తిరువూరు నియోజకవర్గంలో భోగి పండుగ రోజున భారీ ఎత్తున కోడిపందేలు జరిగాయి. సాంప్రదాయం పేరుతో కోడిపందేల ముసుగులో జూదాలు, అధిక ధరలకు మద్యవిక్రయాలు నిర్వహించి సామాన్యులను నిర్వాహకులు దోచుకుతిన్నారు. పోలీసులు, ప్రభుత్వాధికారుల అండదండలతో ఉదయం నుంచి కోడిపందేలు, పలురకాల జూదాలు యథేచ్ఛగా జరిగాయి. తిరువూరుతో పాటు మండలంలోని కాకర్ల, ముష్టికుంట్ల, తిరువూరు సర్కిల్ పరిధిలోని ఊటుకూరు, గుళ్లపూడి, కలగర, పుట్రేల తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కోడిపందేలు, జూదాలు జరిగాయి. కోట్లాది రూపాయిలు చేతులు మారాయి. ఈ పందేలన్నీ తెలుగుదేశం నేతల ఆధ్వర్యంలోనే నిర్వహించడం విశేషం. పొరుగునే ఉన్న తెలంగాణాలో కోడిపందేలు జరక్కుండా అక్కడి ప్రభుత్వం, పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో తెలంగాణా జిల్లాల నుండి కూడా పందెంరాయుళ్లు, జూదప్రియులు తిరువూరుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.