అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రానికి చెందిన ప్రవాసాంధ్ర ప్రముఖుడు యార్లగడ్డ వెంకట్రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చురుకైన పాత్ర పోషించడానికి అమెరికా నుండి స్వస్థలమైన కృష్ణాజిల్లాకు వచ్చారు. ఆయన పెనమలూరు అసెంబ్లీ స్థానం నుండి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా పార్టీ తరపున పోటీ చేయాలనీ అన్ని హంగులు సమకూర్చుకుంటున్నారు. అమెరికాలో బాగా సంపాదించిన యార్లగడ్డ వెంకట్రావు తన స్వస్థలమైన ఉయ్యూరు తదితర ప్రాంతాలతో పాటు పెనమలూరు నియోజకవర్గంలో పలు చోట్ల కొద్ది సంవత్సరాల నుండి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. కానీ పెనమలూరులో వెంకట్రావుకు ఓ పెద్ద నాయకుడు అడ్డుపడ్డాడు. వైకాపాలో కీలకపాత్ర పోషిస్తున్న మాజీ మంత్రి కొలుసు పార్థసారధి ఈ పర్యాయం వైకాపా తరపున పెనమలూరు నుండి పోటీ చేయటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఇక్కడి నుండే గెలుపొందిన పార్థసారధి మంత్రి అయ్యారు. గత ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీ చేసిన కొలుసు పరాజయం పాలయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఆయన మళ్లీ పెనమలూరు నుండి పోటీ చేయటానికి బలాలను సమీకరించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో యార్లగడ్డ వెంకట్రావును గన్నవరంకు తరలించారు. గన్నవరం నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జిగా యార్లగడ్డ వెంకట్రావును దాదాపుగా నియమించారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న డా.దుట్టా రామచంద్రరావును ఒప్పించి వెంకట్రావుకు ఆ బాధ్యతల్ని ఆపాదించడంలో పార్ధసారధి సఫలీకృతం అయ్యారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యేర్థి వల్లభనేని వంశీని గన్నవరంలో ఢీ కోట్టగలిగే సత్తా యార్లగడ్డ వెంకట్రావుకు మాత్రమే ఉందని వైకాపా అధిష్ఠానం కూడా భావిస్తోంది. ఈ నేపథ్యంలో యార్లగడ్డ పెనమలూరు నుండి తన దుకాణాన్ని గన్నవరానికి తరలించే ప్రయత్నాల్లో ఉన్నారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.