కృష్ణాజిల్లా తిరువూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి, తెదేపా సీనియర్ నేత నల్లగట్ల స్వామిదాస్, ఆయన సతీమణి కృష్ణాజిల్లా జడ్పీ మాజీ చైర్పర్సన్ సుధారాణి దంపతులను డల్లాస్లోని ప్రవాసులు గురువారం సాయంత్రం ఘనంగా సత్కరించారు. తొలిసారి అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్లో పర్యటిస్తున్న వీరిరువురు స్థానిక కృష్ణా జిల్లా ప్రవాసులతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీతో తనకున్న పలు అనుభవాలను స్వామిదాస్ నెమరవేసుకున్నారు. 1994లో మొట్టమొదటి సారి ఎన్.టి.రామారావు తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గుర్తింపును ఇచ్చారని, అప్పటి నుండి గత 23ఏళ్లుగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు తనకు డబ్బులతో ప్రభోలాకు గురిచేసి మభ్యపెట్టాలని చూశారని, కానీ చంద్రబాబు తమపై చూపిన ఆదరణ, అభిమానాలను మరిచిపోకుండా అన్నివేళలా పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు తమ కుటుంబం విశేషమైన కృషి చేసిందని పేర్కొన్నారు. ప్రవాసులకు ఓటు హక్కు బిల్లు ఆమోదముద్ర పడితే తద్వారా కృష్ణా జిల్లాలో తెదేపా మరిన్ని సీట్లను కైవసం చేసుకునే అవకాశం కలుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తపరిచారు. కార్యక్రమంలో ప్రవాసులు చలసాని కిషోర్, తాతినేని రాం, నవీన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం సాయంత్రం ఆర్కాన్సాలో జరిగే తమ కుమారుడు క్రాంతి స్నాతకోత్సవానికి హాజరయి అటు నుండి ఫిలడెల్ఫియా, న్యూజెర్సీ, బోస్టన్, వాషింగ్టన్ డీసీ, శాన్ఫ్రాన్సిస్కో తదితర నగరాల్లో స్వామిదాస్-సుధారాణిలు పర్యటించనున్నారు. ప్రవాసులతో భేటీకి పూర్వం స్వామిదాస్ దంపతులు ఇర్వింగ్లోని మహాత్మాగాంధీ స్మారకస్థలిని సందర్శించారు. స్మారకస్థలి కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షులు తోటకూర ప్రసాద్ వీరికి విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన విశేషాలను వివరించారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.