తిరువూరు బైపాస్ రోడ్డులోని NSP స్థలంలో ఉద్యోగుల సహకార సంఘానికి కేటాయించిన స్థలంలో అక్రమాలు, అవినీతి అవకతవకలు పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు గత ఆరు సంవత్సరాల నుండి చాలా మంది బాధితులు మొత్తుకుంటున్నప్పటికీ, ఇప్పటి వరకు పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఉద్యోగుల సహకార సంఘానికి గృహ నిర్మాణాల నిమిత్తం 5.13 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఉద్యోగులకు ప్రభుత్వం వివిధ నగరాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో గృహనిర్మాణాల కోసం కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది. తిరువూరులో మాత్రం ఉద్యోగులంతా ఒక మోసగాడి చేతిలో చిక్కుకుని విలవిలాడుతున్నారు. ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని సంబంధిత ఉద్యోగులకు కేటాయించడానికి ఒక్కొక్కరి నుండి రెండు లక్షల వరకు ఈ మోసగాడు వసూళ్లు చేశాడని ఉద్యోగులు గగ్గోలుపెడుతున్నారు. ఉద్యోగులకు కేటాయించిన ఐదు ఎకరాల స్థలం కాకుండా అక్కడే ఉన్న గురుకుల కళాశాల స్థలాన్ని, NSP స్థలాన్ని, జిల్లా పరిషత్ స్థలాన్ని కూడా ఈ మోసగాడు ఆక్రమించి తొలుత జాబితాలో లేని ఉద్యోగులకు ఎరచూపి లక్షల కొద్ది సొమ్ము దండుకున్నాడని సమాచారం. ఈ దండుకున్న సొమ్మును ఇప్పటివరకు ఉన్నతాధికారులకు లంచాలుగా ఎరవేసి సంఘంపై విచారణ జరపకుండా ఇప్పటివరకు అడ్డుకున్నాడు. దీనిపై విచారణ చేయాలని పిటీషన్లు పెడుతున్న ముదిగొండ దుర్గాప్రసాద్ పైనా ఇటీవలే ఎస్సీ,ఎస్టీ ఎట్రాసటీ కేసు కూడా పెట్టించాడు. ఈ మోసగాడికి మద్దతుగా కొందరు రెవెన్యు అధికారులు, పోలీసులు కొమ్ముకాశారు. ఎట్టకేలకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నూజివీడు ఆర్డీవో రంగయ్య , జిల్లా సహకార శాఖాధికారి ఆనందబాబు శుక్రవారం నుండి దర్యాప్తు కోసం రంగంలోకి దిగారు. ఇప్పటి వరకు 15మంది వ్యక్తులు ఈ మోసగాడి చేతిలో మోసపోయారని జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. పత్రికా విలేఖరులను కూడా ఇళ్ల స్థలాలు ఇస్తానని మభ్యపెట్టి ప్రలోభాలకు గురిచేసినట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు ఈ మోసగాడికి సంపూర్ణ మద్దతు ఇచ్చిన ఆ “కొందరు” విలేకరులు…కలెక్టర్ దర్యాప్తు ఆదేశాల పుణ్యామా అని ఇతని మోసాలు హడావుడిగా వెలుగులోకి తెస్తూ ఉండటం కొసమెరుపు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.