తిరువూరు నగర పంచాయతీలో పరిపాలన అస్తవ్యస్తంగా ఉంటుందనడానికి పట్టణంలో అధ్వాన్నంగా ఉన్న ప్రధాన రహదారులే నిదర్శనం. మున్సిపాలిటీ అయిన అనంతరం కోట్లాది రూపాయిలు ఖర్చు పెట్టి చిన్నచిన్న లీడర్లు ఉండే గల్లీల్లో సిమెంటు రోడ్లు వేసిన పాలకవర్గం ప్రధాన రహదారులను మరమ్మత్తులు చేయడం కూడా మరిచిపోయింది. పట్టణంలోని చాలా ప్రధాన రహదారులు మోకాలు లోతు గుంటలు పడి మురికి కూపాలను తలపిస్తున్నాయి. ఈ రహదారులపై నడవలాంటే నరకం కనిపిస్తోందని ప్రజలు వాపోతున్నారు. పన్నులు రూపేణా కోట్లాది రూపాయిలు ముక్కులు పిండి మరీ వసూలు చేస్తున్న మున్సిపాలిటీ రోడ్ల నిర్వహణలో మాత్రం ఘోరంగా విఫలం చెందింది. ప్రతినిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే రహదారుల పరిస్థితి దయనీయంగా ఉన్నప్పటికీ పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కౌన్సిలర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు తమ ఇంటి ముందు, తమ బంధువుల ఇంటి ముందు చిన్న చిన్న గల్లీల్లో సిమెంటు రోడ్లు వేయమని పైరవీలు చేసి కోట్లాది రూపాయిలను మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేశారు. ఆర్టీసీ బస్టాండు నుండి కడియాల నాగేశ్వరరావు ఆసుపత్రి మీదుగా వెళ్లే రహదారి, బస్టాండు వెనుక నుండి మార్కెట్ మీదుగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రాదారి, జంట సినిమాహాళ్ల రోడ్డు, ఎమ్మార్వో ఆఫీసు నుండి ట్రావెలర్స్ బంగ్లాకు వచ్చే రోడ్డు, మండల పరిషత్ కార్యాలయం ముందు ఉన్న రోడ్డు వంటి ప్రధాన రహదారులు అధ్వాన్నంగా ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. తిరువూరులో ప్రధానమైన పోలీసు స్టేషన్, రెవెన్యూ, ట్రెజరీ వంటి కార్యాలయాల ముందు ఉన్న రోడ్డును గత 50సంవత్సరాల నుండి అలాగే వదిలేశారు. మరొక పక్క నియోజకవర్గ తెదేపా నాయకులు ఎన్.స్వామిదాస్, తాళ్లూరి రామారావు తదితరులతో పాటు ఇతర ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు సిమెంటు రోడ్లు వేసుకుని తమను విస్మరించారని పట్టణ ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ పాలకవర్గం, అధికారులు కళ్లు తెరిచి పట్టణంలో ఉన్న ప్రధాన రహదారులను మరమ్మత్తులు చేయించాలని, వాటిని సిమెంటు రోడ్లుగా మార్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.