గత మూడు పర్యాయాల నుండి ఎమ్మెల్యేగా తెలుగుదేశం అభ్యర్ధిని గెలిపించలేని నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు చాలా మంది…తమకు ప్రస్తుతం ఖాళీగా ఉన్న తిరువూరు మార్కెట్ కమిటి చైర్మన్ పదవి ఇవ్వాలని అధిష్టానం వద్ద పైరవీలు ప్రారంభించారు. ఈసారి తెలుగుదేశం పార్టీ అధిష్టానం మాత్రం తిరువూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి సత్తా, దమ్ము ఉన్న నాయకుడికే ఇవ్వాలని భావిస్తోంది. దాని కోసం వివిధ మార్గాలలో సమాచారాన్ని పార్టీ రాష్ట్ర నాయకత్వం తెప్పించుకొంటుంది.
** గత రెండు సంవత్సరాల నుండి ప్రాధాన్యత కలిగిన తిరువూరు మార్కెట్ కమిటి చైర్మన్ పదవీ తిరువూరు మాజీ సర్పంచ్ తాళ్లూరి రామారావు నిర్వహించారు. పరిపాలనలో కాస్తో కూస్తో ఆయన ముద్ర వేశారు. రైతు బజారు ఏర్పాటు చేయటంలో శ్రద్ధ వహించారు. ఈ పర్యాయం కూడా ఎంపీ కేశినేని నాని సహాయ సహకారాలతో ముచ్చటగా మూడోసారి తనకే చైర్మన్ పదవి కేటాయించాలని తాళ్లూరి రామారావు అధిష్టానం వద్ద మారాం చేస్తున్నారు.
** 2019లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్ధిని గెలిపించే బాధ్యత మార్కెటింగ్ కమిటి చైర్మెన్‌పై చాలా ఉంటుంది. నేర చరిత్ర, అవినీతి వంటి ఆరోపణలు ఉన్న నాయకులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పదవి ఇవ్వకూడదని ఒక పక్క నాయకత్వం భావిస్తూ ఉండగా, మరొక పక్క నియోజకవర్గంలోని తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ఎ.కొండూరు మండలం నుండి అలవాల రమేష్‌రెడ్డి, గంపలగూడెం మండలం నుండి యనమద్ది నాగమల్లేశ్వరరావు, దేవభక్తుని సీతారాంప్రసాద్, తిరువూరు మండలం నుండి కిలారు రమేష్, సుంకర కృష్ణమోహన్, విస్సన్నపేట మండలం నుండి నెక్కలపు శ్రీనివాసరావు చైర్మన్ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న నియోజకవర్గ కన్వీనర్ స్వామిదాస్ ఈ నెలాఖరుకు తిరిగి వస్తున్నారు. ఆయన వచ్చిన అనంతరం అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది. గతంలో తిరువూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవీ తాళ్లూరి రామారావుకు ఇప్పించటానికి ఎంపీ కేశినేని నాని గట్టిగా ప్రయత్నించి ఆ పదవిని ఇప్పించారు. ఈ పర్యాయం తనమాటే చెల్లుబాటు కావాలని స్వామిదాస్ కోరుతున్నట్లు సమాచారం. తన వ్యాపార భాగస్వామి, ముఖ్య అనుచరుడు రమేష్‌రెడ్డి వైపే స్వామిదాస్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. పార్టీ అధిష్టానం నిర్ణయం ఎలాగ ఉంటుందో వేచి చూద్దాం.––కిలారు ముద్దుకృష్ణ.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.