పెనుగంచిప్రోలులోని తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో ఏటా నిర్వహించే పెద్దతిరునాళ్ల ఉత్సవాలు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు, ధర్మకర్తల మండలి ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రాచలంలో నిర్వహించే సీతారాముల కల్యాణం తరహాలో తిరుపతమ్మ, గోపయ్య స్వామలు కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని నిర్ణయించారు. ప్రత్యక్షంగా 50 వేల మంది అమ్మవారి కల్యాణాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
**2న జలబిందెల మహోత్సవం
గ్రామానికి చెందిన ఐదు కుటుంబాల వారు మట్టి కుండలతో మునేరుకు వెళ్లి అక్కడి నుంచి నీటిని తీసుకొచ్చి ఆలయంలో ఉంచుతారు. పోలీసుస్టేషన్ సెంటర్లో జలబిందెలకు పోలీసులు మొక్కులు చెల్లిస్తారు. ఉత్సవంగా ఆలయానికి చేరుకున్న జలబిందెలను ఆలయంలో నవధాన్యాలతో ఏర్పాటు చేసిన మట్టిపై ఉంచుతారు.
**1న దీక్షల విరమణ
వచ్చే నెల ఒకటో తేదీ ఉదయం 6 గంటలకు ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మండల దీక్షలు పూర్తి చేసిన భక్తులు ‘తిరుముడి’ సమర్పిస్తారు. అనంతరం దేవస్థానం ఆధ్వర్యంలో భారీ అన్నసమారాధన కార్యక్రమం ప్రారంభమవుతుంది. రాత్రి 9 గంటలకు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మండపంలో అమ్మవారి కల్యాణం నిర్వహిస్తారు.
**3న పొంగళ్లు, అంక సేవ
ఆలయంలో పరివార దేవతగా ఉన్న అంకమ్మ తల్లికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. గ్రామానికి చెందిన రజకులు, కుమ్మర్లతో బోనాలు చేసి దేవతలకు ఆరగింపు చేస్తారు. సంప్రదాయ పూజలు నిర్వహిస్తారు.
**4న దీవెన బండారు
గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేయడాన్ని దీవెన బండారు అని పిలుస్తారు. ఆ రోజున ఆలయంలో రజకులు, కుమ్మర్లు గ్రామ దేవతలకు పూజలు నిర్వహిస్తారు. ఆయా దేవతలకు సంబంధించిన ఒగ్గు కథలను కళాకారులు ప్రదర్శిస్తారు.
***పెనుగంచిప్రోలుకు ఇలా చేరుకోవచ్చు..
విజయవాడ బస్‌స్టాండ్‌లో 39, 40, 41వ నంబర్ ప్లాట్‌ఫారాల్లో పెనుగంచిప్రోలు బస్సులు ఉంటాయి. నేరుగా వచ్చే అవకాశం లేనివారు నందిగామ బస్టాండ్‌లో దిగి అక్కడి నుంచి ఆటోలు, ఇతర వాహనాల్లో పెనుగంచిప్రోలు చేరుకోవచ్చు. సొంత వాహనాల్లో వచ్చేవారు జాతీయ రహదారిపై నవాబుపేట సమీపంలోని ముండ్లపాడు అడ్డరోడ్డు నుంచి 9 కిలోమీటర్లు ప్రయాణిస్తే పెనుగంచిప్రోలు చేరుకోవచ్చు.
*హైదారాబాద్ నుంచి వచ్చేవారు చిల్లకల్లు వద్ద నుంచి 12 కిలోమీటర్లు ప్రయాణిస్తే అమ్మవారి ఆలయానికి చేరుకోవచ్చు. జగ్గయ్యపేట బస్టాండ్ నుంచి నేరుగా బస్సులు ఉంటాయి.
* ఖమ్మం, మధిర పట్టణాల నుంచి నేరుగా బస్సు సర్వీసులు తిరుగుతున్నాయి. తిరునాళ్ల సమయంలో బస్టాండ్ల నుంచి ప్రత్యేక బస్సులుంటాయి.
ఉత్సవాల చివరి రోజున ఆలయంలో పుర్ణాహుతి నిర్వహిస్తారు. కల్యాణం పీటలపై కూర్చున్న కాకాని, కొల్లా వంశీయులు, ఆలయ అధికారులు, ధర్మకర్తలు పుర్ణాహుతిలో పాల్గొంటారు.
© 2017 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.