కృష్ణా జిల్లా తిరువూరు మాజీ శాసనసభ్యుడు, తెదేపా తిరువూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి నల్లగట్ల స్వామిదాస్ గురువారం నాడు ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) అధ్యక్షుడు వేమన సతీష్‌తో వర్జీనియాలోని సితార సమావేశ మందిరంలో భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం అధ్యక్షుడు మన్నే సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రవాసులు మాతృభూమి కోసం సేవ చేయాలని స్వామిదాస్ కోరారు. తానా ఆధ్వర్యంలో తిరువూరు మండలం రోలుపడి గ్రామంలో కిలారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తానా సేవలను ఆయన అభినందించారు. తానా అధ్యక్షుడు వేమన సతీష్ మాట్లాడుతూ ఎన్టీఆర్ తొలితరం శిష్యుల్లో స్వామిదాస్ అగ్రగణ్యులని, పార్టీకీ నియోజకవర్గానికి ఆయన సేవలు అమూల్యమైనవని కొనియాడారు. తానా ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తరిస్తామని ఆయన పేర్కొన్నారు. అనంతరం స్వామిదాస్ చేతులమీదుగా జీడబ్ల్యూటీసీఎస్ సంక్రాంతి వేడుకల గోడపత్రికను ఆవిష్కరించారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.