విజయవాడ–జగదల్పూర్ జాతీయ రహదారి(హైవే-30) తిరువూరు బైపాస్‌రోడ్డు గుండా వెళుతుంది. జాతీయ రహదారి కాక మునుపు మున్సిపాలిటీ ఆద్వర్యంలో బైపాస్‌రోడ్డులో వీధి దీపాలు వెలిగేవి. రోడ్డు విస్తరణలో భాగంగా జాతీయ రహదారుల సంస్థ అధికారులు విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి వాటికి అమర్చిన దీపాలను తొలగించారు. దీంతో బైపాస్‌రోడ్డులో దాదాపు రెండు కిలోమీటర్ల మేర గత నాలుగు నెలల నుండి అంధకారం ఏర్పడింది. జాతీయ రహదారుల సంస్థకు చెందిన కాంట్రాక్టరు బైపాస్‌రోడ్డు చర్చి సెంటరులో (నాలుగు రోడ్ల కూడలి ) ఇరవై అడుగుల ఎత్తులో ఒక భారీ విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేశారు. ఈ సెంటరులో వెలుగులు చిందే విధంగా ఆరు భారీలైట్లను అమర్చారు. ఈ లైట్లు ఏర్పాటు చేసి నాలుగు నెలలు అయింది. ముచ్చటగా మూడు వారాల పాటే ఈ స్తంభానికి అమర్చిన లైట్లు వెలిగాయి. గత మూడు నెలల నుండి ఈ స్తంభానికి అమర్చిన లైట్లు వెలగడం లేదు. దీంతో ఈ ప్రాంతంలో అంధకారం ఏర్పడింది. ఈ సెంటరుకు సమీపంలోనే ఒక మద్యం దుకాణాన్ని కుడా ఏర్పాటు చేశారు. చీకటి పడితే బైపాస్‌రోడ్డులోకి వెళ్లడానికి, మరీ ముఖ్యంగా పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో మున్సిపాలిటి వారు అక్కడక్కడా ఏర్పాటు చేసిన వీధి దీపాలను ఈ రోడ్డు కాంట్రాక్టర్ తీసుకెళ్లాడని, రోడ్డు విస్తరణ అనంతరం వీటిని తిరిగి అమర్చలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ అధికారులు కూడా తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా జాతీయ రహదారుల సంస్థ అధికారులు, మున్సిపల్ అధికారులు స్పందించి తిరువూరు బైపాస్‌రోడ్డులో లైటింగ్ వ్యవస్థ పనిచేసే విధంగా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.