రుత్విక బృందం ఉదయం 5.30 గంటలకు స్వామివారి మూలవిరాట్‌కు సుప్రభాతసేవ, ప్రాతఃకాలార్చనలు నిర్వహించింది. సువర్ణాభరణాలు, ముత్యాలు, పుష్పాలతో మూలవిరాట్‌ను శోభాయమానంగా అలంకరించారు. తదుపరి వేణుగోపాలస్వామి ఉత్సవ విగ్రహాన్ని అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. ఉభయ దేవేరులైన రుక్మిణీసత్యభామ ఉత్సవ విగ్రహాలను నూతన వస్త్రాలతో అలంకరించారు. సాయంత్రం విజయవాడకు చెందిన వేదపండితులు పరాశరం పట్టాభిరామాచార్యులు ఆధ్వర్యంలో అంకురార్పణ, వాస్తుపూజ, అగ్ని ప్రతిష్ఠాపన, ధ్వజారోహణం, గరుడపట ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు వడ్లమూడి రాజశేఖర్, కార్యనిర్వాహణాధికారి వై.శివరామయ్య, పాలకవర్గ సభ్యులు ఎస్.పద్మావతి, కె.శ్రీను ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా పాలకవర్గ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాత్రి పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. నెమలి వేణుగోపాల స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి 7 గంటలకు స్వామివారికి శేషవాహన సేవ మహోత్సవం చేశారు. ప్రత్యేక రథంపై ఏర్పాటు చేసే శేషవాహనంపై రుక్మిణీసత్యభామా సమేతులైన వేణుగోపాలస్వామి ఉత్సవ విగ్రహాలను ఆశీనులను చేసి మేళతాళాలలతో తిరువీధుల్లో ఊరేగించారు.
tags: nemali krishna temple nemali brahmotsavam 2018 nemali krishna district gampalagudem tvrnews tiruvuru news tiruvuru krishna district temples
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.