గతంలో మేజర్ పంచాయతిగా ఉన్న తిరువూరును నగర పంచాయతిగా మార్పు చేసిన అనంతరం పట్టణంలో సౌకర్యాలు మెరుగు పడకపోగా కుంభకోణాలు మాత్రం అడ్డగోలుగా పెరుగుతున్నాయి. అధికార పార్టీ చేతుల్లోనే పాలకవర్గం ఉన్నపటికీ పరిపాలన పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయింది. సిబ్బందిపై పాలకవర్గానికి అదుపు లేదు. మున్సిపల్ అధికారుల మధ్య సమన్వయం లేదు. ఎవరికీ వారే తామే బాసులమంటూ వ్యవహరిస్తున్నారు. అధికారులు ఒకరి మధ్య ఒకరికి పొసగకపోవడంతో పరిపాలన కుంటుపడింది. గతంలో ఫించన్ల సొమ్ము రూ. 20లక్షల వరకు దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై నూజివీడు ఆర్డీవో రంగయ్య విచారణ జరిపి కేవలం ఒక్క గుమ్మస్తానే ఇప్పటివరకు సస్పెండ్ చేశారు. మిగిలిన సిబ్బందిపైనా, అప్పటి కమీషనర్ పైన ఏ విధమైన చర్యలు చేపట్టలేదు. మరోవైపు పాలకవర్గం విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. ఒప్పందం ప్రకారం ప్రస్తుత చైర్పర్సన్ మరకాల కృష్ణకుమారి రెండున్నరేళ్ల తరువాత పదవి నుండి తప్పుకోవాలి. అయితే ఎంపి నాని ఆశీస్సులతో ఆమె ఆ పదవిలో కొనసాగుతున్నారు. దీంతో చైర్పర్సన్ వ్యతిరేకవర్గం మున్సిపల్ పరిపాలనను నీరుగార్చే ప్రయత్నం చేస్తోంది. కొందరు తెలుగుదేశం కౌన్సిలర్లే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. పాలకవర్గం అదుపులో లేకపోవడంతో గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా నిధుల దుర్వినియోగం జరుగుతూనే ఉంది. మున్సిపాలిటి కుంభకోణంపై కలెక్టర్ లక్ష్మీకాంతం తాజాగా విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఈ విచారణ సరిపోదని…దర్యాప్తు బాధ్యతను అవినీతి నిరోధక శాఖకు అప్పగించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. తిరువూరు నగర పంచాయతీలో పరిపాలన గాడిలో పడకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దీని ప్రభావం తెదేపాపై గణనీయంగా ఉంటుందని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.