కృష్ణాజిల్లాలో బాగా వెనుకబడి ఉన్న తిరువూరు నియోజకవర్గం దాదాపు నలభై సంవత్సరాల నుండి షెడ్యూలు కులాలకు రిజర్వు అయి ఉంటోంది. దీని మూలంగా దిగుమతి నేతలంతా తిరువూరు ఎమ్మెల్యేలుగా ఎన్నికై కొద్దో గొప్పో సంపాదించుకుని వెళ్ళిపోతున్నారు. తిరువూరు షెడ్యులు కులాలకు రిజర్వ్ అయి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కోట రామయ్య, మిరియాల పూర్ణానందం తప్ప అంతా బయటి వారే. స్వామిదాస్ ఈ నియోజకవర్గంలో పెరిగినప్పటికీ ఆయన బంధుత్వాలన్నీ ఇక్కడే ఉన్నప్పటికీ ఆయన పుట్టిన ప్రాంతం గంపలగూడెం మండలం గొసవీడు సరిహద్దుల్లో ఉన్న తెలంగాణాలోని రామన్నపాలెం గ్రామం అని ఆయన ప్రత్యర్థులు అంటూ ఉంటారు. ఎమ్మెల్యేగా పనిచేసిన పిట్టా వెంకటరత్నం జన్మస్థలం ఏ.కొండూరు. వెంకటరత్నం ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో ఎ.కొండూరు మైలవరం నియోజకవర్గంలో ఉండేది. తిరువూరు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వేముల కూర్మయ్య, వక్కలగడ్డ ఆదాం, కోనేరు రంగారావు, దిరిశం పద్మజ్యోతితో పాటు ప్రస్తుత ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి వరకూ అందరూ దిగుమతి బాపతే.
*** మళ్లీ అదే పరిస్థితి…
2019లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయటానికి తెలుగుదేశం, వైకాపా తరఫున చాలా మంది దిగుమతి నేతలు ఇప్పటి నుండే ముమ్మరంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. తెదేపా తరపున ప్రస్తుత నియోజకవర్గ ఇన్‌ఛార్జి నల్లగట్ల స్వామిదాసుతో పాటు రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ చైర్మన్ వర్ల రామయ్య, మాజీ మంత్రి కోనేరు రంగారావు కుమార్తె మాజీ సమాచార హక్కు చట్టం కమీషనర్ లాం తాంతియాకుమారి, మాజీ ఎమ్మెల్యే దిరిశం పద్మజ్యోతి తదితరులు తెదేపా అభ్యర్థిత్వం కోసం ప్రయత్నిస్తున్నారు.
*** వామ్మో…వర్ల రామయ్యే!!!
రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ వర్ల రామయ్య పేరు చెబితేనే స్థానిక దేశం నేతలకు చెమటలు పడుతున్నాయి. రామయ్య ఎమ్మెల్యేగా ఎన్నిక అయితే నియోజకవర్గంలో తమ ఉనికి ఉండదని దేశం నేతలు గజగజలాడుతున్నారు. అలాగని పద్మజ్యోతిని, తాంతియాకుమారిని అస్సలే వద్దంటున్నారు స్థానిక దేశం నేతలు. దూకుడుగా ఉండే వీరిరువురి వ్యవహారశైలి తిరువూరు ప్రజలకు బాగా తెలుసు.
*** స్వామిదాస్ ఫోర్ కొడతారా?
చరిత్రను గమనిస్తే తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న స్థానాల్లో తిరువూరు ఒకటి. గత మూడు పర్యాయాలు కేవలం నాయకత్వ లోపం, స్వామిదాస్ పనితీరుపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి మూలంగానే మూడు సార్లు తిరువూరు సీటు స్వల్ప తేడాతో పరాయి పార్టీల వ్యక్తులు తన్నుకుపోయారు. గత మూడు సంవత్సరాల నుండి స్వామిదాస్‌ను దూరంగా ఉంచిన చంద్రబాబు ఇటీవల ఆయన జన్మదినం సందర్భంగా నోట్లో కేకు పెట్టి స్వామిదాస్లో ఆశలు రేకెత్తించారు. స్వామిదాస్ పట్ల ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి వద్ద, పార్టీ అగ్రనేతల వద్ద ఆయనకు మంచి పేరు ఉంది. స్వామిదాస్‌కు ఈ పర్యాయం తెదేపా అభ్యర్థిత్వం ఇస్తే గెలుస్తారా? లేక చరిత్ర పునరావృతం చేస్తారా..? అనే విషయంపై పార్టీ అధిష్టానం తర్జనభర్జనలు పడుతోంది. ప్రయోగాలు చేయటంలో ముందుండే చంద్రబాబు ఈ పర్యాయం స్థానికుడైన ఎక్శైజ్ మంత్రి కొత్తపల్లి జవహర్‌ను తిరువురుకు పంపుతారా? అనే విషయంపై కూడా చర్చలు సాగుతున్నాయి.
***వైకాపాలోనూ అదే పరిస్థితి
రాముడు మంచి బాలుడే అన్నట్లుగా ప్రస్తుత ఎమ్మెల్యే రక్షణనిధికి ప్రజల్లో మంచి వ్యక్తిగా పేరుంది. వివాదారహితుడిగా, పైసా ఆశించని వ్యక్తిగా రక్షణనిధి మంచి పేరుపొందారు. కానీ రాజకీయ నాయకుడిగా రక్షణనిధి తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండకుండా దూరమయ్యారు. పార్టీ ఇచ్చిన ఆందోళనా కార్యక్రమాలు చేపట్టడం తప్ప ఒక్క సమస్యపైన కూడా రక్షణనిధి వ్యక్తిగతంగా నాయకత్వం వహించి పోరాటం చేయలేకపోయారు. రక్షణనిధి అసమర్థత మూలంగా చాలా మంది తెలుగుదేశం నేతలు, అధికారులు అడ్డగోలుగా అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ఈ పర్యాయం వైకాపా తరఫున రక్షణనిధికి అభ్యర్థిత్వం లభించడం కష్టమని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. తెలుగుదేశం నుండి ప్రలోభాలు వచ్చినప్పటికీ పార్టీకి విధేయుడిగా ఉంటున్న రక్షణనిధి రానున్న సంవత్సరన్నర కాలంలో పనితీరును మెరుగుపరుచుకుంటే మళ్లీ ఆ పార్టీ తరపున పోటీ చేసే అవకాశం ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ 2019 ఎన్నికల్లో తెలుగుదేశం, వైకాపాలు గెలుపు గుర్రాలను రంగంలోకి దించటానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.––కిలారు ముద్దుకృష్ణ.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.