ఒకప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంచి వెలుగులు విరజిమ్మిన నాటక రంగానికి తిరిగి పూర్వ వైభవం తీసుకురావడానికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఏపీ నాటక అకాడమీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన గుమ్మడి గోపాలకృష్ణ వెల్లడించారు. శనివారం రాత్రి తిరువూరు త్యాగరాజ గాన కళా సమితి 64వ వార్షిక వేడుకల సందర్భంగా పశ్చిమ కృష్ణా ప్రాంతంలో ఉన్న కళాకారులు గోపాలకృష్ణను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గోపాలకృష్ణ మాట్లాడుతూ నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకువస్తానని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రంగస్థల కళాకారులతో త్వరలోనే ఒక సదస్సును నిర్వహిస్తామని తెలిపారు. నాటకరంగంలో నూతన కళాకారులు ప్రవేశించే విధంగా శిక్షణా తరగతులు అన్ని జిల్లాలో నిర్వహిస్తామని తెలిపారు. నాటకాల్లో నూతన సాంకేతిక పద్ధతులను ప్రవేశపెడతామని సినిమాలకు దీటుగా నాటకాలను కూడా తీర్చిదిద్దుతామని గుమ్మడి పేర్కొన్నారు. తిరువూరు, మైలవరం, నూజివీడు జమీందార్లు నాటక రంగ అభివృద్ధికి, కళాకారులను పోషించడానికి ప్రత్యేక శ్రద్ధ చూపారని ఈ ప్రాంతంలో ప్రభుత్వం తరపున కళాకారుల శిక్షణ కోసం ఒక ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సీనియర్ పాత్రికేయులు కిలారు ముద్దుకృష్ణ, గుమ్మడి గోపాలకృష్ణను సభకు పరిచయం చేశారు. రాష్ట్ర మార్క్ఫెడ్ అధ్యక్షుడు కంచి రామారావు మాట్లాడుతూ నాటక అకాడమీకి మంచి కళాకారుడైన గుమ్మడి గోపాలకృష్ణను అధ్యక్షునిగా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. తిరువూరు ప్రాంతంలో స్వాతంత్ర్యానికి పూర్వం నుండి పెద్ద సంఖ్యలో నాటకాలు వేసేవారని…వల్లం నరసింహారావు, సుంకర సత్యనారాయణ వంటి కళాకారులూ ఈ ప్రాంతం నుండి వచ్చారని తెలీపరు. స్థానికంగా మంచి కళాకారులు ఉన్నారని, అనేక నాటక సమాజాలు ఇక్కడ వెలిశాయని కంచి పేర్కొన్నారు. తిరువూరు శాసనసభ్యుడు కొక్కిలిగడ్డ రక్షణనిధి మాట్లాడుతూ తిరువూరు ప్రాంతంలో నాటక రంగం అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని, ఇక్కడ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని గోపాలకృష్ణను ఎమ్మెల్యే కోరారు. ప్రముఖ రంగస్థల నటుడు, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ మాట్లాడుతూ గుమ్మడి గోపాలకృష్ణ గొప్ప కళాకారుడని, కృష్ణుని వేషంలో ఎన్టీఆర్ తరువాత గుమ్మడి రాణించారని తెలిపారు. నాటక రంగం అభివృద్ధికి, కళాకారులను ప్రోత్సహించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తిరువూరు తదితర ప్రాంతాల్లో ఉన్న రంగస్థల కళాకారులు గోపాలకృష్ణను ఘనంగా సత్కరించారు. తిరువూరు త్యాగరాజ గాన కళా సమితి తరుపున కార్యదర్శి మురుకుంట్ల సీతారామలింగేశ్వరశర్మ గుమ్మడిని సత్కరించారు. కళాకారుల తరపున వీ. శ్రీనివాసరావు, వాణి రంగారావు, పసుపులేటి వెంకయ్య, పీ.మధుసూదనరెడ్డి, తేజా, ప్రసాద్ తదితరుల ఆధ్వర్యంలో గుమ్మడిని సత్కరించారు. అనంతరం సత్యసాయి సేవ నాట్యా మండలి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ రాయబారం నాటకాన్ని ప్రదర్శించారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.