పశ్చిమ కృష్ణాలోని మైలవరం, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలకు సరిహద్దుల్లో వేలాది ఎకరాల్లో అడవులు ఉన్నాయి. కొండలు, గుట్టలు, సెలయేరులతో నిండి ఉన్న ఈ అటవీ ప్రాంతంలో వన్యమృగాలు కూడా భారీగానే ఉన్నాయి. ఈ అడవుల్లో అరుదైన చిరుతపులులు కూడా చాలాసార్లు వేటగాళ్ల ఉచ్చులకు బలైన సంఘటనలు ఉన్నాయి. దుప్పులు, అడవిపందులు, కుందేళ్లు, కొండగొర్రెలు, నెమళ్లు వంటివి అధికంగానే ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న కొంతమంది వేటగాళ్లు అడవుల్లో సంచరిస్తూ వన్యమృగాలను వేటాడటం తరచుగా జరుగుతూ ఉంది. సమీపంలో ఉన్న పంటపొలాల్లోకి వన్యమృగాలు ప్రవేశించి పంటలను నాశనం చేస్తూ ఉండటంతో రైతులు కూడా వీటిని మట్టుబెట్టడానికి నాటుబాంబులను, ఉచ్చులను పంటపొలాల్లో అమర్చి వీటిని హతమార్చి వాటి మాంసాన్ని విక్రయించడం గతంలో భారీగా జరిగేది. ఈ ప్రాంతంలో అటవీ జంతువుల మాంసానికి ఉన్న గిరాకీని ఆసరాగా చేసుకుని ఇటీవలి కాలంలో కొంతమంది వేటగాళ్లు నకిలీ మాంసాలను విక్రయిస్తున్నారు. దుప్పి మాంసం పేరుతో దున్నపోతులను, గేదెలను సంహరించి అమ్ముతున్నారు. అడవిపందుల పేరుతో మామూలు పంది మాంసాన్ని విక్రయిస్తున్నారు. తాజాగా వీరి జాబితాలో కుక్కలు కూడా చేరాయి. జీ.కొండూరులో అటవీ మాంసం పేరుతో కుక్కను సంహరించి మాంసాన్ని విక్రయిస్తూ ఉండగా శనివారం నాడు గ్రామస్థులు నకిలీ విక్రయదారులను వలపన్ని పట్టుకున్నారు. కృష్ణాజిల్లా జి.కొండూరు మండలం కోడూరు గ్రామంలో వీథి కుక్కల్ని చంపి అడవి మాంసం ముసుగులో విక్రయిస్తున్నారని కోడూరు గ్రామస్థులు నూజివీడు సబ్ డివిజన్ డిఎస్పీ శ్రీనివాసరావుకి సమాచారం ఇవ్వగా ఆయన ఆదేశాల మేరకు నిన్న సాయంత్రం జి.కొండూరు ఎస్ఐ రాజేష్ తన సిబ్బందితో అదుపులోకి తీసుకున్నారు. జంతు కళేబరాలను పోస్ట్ మార్టం కొరకు సంబంధిత అధికారులు స్వాధీనపరుచుకున్నారు. జీ.కొండూరు ఎస్ఐ రాజేష్ వివరాలు తెలియజేశారు. కట్టా ఆదినారాయణ,శేగు లక్ష్మణరావు అనే ఇద్దరు వ్యక్తులు వీథి కుక్కలను చంపి వాటి తలను చర్మాన్ని వేరు చేసి అడవి దుప్పి మాంసం క్రింద ప్రజలను మోసం చేసి విక్రయాలు జరుపుతున్నారని వీరిరువురిపై మోసం మరియు జంతుహింస నిరోథం క్రింద కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరు పరుస్తామని తెలిపారు. గత కొంత కాలంగా వీరు కుక్కలనే కాకుండా పలు జంతువుల మాంసాన్ని కూడా ఇలాగే మోసపూరితంగా అమ్ముతున్నారని తమ దృష్టికి వచ్చిందని అన్నారు.అలాగే అడవి మాంసం మాత్రమే కాకుండా మేక మాంసం ముసుగులో కూడా వీరు పలు హోటళ్ళలో విక్రయాలు జరిపారనే సమాచారం మేరకు ఆ కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఇటువంటి సంఘటనలను ఉపేక్షించేది లేదని గతంలో జి.కొండూరు మండలంలో మేక మాంసాన్ని ఐస్ లో నిల్వ ఉంచి ఆ నిల్వ ఉన్న మాంసాన్ని అమ్మకాలు జరుపుతున్న మాంసం వ్యాపారులపై కూడా కేసులు పెట్టి కోర్టుకు హాజరు పరిచిన విషయాన్ని స్పష్టం చేశారు.ఈ విషయమై ప్రజల్లో కూడా అవగాహన రావాలని ఆయన కోరారు.మరోవైపు గ్రామీణ ప్రాంత ప్రజలను ఒక్క సారిగా దిగ్బ్రాంతి కి గురి చేసిన ఈ సంఘటన పై డీఎస్పీ శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వన్యప్రాణుల జోలికి వెళితే తీవ్ర నేరమని, ఇటువంటి మోసపూరిత చర్యలకు పూనుకుని అమాయక ప్రాణులను వధించి వ్యాపారాలు నిర్వహించే వారెవరైనా వదిలేది లేదని,కఠిన చర్యలకు బాధ్యులు అవుతారని తెలిపారు. ఈ ప్రాంత అభయారణ్యంలోని జంతువులను సంరక్షించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.