నూతన రాజధాని అమరావతిలో విద్యా-వైద్యం-ఆరోగ్య రంగాల్లో మౌలిక వసతుల కల్పనకు అత్యయిక అవసరం అధికంగా ఉందని, దీనికి తోడ్పడేందుకు ప్రవాసులు పెద్దసంఖ్యలో బాధ్యాతాసహితంగా తరలి రావాలని కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ విజ్ఞప్తి చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, అనురాధ, తిరువూరు మాజీ శాసనసభ్యుడు నల్లగట్ల స్వామిదాస్, కృష్ణా జడ్పీ మాజీ చైర్పర్సన్ నల్లగట్ల సుధారాణిలు ఆదివారం సాయంత్రం ఇర్వింగ్‌లోని హిల్‌టాప్ సమావేశ మందిరంలో డల్లాస్ పరిసర ప్రాంతంలో నివసిస్తున్న కృష్ణా జిల్లా ప్రవాసులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినందన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఏపీ ప్రభుత్వం రహదారులు, తల్లిబిడ్డల ఎక్స్‌ప్రెస్, తాగునీరు, సాగునీరు, పరిశ్రమల ఏర్పాటు వంటి వాటి విస్తృత పరికల్పనకు విశేష కృషి జరుపుతోందని, విద్యా-ఆరోగ్య రంగాలు గ్రామీణ ప్రాంతాల్లో మరింత ప్రభావితంగా చొచ్చుకుపోవాలంటే ప్రవాసుల చొరవ వలనే అది సాధ్యమని ఆమె అభిప్రాయపడ్డారు. తను అమెరికా పర్యటనకు బయల్దేరే ముందు రూ.192కోట్లను కృష్ణా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు మంజూరు చేశానని ఆమె తెలిపారు. బాబు వస్తే జాబు వస్తుందనే నినాదానికి అశేష ప్రాచుర్యం కల్పించిన ప్రవాసులు ఆ నినాదాన్ని నిజం చేసేందుకు పెట్టుబడులతో కదిలిరావాలని కోరారు. అనంతరం ప్రసంగించిన కృష్ణా జడ్పీ మాజీ చైర్పర్సన్ నల్లగట్ల సుధారాణి…ఏపీలో సామాజిక జీవన నాణ్యత మెరుగ్గా ఉందని, సామాజిక బాధ్యతను విస్మరించకుండా ప్రజలు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. తాను సభ్యురాలిగా ఉన్న కమీషన్ ద్వారా ఎటువంటి ప్రజాపయోగ పనులైనా సరే తన పరిధి అవతల ఉన్నా సరే కచ్చితంగా చేయవల్సిందిగా ముఖ్యమంత్రి సూచిస్తున్నారని, మెరుగైన రాష్ట్రం కోసం ఆయన తపన దీని ద్వారా వెల్లడి అవుతోందని ఆమె పేర్కొన్నారు. ఏపీలో అభివృద్ధిపరంగా పెనుమార్పులు అతి వేగంగా సంభవిస్తున్నాయని, దీన్ని అందరూ హర్షించాలని ఆమె కోరారు. తిరువూరు మాజీ శాసనసభ్యుడు నల్లగట్ల స్వామిదాస్ మాట్లాడుతూ కృష్ణా జిల్లా అనగానే స్వాతంత్ర్య సమరోద్యమ నాయకులు, బెజవాడ కనకదుర్గ, సినీ, కళా, సాహితీ రంగాలకు చెందిన ఎందరో ప్రముఖులు జ్ఞప్తికి వస్తున్నారని, ఇటువంటి మహోన్నత జిల్లాకు సమీపంలో నూతన రాజధాని నిర్మాణం కావడం ఆనందంగా ఉందని వెల్లడించారు. ప్రవాసులు జిల్లా అభివృద్ధికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ ప్రసంగిస్తూ ఎకరానికి కోటి రూపాయిల ఆదాయం వచ్చే విధంగా ఏపీలో వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని వెల్లడించారు. కోర్ కమిటీ సభ్యుడిగా నిరంతరం అతి సమీపంగా రాష్ట్రంలో అమలయ్యే పలు పథకాలు, నిర్మాణాలను తాను సభ్యుడిగా ఉన్న కోర్ కమిటీ అధ్యయనం చేస్తుందని, వినడానికి వింతగా ఉన్నప్పటికీ ఇటీవల విశాఖలో ఏర్పాటు చేసిన అగ్రిటెక్ సదస్సు ద్వారా ఎకరానికి కోటి రూపాయిల ఆదాయం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. పట్టిసీమ ద్వారా ఆక్వా రంగం కొత్తపుంతలు తొక్కుతోందని, గోదావరి నీరు కలవడం చేత పంటలు సారవంతమైన వనరులను అద్భుతంగా వినియోగించుకుంటున్నాయని తెలిపారు. సభ ప్రారంభానికి పూర్వం గద్దె దంపతులను మొక్కపాటి దినేష్, నల్లగట్ల దంపతులను త్రిపురనేని దినేష్‌లు సభకు పరిచయం చేశారు. స్థానిక ప్రవాసుడు చలసాని కిషోర్ నివాసంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి గద్దె-నల్లగట్ల దంపతులు ఘననివాళులు అర్పించారు. ఈ ఆత్మీయ సమావేశంలో తాతినేని రాం, కోనేరు శ్రీధర్, చలసాని కిషోర్, కొరడా కృష్ణ, చాగర్లమూడి సుగన్, అడుసుమిల్లి రాజేష్, డా.సూద్నగుంట రాఘవేంద్ర ప్రసాద్, వీరపనేని అనీల్, పోలవరపు శ్రీకాంత్, జెట్టి శ్రీరాం, సీ.ఆర్.రావు, మండువ సురేష్, అనీల్ తన్నీరు, నల్లగట్ల క్రాంతి, వీర్నపు చినసత్యం, ఉప్పలపాటి కృష్ణారెడ్డి, యార్లగడ్డ అప్పారావు, కోగంటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.