సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది తిరువూరు తెలుగుదేశంలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. తిరువూరు నియోజకవర్గం నుండి తెలుగుదేశం అభ్యర్ధిగా, ఎమ్మెల్యేగా బరిలో నిలిచి రెండు సార్లు గెలిచి మూడు సార్లు ఓడిపోయి హ్యాట్రిక్ కొట్టిన నల్లగట్ల స్వామిదాస్ తిరిగి ఆరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి నానా తంటాలు పడుతున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన అనంతరం దాదాపు నాలుగేళ్ల పాటు తెదేపా నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉన్న స్వామిదాస్ ఇప్పటి వరకు గతంలో లాగానే మందకొడిగా పార్టీ కార్యకలాపాలు నిర్వహించారు. పార్టీ వ్యవహారాలలో చురుకుగా లేనప్పటికీ అధికారులు, సిబ్బంది బదిలీల విషయంలో మాత్రమే చాలా చురుకుగా ఉన్నారు. తిరువూరు మున్సిపాలిటిలో జరిగిన కుంభకోణంలోనూ, ప్రస్తుతం జరుగుతున్న అవకతవకల, పరిపాలనలోనూ స్వామిదాస్ అసమర్ధత స్పష్టంగా కనిపిస్తోంది.ఇప్పటికి కూడా తిరువూరు మున్సిపాల్టీలో పరిపాలనను గాడిలో పెట్టే సత్తా, సామర్ధ్యం స్వామిదాస్ లో ఉన్నట్లు కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల్లో దాదాపు ముప్పై వేల ఓటర్లు ఉన్న తిరువూరు పట్టణంలో మున్సిపాల్టీలో జరుగుతున్న అధ్వాన, అవినీతి, అవకతవకల పరిపాలన ప్రభావం వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్ధి పై పెద్ద ప్రభావాన్నే చూపుతుందని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. రాష్ట్ర ఎస్సి కమిషన్ సభ్యురాలుగా నియమితులైన స్వామిదాస్ భార్య సుధారాణి ఇటీవల తెలుగుదేశం రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. సుధారాణిలో వచ్చిన ఈ చురుకుదనం స్వామిదాస్ కు ఎంతవరకు మేలు చేస్తుందనే విషయం పైన పార్టీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.
*** మార్కెట్ కమిటీ పై పట్టు సాధించడానికి
గత రెండు పర్యాయాల నుండి తిరువూరు మార్కెట్ కమిటీ అద్యక్షుడుగా తాళ్లూరి రామారావు పనిచేసారు. ఎంపీ కేశినేని నాని రామారావుకు బాగా సహకరించారు. ఈ పర్యాయం తన సన్నిహిత సహచరుడు ఎ.కొండూరు మండల దేశం నాయకుడు ఆలవాల రమేష్ రెడ్డికి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇప్పించడానికి స్వామిదాస్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
*** స్వామిదాస్‌కు నాయకుల అండదండలు
స్వామిదాస్ తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా పోటీ చేయడానికి స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్దగా సుముఖంగా లేనప్పటికీ గతంలో లాగానే తెలుగుదేశం నాయకుల మద్దతు బాగా ఉంది. స్వామిదాస్ కాకుండా ఏ వర్ల రామయ్య లాంటి నాయకుడో తిరువూరుకు వస్తే తమ ఆటలు సాగవని ‘ముక్కు కోసినా మొదటివాడే మేలనే’ సామెతను గుర్తు చేస్తూ నాయకులు స్వామిదాస్ కే వంత పాడుతున్నారు. స్వామిదాస్ నాయకత్వంలో తిరువూరు నియోజకవర్గంలో గత నాలుగేళ్లలో తెలుగుదేశం నాయకులు, కాంట్రాక్టర్లు, ఉపాధి పనులు, నీరు-చెట్టు వంటి పనులలో దండిగా సంపాదించుకున్నారు. ప్రస్తుతం వీరంతా స్వామిదాస్కే జిందాబాద్ అంటున్నారు.
*** తిరువూరులోనే తేడా
వచ్చే ఎన్నికల్లో స్వామిదాస్ కు సీటు ఇవ్వడానికి గంపలగూడెం, ఎ.కొండూరు, విస్సన్నపేట మండలాల్లోని అధిక శాతం నాయకులు సుముఖంగా ఉన్నారు. తిరువూరు పట్టణంలోనూ, మండలంలోనూ స్వామిదాస్ కు ఇతర నాయకులతో పొసగడం లేదు. తాళ్ళూరి రామారావుకు పోటీగా గద్దె రమణను స్వామిదాస్ రంగంలోకి దింపారు. జిల్లా పార్టీ కార్యదర్శిగా గద్దె రమణను నియమించడంలో సఫలీకృతమయ్యారు. రాజకీయాల్లో మంచి అనుభవం, అనుచర వర్గాన్ని సంపాదించిన గద్దె రమణ నిలకడలేని రాజకీయాలతో తన పట్టును కోల్పోయారు. కొన్నాళ్ళు కాంగ్రెస్ లోనూ, మరికొన్నాళ్ళు ఖమ్మం జిల్లాలోనూ రాజకీయాలు చేసి, ప్రస్తుతం స్వామిదాస్ సరసన చేరిన గద్దె రమణ ఆయనకు ఎంతవరకు ఉపయోగపడతాడో వేచి చూడవలసిందే.—కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.